AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎస్ బదిలీకి మతం రంగు.. ప్లాన్ ఎవరిదంటే ?

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రమణ్యాన్ని తప్పించాలన్న నిర్ణయం పూర్తిగా అధికారపరమైనదే అయినా దానికి మతం రంగు పులిమే ప్రయత్నం జరుగుతున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. చీఫ్ సెక్రెటరీగా ఎవరిని నియమించుకోవాలన్నది ముఖ్యమంత్రి విచక్షణకు..ఆయన కన్వీనియెన్స్‌కు సంబంధించిన విషయం. సీనియారిటీ ఒక క్రైటీరియా అయినప్పటికీ.. ముఖ్యమంత్రి అనుకున్న అధికారే సీఎస్ హోదాకు వస్తారు. ఒక్కోసారి అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా వుండే అవకాశం కూడా వుంటుంది. అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో […]

సీఎస్ బదిలీకి మతం రంగు.. ప్లాన్ ఎవరిదంటే ?
Rajesh Sharma
|

Updated on: Nov 05, 2019 | 4:28 PM

Share
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రమణ్యాన్ని తప్పించాలన్న నిర్ణయం పూర్తిగా అధికారపరమైనదే అయినా దానికి మతం రంగు పులిమే ప్రయత్నం జరుగుతున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది.
చీఫ్ సెక్రెటరీగా ఎవరిని నియమించుకోవాలన్నది ముఖ్యమంత్రి విచక్షణకు..ఆయన కన్వీనియెన్స్‌కు సంబంధించిన విషయం. సీనియారిటీ ఒక క్రైటీరియా అయినప్పటికీ.. ముఖ్యమంత్రి అనుకున్న అధికారే సీఎస్ హోదాకు వస్తారు. ఒక్కోసారి అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా వుండే అవకాశం కూడా వుంటుంది. అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో ఆయనకు ఇష్టం లేకపోయినా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీకి సీఎస్‌గా వచ్చారు.
ముఖ్యమంత్రికి సన్నిహితులుగా మెలిగిన వారు కూడా ఒక్కోసారి బదిలీలకు గురవుతుంటారు. వివిధ శాఖలకు వెళుతూ వుంటారు. అలాగే ఇప్పుడు ఎల్వీ సుబ్రమణ్యం వంతు వచ్చింది. వాస్తవానికి ఈ సీఎస్ ను జగన్ ప్రభుత్వం నియమించుకోలేదు. ఆయన ఎన్నికల సంఘం నియమించబడిన వ్యక్తి.
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడి అనుకూల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ బదిలీల్లో నాటి సీఎస్ కూడా ఉన్నారు. ఆ స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎన్నికల కమిషన్ అపాయింట్ చేసింది. ఎల్వీ నియామకాన్ని టిడిపి మాగ్జిమమ్ రాజకీయం కూడా చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డైరెక్షన్‌లోనే ఎల్వీని ఏపీకి సీఎస్‌గా చేశారని టిడిపి అప్పట్లో ఆరోపించింది.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎల్వీ, జగన్ మధ్య సూపర్బ్ సయోధ్య వున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ అయిదు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. ముఖ్యమంత్రితో పలు అంశాల్లో విభేదించడం, ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేయడం ఎల్వీ బదిలీకి కారణమైందని క్లియర్‌గా తెలుస్తోంది.
అయితే ఈ అంశం ఇప్పుడు మతం రంగు పులుముకుంటోంది. బిజెపిలో వున్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు… హిందు మత ఆలయాల్లో అన్య మతస్తులు లేకుండా ఎల్వీ చర్యలు తీసుకుంటున్నందునే ఆయనను జగన్ తప్పించారంటూ ట్వీట్ చేశారు. ఐవైఆర్ కొద్దికాలం క్రితమే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ వెనుక బిజెపి అధినాయకత్వం వుంది అన్న ప్రచారం మొదలైంది.
గతంలో టిటిడి ఈవోగా పనిచేసిన ఎల్వీ.. బోర్డు పరిధిలో అన్యమతస్థులు లేకుండా పెద్ద యాక్షన్ ప్లానే అమలు చేశారు. దానికి కొనసాగింపుగానే ఎల్వీ సీఎస్ హోదాలో మరిన్ని చర్యలు తీసుకున్నారన్నది కొందరి వాదన. ఈ వాదనను గట్టిగా సమర్థిస్తున్న బిజెపి నేతలే తాజాగా ఎల్వీ తొలగింపునకు మతం రంగు పులుముతున్నారని భావిస్తున్నారు.