జీడీపీకి అసలు ఫుల్ ఫాం ఏంటి..? మంత్రి కేటీఆర్‌ ట్వీట్ కు నెటిజన్ల అదిరిపోయే సమాధానాలు

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తుంది. పట్టభద్రుల ఓట్లను ఆకర్షించేందుకు..

జీడీపీకి అసలు ఫుల్ ఫాం ఏంటి..? మంత్రి కేటీఆర్‌ ట్వీట్ కు నెటిజన్ల అదిరిపోయే సమాధానాలు
Follow us

|

Updated on: Feb 27, 2021 | 6:37 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తుంది. పట్టభద్రుల ఓట్లను ఆకర్షించేందుకు విమర్శలతో హీట్‌ పెంచుతున్నారు. మీరు ఒక్కటంటే మేం పదంటాం.. మీరు పదంటే మేం వంద అంటామంటూ ఎవరూ తగ్గడం లేదు. జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్లడిగే హక్కు మాదంటే మాదేనంటూ ఎవరికి వారే జబ్బలు చరుచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్‌ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిరంత‌రం పెరుగుతున్న ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అయినా ఇవేవీ ప‌ట్ట‌‌న్న‌ట్టుగా కేంద్రం వ్య‌వ‌హరిస్తోందనే విమర్శలు ఇంటా బయటా వ్యక్తమవుతున్నాయి.

ఇదే అంశంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం అస‌మాన ప‌నితీరు వ‌ల్ల పెరిగిపోతున్న జీడీపీకి అస‌లు ఫుల్ ఫాం ఏంటి అని నెటిజ‌న్ల‌ను ప్ర‌శ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ.. గ్యాస్, డీజిల్‌, పెట్రోల్ అని గుజ‌రాత్‌, డీజిల్ పెట్రోల్ అని పెద్ద ఎత్తున స‌మాధానాలిచ్చారు.

జీడీపీ(గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడ‌క్ట్‌‌) అనగా స్థూల జాతీయోత్పత్తి. ఒక దేశంలోని ఆర్థిక కార్యకలాపాల విలువను జీడీపీతో కొలుస్తారు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అర్థం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి అనే మాట అటుంచితే తన చర్యలతో సామాన్యుల నడ్డి విరగ్గొడుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ. 400 ఉండే గ్యాస్‌ రూ. 800, రూ. 60 రూపాయలు ఉన్న పెట్రోలు రూ.100, డీజిల్‌ ప్రస్తుతం రూ.89, గతంలో రూ. 80 ఉన్న మంచినూనె రూ. 150 అయింది.

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదల ప్రతీ నిత్యావసర వస్తువుపై పడుతుండటంతో పేద, మధ్య తరగతి బ్రతుకులు భారమౌతున్నాయి. పసి పిల్లలు తాగే పాల ధరలపైనా పెట్రోల్‌ ధరల ప్రభావం పడుతుంది. అచ్ఛేదిన్‌ అని జనం చచ్చే దిన్‌ తెచ్చారని అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ హాయాంలో జీడీపీ పెంచుతామంటే దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువెళతారనుకున్నాం కానీ ఇలా గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచుతూపోతారని అనుకోలేదని అంటున్నారు.

మొత్తానికి ప్రతిపక్షాలపై పదునైన మాటలతో తనదైన శైలిలో విమర్శించే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. ఓ ట్వీట్‌ ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల నుంచైతే రెస్పాన్స్‌ చూశాం. ఇక బీజేపీ నేతల నుంచి ఎలాంటి కౌంటర్‌ ఉంటుందోననే అంశం చర్చనీయాంశంగా మారింది.

Read More:

కేంద్రానివన్నీ తెలంగాణ కాపీ పథకాలే.. విభజన హామీలు నెరవేర్చని పార్టీలను ఓడించాలన్న హరీశ్‌రావు