AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penukonda Poltics: పెనుగొండ రాజకీయాల్లో పెను మార్పులు.. తాజా మాజీ చుట్టే జిల్లా పాలిటిక్స్‌

కాయిన్ కు రెండు వైపులా రూపం ఉన్నట్టు.. పొలిటికల్ లీడర్లలో కూడా రెండు కోణాలు ఉంటాయి.. ఒకటి పదవి ఉన్నప్పుడు కనిపిస్తుంది.. రెండవ పదవి పోయాక కనిపిస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఆ మాజీ మంత్రి విషయంలో ఇదే జరుగుతోందట.

Penukonda Poltics: పెనుగొండ రాజకీయాల్లో పెను మార్పులు.. తాజా మాజీ చుట్టే  జిల్లా పాలిటిక్స్‌
Mla Sankaranarayana
Sanjay Kasula
|

Updated on: Jun 13, 2022 | 7:14 PM

Share

మంత్రిగా ఉన్నప్పుడేమో సౌమ్యుడి, వివాద రహితుడు.. కానీ మంత్రి పదవి పోయాక కంప్లైంట్ల మీద కంప్లైంట్లు సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు అది చాలదట్టు ఏకంగా జిల్లా కలెక్టరే ఆ మాజీ మంత్రి పై ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రి పదవొచ్చాక శంకర్‌ నారాయణలో మార్పొచ్చిందా? విషయాలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారా? ఏపీలో తాజాగా మంత్రి పదవులు కోల్పోయిన నేతల గురించి కథకథలుగా చెప్పుకొంటున్నారు పొలిటికల్‌ జనం. అలాంటి నాయకుల జాబితాలో ఎవరూ ఊహించని విధంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ(Malagundla Sankaranarayana) పేరు కూడా చేరింది. జగన్ క్యాబినేట్లో వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, పార్టీకి విధేయుడిగా పేరొందిన శంకర్‌నారాయణ.. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగించేదే. పెనుకొండ నుంచిగెలిచిన ఆయనకు అనుకోకుండా మంత్రి పదవి ఇచ్చారు జగన్‌. క్యాస్ట్‌ ఈక్వెషన్సో మరేమిటో తెలియదు.. తొలిదఫా కేబినెట్‌లో ఛాన్స్‌ కొట్టేశారు శంకర్‌ నారాయణ. అయితే, మంత్రి పదవి వచ్చాక… ఆయన తీరులో చాలా మార్పొచ్చింది. అవన్నీ పెనుకొండ గడప దాటి మాత్రం.. బయటకు రాలేదు. అంతా కూల్‌గానే ఉన్నట్టు కనిపించింది. అసలు జిల్లాలో మంత్రి ఉన్నారా? లేరా? అన్నట్టే ఉండేది వ్యవహారం. సొంత పార్టీలో కూడా ఎక్కడా విబేధాలు లేకుండా మూడేళ్లు బండి లాగించారు….

తాజాగా, మాజీ అయిన శంకర్‌ నారాయణపై… విమర్శలు, ఆరోపణలు ఓ రేంజ్‌లో వెల్లువెత్తుతున్నాయి. అవన్నీ చేస్తున్నది ప్రతిపక్షమోళ్లు కాదు.. సొంత పార్టీ నేతలే కావడం మరో విశేషం. వారు కూడా ఆషామాషీ నేతలు కాదు.. టీడీపీకి కంచుకోటలాంటి పెనుకొండలో శంకర్ నారాయణ గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలే. తమ అభ్యర్థికోసం లక్షలకులక్షలు ఖర్చు పెట్టినవారే ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి, ఆయన సోదరులు సాగిస్తున్న వ్యవహారాలపై.. వైసీపీ కోఆర్డీనేటర్, మంత్రి పెద్దిరెడ్డికీ… పనిలో పనిగా హైకమాండ్‌కు పూర్తి వివరాలు అందించారట. పార్టీ కోసం కష్టపడిన తమపైనే కేసులు పెడుతున్నారనీ… తమ వ్యాపారాల్లో వాటా కోసం శంకర్ నారాయణ సోదురులు ఒత్తిడి చేస్తున్నారన్నది వాళ్లు చేస్తున్న ప్రధాన ఆరోపణ. మాట వినకుంటే, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారనీ… పార్టీ పెద్దల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే, ఈ ఆరోపణలు, విమర్శలు.. నో కామెంట్‌ అన్నట్టుగా సైలెన్స్‌ మెయింటెన్‌ చేస్తున్నారు మాజీ మంత్రి.

ఇప్పుడీ వ్యవహారం ఉన్నతాధికారుల దాకా వెళ్లింది. మాజీ మంత్రిపై ఏకంగా ఓ గ్రామం గ్రామమే తరలివచ్చి… జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం ఈదుల బలాపురం గ్రామస్థులు… శంకర్ నారాయణపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ… తమ గ్రామానికి రేషన్ రాకుండా మాజీ మంత్రి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వైసిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నాగభూషణ్ రెడ్డి, సర్పంచ్ రామక్కలకు… ఇటు శంకర్‌ నారాయణ వర్గానికి విభేదాలున్నాయి. ఈ కారణంతో ఆ గ్రామానికి రేషన్ బియ్యం వెళ్లకుండా అడ్డుకున్నారట మాజీ మంత్రి. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఏకంగా కలెక్టర్‌కే కంప్లయింట్ చేశారు గ్రామస్తులు. ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు నెలలుగా ఆ గ్రామానికి రేషన్ బియ్యం రావడం లేదట మరి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడీ మాజీ మంత్రి వ్యవహారం.. రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌ అయ్యింది. ఓ గ్రామమంతా వచ్చి.. మాజీ మంత్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడమేదైతే ఉందో… అది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఎపిసోడ్‌తో… ఇన్నాళ్లూ సైలెంట్‌గా కనిపించిన శంకర్ నారాయణలో ఇన్ని కోణాలున్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు పొలిటికల్‌ జనం. మరి, దీనిపై వైసీపీ హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.