Tammineni: కేసీఆర్ సర్కారుపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాజిటివ్ కామెంట్స్.. తప్పంటూ విపక్షాలకు సలహా
ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజకీయ దురుద్దేశంతో
CPM Tammineni Veerabhadram – Dalita Bandhu: ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది దళిత బంధుని వ్యతిరేకిస్తున్నారన్న ఆయన, దళిత బంధు విజయవంతమైతే తమ భవిష్యత్తు దెబ్బతిని, ఎన్నికల్లో ఓటమి చెందుతామని విపక్షాలు ఆలోచించడం సరైందికాదన్నారు. పేద ప్రజలకు లబ్ది జరిగే పథకాలను అన్నిపార్టీలూ ఆహ్వానించాల్సిందేనని చెప్పిన ఆయన, దళిత బంధు నేపథ్యంలో ఇతర వర్గాల నుండి వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచన చేయాలని వీరభద్రం కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకు ముందే ఎన్నికల వాతావరణం మొదలైందని వ్యాఖ్యానించిన తమ్మినేని, రాష్ట్రంలో కొత్త పార్టీలు రావడం మంచిదే.. వారి విధివిధానాలనుబట్టి సీపీఎం స్పందిస్తుందిని వైయస్ షర్మిల కొత్త పార్టీపై కామెంట్ చేశారు. అభ్యుదయ ఆలోచనలతో, పేద ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో ముందుకు వచ్చే కొత్త పార్టీలకు సీపీఎం పార్టీ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాల పేరుతో ఎన్నికల ప్రయోజనాల కోసమే ఆంధ్ర తెలంగాణా సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారని తమ్మినేని వీరభద్రం అన్నారు.
పోతిరెడ్డిపాడు పేరుతో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణా జలాల దోపిడీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన సీపీఎం రాష్ట్రకార్యదర్శి.. స్నేహంగా ఉండే ఇద్దరు సీఎంలు ముఖ్యమైన కృష్ణా జలాల సమస్య మీద ఎందుకు చర్చించడంలేదని ప్రశ్నించారు. పిల్లిపిల్లి తగువు ఇంకెవరో తీర్చిన చందంగా కృష్ణా జలాల వివాదం పై ఇరు రాష్ట్రాలు కేంద్రానికి పెత్తనం ఇస్తున్నారని తమ్మినేని అన్నారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం అంతరాష్ట్ర జలాల హక్కులను లాగేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా తమ్మినేని టీవీ9తో పలు అంశాలపై మాట్లాడారు. కరోనా రెండో వేవ్ లో విఫలమైన నేపథ్యంలో మూడో వేవ్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు అప్రమత్తం కావాలన్నారు తమ్మినేని వీరభద్రం.