Kannababu: రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది.. రియల్ ఎస్టేట్ కోసమే బాబు ప్రలోభాలు: మంత్రి కన్నబాబు
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. గత పాలకుల పుణ్యమాని హైదరాబాద్‌లోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకృతమైందన్నారు.
AP Minister Kannababu: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. గత పాలకుల పుణ్యమాని హైదరాబాద్‌లోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకృతమైందన్నారు. అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ఏపీ ప్రజల్ని మభ్యపెడుతున్నారని మంత్రి విమర్శించారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఐదేళ్లూ అభివృద్ధి చేయకుండా బాహుబలి గ్రాఫిక్స్ తో కాలయాపన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఉద్యమం పేరుతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.
మంత్రి కన్నబాబు ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణను తన స్వార్థం కోసం చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని కన్నబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని సీఎం జగన్ భావించారన్న కన్నబాబు.. అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా స్వార్థంతో చంద్రబాబు ప్రవర్తించినందునే గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందారని మంత్రి ఎద్దేవా చేశారు. అమరావతిలో పెట్టిన తమ పెట్టుబడులకు తగిన రాబడులు రావనే కారణంతోనే బాబు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారని కన్నబాబు ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి రాజధానిగా ఉండాలని చంద్రబాబు అంటున్నారని కన్నబాబు విమర్శించారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా కన్నబాబు తెలిపారు. మంగళగిరిలో ఓటమిపాలైనా నారాలోకేష్ మైండ్ సెట్ ఏమాత్రం మారలేదని కన్నబాబు విమర్శించారు.