మొన్న జానా.. నేడు వీహెచ్‌.. తెలంగాణ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న సోషల్‌మీడియా వ్యవహారం

తెలంగాణ కాంగ్రెస్‌ను సోషల్‌ మీడియా వ్యవహారం కుదిపేస్తుంది. మొన్న మాజీ మంత్రి జానారెడ్డి, నేడు మాజీ ఎంపీ వీహెచ్‌ ఇలా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు..

  • K Sammaiah
  • Publish Date - 12:52 pm, Sat, 27 February 21
మొన్న జానా.. నేడు వీహెచ్‌.. తెలంగాణ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న సోషల్‌మీడియా వ్యవహారం

తెలంగాణ కాంగ్రెస్‌ను సోషల్‌ మీడియా వ్యవహారం కుదిపేస్తుంది. మొన్న మాజీ మంత్రి జానారెడ్డి, నేడు మాజీ ఎంపీ వీహెచ్‌ ఇలా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న సోషల్‌ మీడియాలో కామెంట్లపై చాలా సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కరెక్ట్‌ కాదని… మీడియా ముందు అరగంటసేపు నేతలకు క్లాస్‌ తీసుకున్నారు. అభిమానులు, అనుచరులు కామెంట్లు చేసినా… వారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిన బాధ్యత నేతలపైనే ఉందన్నారు. లేదంటే ఇది పార్టీకే నష్టమని వార్నింగ్‌ ఇచ్చారు జానారెడ్డి.

మాజీ మంత్రి జానారెడ్డిని సమర్థిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కామెంట్స్‌ చేశారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై జానారెడ్డి స్పందించడం శుభపరిణామం అన్నారు వీహెచ్‌. చాలా రోజుల నుండి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నారని, TPCCకి చాలా సార్లు పిర్యాదు చేసామన్నారు వీహెచ్‌. అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటే కావాలనే ఇంకో మీటింగ్ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా హైకమాండ్‌ ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదన్నారు.

పీవీకి ప్రధాని పదవి ఇచ్చిన కాంగ్రెస్‌ గొప్పదా… ఆయన కూతురు వాణికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన టీఆర్‌ఎస్‌ గొప్పదా అని ప్రశ్నించారు జానారెడ్డి. ప్రధాని పదవి ఇచ్చిన కాంగ్రెస్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఆ కుటుంబానికి ఉంటుందన్నారు జానారెడ్డి. అయితే జానారెడ్డి రియాక్షన్ పట్ల గాంధీభవన్‌లో భిన్న వాదనలు నడుస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనో పెద్ద మనిషి. పదవి ఉన్నా… లేకపోయినా ఆ పెద్దరికాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకోగానీ… ఇన్నాళ్లు చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి గాంధీభవన్‌కొచ్చి… ప్రెస్‌మీట్‌ పెట్టారు. నేతలకు, కేడర్‌కు ఒక గంట క్లాస్‌ తీసుకున్నారు. ఇంతకీ ఎవరినైనా ఆయన టార్గెట్‌ చేశారా? లేదంటే అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నమా? ఈ సడన్‌ మార్పు ఎందుకోసం? ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

ఇందులో స్పెషాలిటీ ఏంటి అనుకోవచ్చు. కానీ ఇప్పుడే ప్రెస్‌మీట్‌ పెట్టడం వెనుక చాలా ప్రత్యేకతే ఉందన్నది గాంధీభవన్‌ వర్గాల మాట. 2018లో ఓడిపోయిన తర్వాత పెద్దగా ప్రెస్‌మీట్‌ పెట్టలేదు జానారెడ్డి. ఈ మధ్య కాలంలో సాగర్‌లో ఒకసారి, హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఒకసారి మాత్రమే మీడియాతో మాట్లాడారు. రెండు నెలల కిందట టి.పీసీసీ రేస్‌ కోసం జరిగిన చర్చల్లోనూ పాల్గొన్నారు జానారెడ్డి. తన అభిప్రాయాలేంటో చెప్పారు. కానీ మీడియాతో మాట్లాడలేదు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న వార్‌ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. జగ్గారెడ్డి, వీహెచ్‌ లాంటి వాళ్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ… విమర్శలు చేశారు. కొందరు నేతల్ని టార్గెట్‌ చేసుకుని సోషల్‌ మీడియాలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నది సీనియర్‌ నేతల అభ్యంతరం. గతంలో ఎప్పుడూ లేని కల్చర్‌ను తీసుకొచ్చి పార్టీలో వాతావరణాన్ని చెడగొడుతున్నారని, హైకమాండ్‌ యాక్షన్‌ తీసుకోవాలంటూ మాట్లాడారు. అప్పుడు కూడా జానారెడ్డి ఏ మాత్రం రియాక్ట్‌ కాలేదు.

ఆ వివాదంపై పెద్దగా చర్చ లేని సమయంలో… దానిపై గంటసేపు నేతలకు, కార్యకర్తలకు జానారెడ్డి క్లాస్‌ తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా ఉంటే… అంతర్గత భేటీల్లో చర్చించుకోవాలి కానీ సోషల్‌ మీడియాలో విమర్శలు చేయడం ఏంటన్నది జానా అభ్యంతరం. వీహెచ్‌ లాంటి వాళ్లకు ఫోన్‌ చేసి తిట్టడం ఏంటని కూడా ప్రశ్నించారాయన. ఇలాంటి ఇష్యూలు ఒకటి కాదు… 12 ఉన్నాయని చాలా పెద్ద బాంబే పేల్చారు జానా. ఈ పద్ధతి మంచిది కాదని తీరు మార్చుకోవాలని ఒక పెద్ద మనిషిగా అందరికీ వార్నింగ్‌ ఇచ్చారు జానారెడ్డి.

జానారెడ్డి ఎవరికి వార్నింగ్‌ ఇచ్చారనే దానిపై కాంగ్రెస్‌లో హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాపై రెండు, మూడు నెలల నుంచి చర్చ జరుగుతున్నా రియాక్ట్‌ కాని… ఈ పార్టీ పెద్దాయన ఇప్పుడే ఎందుకు సీరియస్‌ అయ్యారో అన్నది ఆసక్తిగా మారింది. ఇదే సందర్భంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరుపైనా తనదైన శైలిలో కామెంట్స్‌ చేశారు జానా. పీవీకి ప్రధాని పదవి ఇచ్చిన కాంగ్రెస్‌ గొప్పదా… ఆయన కూతురికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన టీఆర్‌ఎస్‌ గొప్పదా ఆలోచించాలన్నారు.

2018కు ముందు… అసెంబ్లీలోనూ, బయటా సర్కార్‌కు సూటిగా ఇలాంటి ప్రశ్నలు సంధించే వారు వారు జానారెడ్డి. కానీ రెండేళ్ల నుంచి పెద్దగా రియాక్ట్‌ కావడం లేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రత్యేకంగా గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టడం వెనుక… సాగర మథనం ఏమైనా ఉందా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే వారంలోనే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రాబోతోందన్న ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి మళ్లీ యాక్టివ్‌ అయ్యారని, పార్టీలో పెద్ద మనిషిగా అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూనే… టీఆర్‌ఎస్‌పై విమర్శలు సంధించడం మొదలు పెట్టారని గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more:

తప్పుడు ప్రచారం చేస్తే తుక్కు రెగొట్టండి… ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గులాబీ‌ శ్రేణులకు నేతల సూచనలు