Pawan Kalyan: మిగిలిన రోడ్ల సంగతేంటి.. ఏపీ సర్కార్‌ను ప్రశ్నించిన జనసేన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. నగరంలోని రోడ్లపై గుంతలు పూడ్చడం ద్వారా శ్రమదానం కార్యక్రమం నిర్వహించి
Pawan Kalyan Shramadanam: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. నగరంలోని రోడ్లపై గుంతలు పూడ్చడం ద్వారా శ్రమదానం కార్యక్రమం నిర్వహించి అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అనంతరం పవన్ అనంతపురం జిల్లా పర్యటనకు వెళతారు. ఈ మేరకు జనసేన పార్టీ కొంచెం సేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజమండ్రిలో రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్న వార్త క్లిప్పింగులను జతచేస్తూ రాష్ట్రంలో మిగిలిన రోడ్ల సంగతేంటి జగన్ గారూ.. అంటూ నాదేండ్ల ట్వీట్ చేశారు.
అయితే, కాటన్ బ్యారేజీ మీద పవన్ కళ్యాణ్ చేసే శ్రమదాన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు అధికారులు. శ్రమదానానికి అనుమతి లేదని ప్రకటించారు ఇరిగేషన్ ఎస్‌ఈ. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్న, కాబట్టి అనుమతి కుదరదని స్పష్టం చేశారు. అయితే, బ్యారేజీపై శ్రమదానం చేసి తీరతామని చెబుతున్నారు జనసేన కార్యకర్తలు.
ఇలా ఉండగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొని ఆయన శ్రమదానం చేయాలని భావించారు. ఆ రోజు ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయతలపెట్టారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టాలని కూడా పవన్ నిర్ణయించారు. అటు అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఓ రోడ్డుకు మరమ్మతు చేపట్టే కార్యక్రమాన్ని జనసేన చేపట్టాలని నిర్ణయించుకుంది.
రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను మరమ్మతు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం తెలిసిందే. నాలుగు వారాలు గడువునా ప్రభుత్వం ఇంకా ఎలాంటి మరమ్మతులు చేపట్టడకపోవడం పట్ల ఆ పార్టీ మండిపడింది. పాడైన రోడ్లను సరిచేసే విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ పాడైన రహదారుల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతారని తెలిపారు. అయితే, రేపటి ఈ కార్యక్రమం ఎలా సాగుతుందన్న అంశంపై ఏపీలో ఉత్కంఠ నెలకొంది.
Thanks @ysjagan garu? @PawanKalyan గారు శ్రమదానంతో రోడ్లకు రిపేర్ చేస్తామన్న ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పనులు చేస్తున్నారు. మిగిలిన రోడ్ల సంగతి కూడా చూడండి.#JSPForAP_Roads pic.twitter.com/EuUqFnfc0j
— Manohar Nadendla (@mnadendla) October 1, 2021