AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR TOUR: హస్తినలో కేసీఆర్.. ఈసారి మారిన రూటు.. బీజేపీయేతర, కాంగ్రెసేతర నేతలకే ప్రాధాన్యత.. వ్యూహం మార్పులో మతలబిదే!

ఈ పర్యటన ‘‘అయినని హస్తినకు పోయిరావలె’’ అన్నట్లుగా కాకుండా.. రాజకీయ యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసే విధంగా రూపొందించుకున్నారు గులాబీ దళపతి. గత కొన్ని రోజులుగా...

KCR TOUR: హస్తినలో కేసీఆర్.. ఈసారి మారిన రూటు.. బీజేపీయేతర, కాంగ్రెసేతర నేతలకే ప్రాధాన్యత.. వ్యూహం మార్పులో మతలబిదే!
Kcr Modi
Rajesh Sharma
| Edited By: |

Updated on: May 20, 2022 | 8:15 PM

Share

KCR TOUR OF NEWDELHI TELANGANA CM STRATEGY CHANGED NOW: కేసీఆర్ న్యూఢిల్లీకి పయనమయ్యారు. సాధారణంగా అయితే ఇది మామూలే కదా ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళడం, అక్కడి కేంద్రం పెద్దలను కల్వడం సర్వ సాధారణమే కదా అనుకునే వాళ్ళం. కానీ గత కొంత కాలంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉద్దేశం వేరు. కేంద్రంతో రాష్ట్ర ప్రయోజనాలు చర్చించి ఉపయోగం లేదనుకున్న కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ పెద్దలపై యుద్దాన్ని ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత ఆయన చేసే ప్రతీ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా మరోసారి మే 20న కేసీఆర్ హస్తినాపురం చేరుకున్నారు. ఈ పర్యటన ‘‘అయినని హస్తినకు పోయిరావలె’’ అన్నట్లుగా కాకుండా.. రాజకీయ యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసే విధంగా రూపొందించుకున్నారు గులాబీ దళపతి. గత కొన్ని రోజులుగా ఇటు హైదరాబాద్(Hyderabad) ప్రగతి భవన్‌(Pragathi Bhavan)లోను, అటు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌( Erravalli Farm House)లోను పలువురితో సుదీర్ఘ మంతనాలు కొనసాగించిన కేసీఆర్ ఆ సమాలోచనల సారాంశంతో ఢిల్లీ పర్యటన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతు ఉద్యమ కాలంలో అసువులు బాసిన కర్షక కుటుంబాలకు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తరపున ఆర్థిక సాయం చేయబోతున్నారు. అదేసమయంలో దేశం కోసం అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ సిద్దం చేసుకున్నట్లు టీఆర్ఎస్(TRS) వర్గాలు చెబుతున్నాయి. మే 20న ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. 26వ తేదీ వరకు దేశ రాజధానిలోనే వుంటారని తెలుస్తోంది. ఆ తర్వాత మే 27న బెంగళూరు వెళ్ళి.. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ కన్నడ సీఎం కుమార స్వామిలతో భేటీ అవుతారని అంటున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. దేశవ్యాప్తంగా పదిరోజులపాటు పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో ఆయన టూర్‌ ఉంటుంది. హస్తినలో పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం అవుతారు. మీడియా రంగానికి చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై పలువురితో చర్చించనున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ యేతర శక్తిగా ఎదగాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు జాతీయ నేతలతో సమావేశమైయ్యారు. మలి దఫా టూర్‌కు తాజాగా శ్రీకారం చుట్టారు. ఢిల్లీ పర్యటన కొనసాగుతుండగానే మధ్యలో ఒకరోజు అంటే మే 22న చండీఘడ్‌(Chandigarh) వెళతారని తెలుస్తోంది. 26న బెంగళూరు(Bengaluru) పర్యటన తర్వాత 27వ తేదీన మహారాష్ట్ర(Maharashtra)లోని రాలేగావ్ సిద్ధికి వెళ్ళి.. అన్నా హజారేతో భేటీ అవుతారని తెలుస్తోంది. మే 29,30 తేదీల్లో బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ తలపెట్టినా.. ఇంకా అక్కడి నేతలతో తేదీలు ఖరారు కాలేదని సమాచారం.

