ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ యాక్షన్‌ప్లాన్.. ప్రియాంకకు రాష్ట సారథ్య బాధ్యతలు

యూపీ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌గా ప్రియాంకను నియమించే అవకాశాలున్నాయి. 403 అసెంబ్లీ సీట్లున్న దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో, జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వ వైభవం..

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ యాక్షన్‌ప్లాన్.. ప్రియాంకకు రాష్ట సారథ్య బాధ్యతలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 26, 2021 | 10:41 PM

Priyanka Gears Up :  2022లో జరుగబోయే ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటినుంచే యాక్షన్‌ప్లాన్‌ మొదలుపెట్టింది. యూపీ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌గా ప్రియాంకను నియమించే అవకాశాలున్నాయి. 403 అసెంబ్లీ సీట్లున్న దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో, జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది.

ఇదే జరిగితే ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టిన తొలి గాంధీ కుటుంబీకురాలిగా ప్రియాంక గాంధీ చరిత్రలో నిలుస్తారు. యూపీలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీలు ఇది వరకే తమ ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా పావులు కదుపుతోంది. ప్రియాంక గాంధీకి పూర్తి స్థాయి రాష్ట సారధ్య బాధ్యతలు అప్పజెప్పి, అత్యధిక స్థానాల్లో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఈ క్రమంలో లక్నోలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి మరమత్తులు కూడా మొదలు పెట్టింది. ప్రియాంక గాంధీ తన నివాసాన్ని గురుగావ్‌ నుంచి లక్నోకు మారుస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అని తెలుస్తోంది. 2019 జనవరిలో రాష్ట్రంలోని తూర్పు ప్రాంత ఇంచార్జీగా నియమితురాలైన ప్రియాంక, ఆతరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆమె ఇంచార్జీగా ఉన్న ప్రాంతంలో ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ (అమేధీ) సైతం ఓటమిపాలయ్యారు.

ఆమె సారధ్యంలో కేవలం ఆమె తల్లి సోనియా గాంధీ (రాయ్‌బరేలీ) మాత్రమే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెకు పూర్తి స్థాయి రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది. గత 32 సంవత్సరాలుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోవడంతో క్యాడర్‌ మొత్తం చెదిరిపోయిందని, ప్రియాంక రాకతో పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వీలైనప్పుడల్లా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు ప్రియాంక. ప్రజా సమస్యలపై వీలైనప్పుడల్లా తన గళం విన్పిస్తున్నారు.