తెలంగాణలో హీట్ పెంచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పెంచాయ్. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో..
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పెంచాయ్. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ తుది జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ రెండు స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవి రంగంలోకి దిగారు. ఇదే స్థానం కోసం బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్ నాగేశ్వర్ పోటీ పడుతున్నారురు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్‌తో పాటు టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, రాణిరుద్రమ దేవి వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు.
కోవిడ్ కారణంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎమ్‌కు బదులు…పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తోంది ఎన్నికల కమిషన్. ఇందులో అభ్యర్థులకు ప్రియారిటీ వారీగా ఓటు వేయాల్సి ఉంది. అభ్యర్థులు పెద్దసంఖ్యలో బరిలో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్‌లో ప్రియారిటీ సమయంలో ఓటర్లు తికమకపడే అవకాశం ఉంది. ఐతే దీనిపై ఎన్నికల కమిషన్ త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశముంది.ఎన్నికల ప్రచారంలో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ జోరుగా ప్రచారం నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఓటర్లకు విజ్ఞప్తులు పంపిస్తున్నారు.
టీఆర్‌ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం:
మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. బీజేపీ చేతిలో ఉన్న హైదరాబాద్ సీటును గెలుచుకోవాల్సిందేనని ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్.. రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ గిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పాజిటివ్ వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోవద్దని అన్నారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ సంసిద్ధతను అనుకూలంగా మలచుకోవడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తప్పకుండా గెలవాలన్నారు. ఖమ్మం స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎలాగూ గెలుస్తున్నారని, బీజేపీ సిటింగ్ స్థానమైన హైదరాబాద్ స్థానంలో కూడా విజయం సాధించాలని నిర్దేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ‘‘దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవిని మనం అభ్యర్థిగా నిలబెట్టడంతో ‘పీవీ బిడ్డ’ అని చెప్పి ఓట్లు వేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. మనకు పాజిటివ్ వేవ్ ఉంది. జనం సంసిద్ధతను ఓట్లుగా ఎలా మలచుకోవాలి? వారిని మెప్పించి.. ఒప్పించి ఎలా ఓట్లు వేయించుకోవాలన్న దానిపై దృష్టి పెట్టాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు. ఉన్న సానుకూలతను ఓట్లుగా మలచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఉదాసీనంగా ఉండొద్దని చెప్పారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివా్‌సగౌడ్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, సబిత పాల్గొన్నారు.
Read more:
అభివృద్ధిని చూసి ఓటేయండి.. శాఖల వారీగా ఉద్యోగాల లెక్కలు చెప్పేసిన మంత్రి ఎర్రబెల్లి