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం వెనుక రకరకాల ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బలంగా మారిన బీజేపీని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టకపోతే ప్రాంతీయంగా తమ పార్టీకి ఇబ్బందులు తప్పవని గుర్తించడం వల్లనే బీజేపీ అధినాయకత్వమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహరచన జరిగిందంటున్నారు. నిజానికి 2018లో బీజేపీని తమకు ధీటైన ప్రత్యర్థిగా కేసీఆర్ భావించలేదు. కానీ తదనంతర పరిణామాలు వేగంగా మారిపోయాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు (గోషా మహల్ – రాజాసింగ్) గెలుచుకున్న బీజేపీ.. ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పరిస్థితిని మెరుగుపరుచుకుంది. జాతీయ రాజకీయాల్లో మోదీ చరిష్మాకు స్థానికంగా నేతల ప్రభావం కూడా ఎంతో కొంత జత కల్వడంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. సికింద్రాబాద్ నుంచి జి.కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు ఎంపీలుగా గెలిచి ఢిల్లీ వెళ్ళారు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన మెరుగైన ఫలితాలు తెలంగాణ బీజేపీ నేతల్లో ఉత్సాహం నింపింది. అదే ఊపునకు స్థానికంగా అభ్యర్థులపై సానుభూతి జత కల్వడంతో ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ బీజేపీ తరపున గెలుపొందారు. నాలుగు లోక్ సభ స్థానాలు.. ఉప ఎన్నికల్లో బీజేపీ దూకుడు గమనించిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంథాలో గణనీయమైన మార్పు కనిపించింది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నీరుగార్చిన నింపాదిగా వున్న కేసీఆర్‌కు బీజేపీ ఎదగడం భవిష్యత్ ప్రమాదాన్ని సూచించింది. బీజేపీ దూకుడు ఒకవైపు.. రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం గమనించిన కేసీఆర్.. జాతీయ స్థాయిలో ముందుగా బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. కారణమేదైతేనేం కాంగ్రెస్ పార్టీపై తొలినాళ్ళలో పెద్దగా కామెంట్ చేయలేదు గులాబీ బాస్. కానీ ఇటీవల రాహుల్ పర్యటన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను, తన కుటుంబాన్ని వదలబోమంటూ ప్రకటించిన తర్వాత బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాల్సిందేనన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు డిఎంకే, ఎన్సీపీ, శివసేన, జార్ఖండ్ ముక్తిమోర్చా వంటి పార్టీల నేతలతో కలుస్తూ వచ్చిన కేసీఆర్.. తాజా ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్, బీజేపీలతో డిస్టెన్స్ మెయింటేన్ చేస్తున్న పార్టీల నేతలతో భేటీ కాబోతున్నారు. కర్నాటకలో దేవెగౌడ, బెంగాల్లో దీదీలతో భేటీకి ఇపుడు కేసీఆర్ ప్రాధాన్యతనిస్తున్నారు.

బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలను ఒక్కతాటి మీదకి తెచ్చే సంకల్పాన్ని భుజానికెత్తుకున్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో ఆ పార్టీల వైఫల్యాలను క్రోడీకరిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించినా.. ఇంకో ఎన్నో రంగాల్లో చేయాల్సిన దానిలో 10 శాతం కూడా చేయలేకపోయాయని కేసీఆర్ అంటున్నారు. అందుకు దేశంలో అందుబాటులో వున్న నీటి వనరులను, వాటిని వినియోగించుకుంటున్న పరిమాణాలను కేసీఆర్ కొన్ని మీడియా భేటీలలో ప్రస్తావించారు. నదీజలాల లభ్యత ఎంతో వున్నా అందులో హెచ్చు శాతం సముద్రం పాలవుతోందని, అందుకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆయనంటున్నారు. ఇలాంటి అంశాలను క్రోఢీకరించేందుకు కేసీఆర్.. రిటైర్డ్ అధికారులు, ఆయా రంగాలలో అనుభవం వున్న సామాజిక వేత్తలు, సీనియర్ వృత్తినిఫుణులతో సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. ఈ భేటీలకు ముందే ప్రశాంత్ కిశోర్ వంటి రాజకీయ వ్యూహకర్తతో ఆయన వరుస భేటీలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో చురుకుగా మారేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నారు. ఆ తర్వాత మలిదశగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు కేసీఆర్. ఈ పర్యటనలో కేసీఆర్ ఎలాంటి సానుకూల ఫలితాలను సాధిస్తారో వేచి చూడాలి.