ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డీలా, కోల్ కతాలో ర్యాలీకి అనుమతించని పోలీసులు

అఖిల భారత మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం కోల్ కతా లో నిర్వహించదలచిన ర్యాలీకి పోలీసులు అనుమతిని తిరస్కరించారు.

  • Umakanth Rao
  • Publish Date - 11:36 am, Thu, 25 February 21
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డీలా,  కోల్ కతాలో ర్యాలీకి అనుమతించని పోలీసులు

అఖిల భారత మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం కోల్ కతా లో నిర్వహించదలచిన ర్యాలీకి పోలీసులు అనుమతిని తిరస్కరించారు. దీంతో ఈ సభను పార్టీ రద్దు చేయకతప్పలేదు. ఈ సభకు అనుమతినివ్వాలంటూ తాము 10 రోజుల క్రితమే  పోలీసులను కోరామని, కానీ అనుమతించడడం లేదని వారు నిన్న తెలిపారని ఎంఐఎం నేత జమీరుల్ హసన్ తెలిపారు. కానీ ఈ విధమైన సాకులకు తాము తలవంచేది లేదని, పాలక తృణమూల్ కాంగ్రెస్ ఎత్తుగడలను ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. ర్యాలీ నిర్వహించే కొత్త తేదీ విషయమై పార్టీలోని ఇతర నేతలతో చర్చించి  తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కోల్ కతా లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న మెటియా బ్రుజ్ ప్రాంతంలో గురువారం ఈ ర్యాలీ జరగాల్సి ఉంది. ఇది సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్కమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఒవైసీ ర్యాలీకి అనుమతి తిరస్కరణపై పోలీసులు కారణాన్ని తెలియజేయలేదు. అయితే శాంతి భద్రతలను వారు కారణంగా చూపినట్టు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇందులో తమ జోక్యం లేదని చెప్పి తప్పుకుంది.

బీజేపీకి మరో పార్టీ అయిన ఎంఐఎం సభకు అనుమతి నిరాకరణకు, తమకు సంబంధం లేదని టీఎంసి నేత సౌగత రాయ్ అన్నారు. ఇది వారి పార్టీ ఆంతరంగిక వ్యవహారమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడి ముస్లింలు బెంగాలీ మాట్లాడుతారని, వారు ఒవైసీకి మద్దతునివ్వబోరని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి ఒక పార్టీ (ఎంఐఎం) బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడ తమ స్ప్రయోజనం కోసం ముస్లిం ఓట్లను, బీజేపీ కోసం హిందువుల ఓట్లను చీల్చడానికి వస్తోందని సీఎం మమతా బెనర్జీ లోగడ ఆరోపించారు. కానీ ఆ పార్టీని ఎదుర్కోవడానికి తమ టీఎంసీకి పూర్తి దమ్ము ఉందని ఆమె చెప్పారు. బీహార్ ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న మజ్లిస్ పార్టీ బెంగాల్ లోకూడా తన తడాఖా చూపాలనుకుంటోంది. ఒవైసీ గత నెలలో కోల్ కతా సందర్శించి అబ్బాస్ సిద్దిఖీ అనే ముస్లిం నేత ఆధ్వర్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో పొత్తుకు గల అవకాశాలపై చర్చించారు. అయితే ఎం ఐ ఎం తో కన్నా కాంగ్రెస్-లెఫ్ట్ ఆధ్వర్యంలోని విపక్షంతో పొత్తు పెట్టుకోవడానికి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఆసక్తి చూపుతోంది. కానీ ఈ విషయాన్ని బాహాటంగా అంగీకరించని అబ్బాస్ సిద్దిఖీ.. ఎం ఐ ఎం ని తాము వ్యతిరేకించడం లేదని చెప్పారు. ఆ పార్టేతో పొత్తుకు అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. తాము ఇంకా చర్చలు జరుపుతున్నామని, ఏ విషయం త్వరలో తెలియజేస్తామని అన్నారు. బెంగాల్ లో 30 శాతం పైగా ముస్లిములు ఉన్నారు. వీరు తృణమూల్ కాంగ్రెస్ కే ఓటు వేయవచ్చునని భావిస్తున్నారు.

కాగా బెంగాల్ లో జరగనున్న ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ.. తమ పార్టీ అంటే మమతా బెనర్జీ, ఆమె పార్టీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మా పార్టీ విస్తృతం కావలసి ఉంది. ఇందుకోసం ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయో మేం చర్చించుకుని ఆ విధంగా పోటీ విషయంలో నిర్ణయం తీసుకుంటాం అని ఆయన చెప్పారు. మజ్లిస్ అంటే ఎన్నికల్లో పారిపోవడం కాదని, సత్తా ఉంటే ఎదుర్కొని పోరాడాలని అన్నారు. తమది బీజేపీకి మారు పార్టీ అన్న మమత వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చ్చారు. మాకంటూ సొంత అజెండా అంటూ ఉందని,  మత తత్వ పార్టీకి తాము సన్నిహితం కాబోమని ఆయన అన్నారు.

Read More :
Washim Corona Updates: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. ఒకే పాఠశాలలో 229 మంది విద్యార్థులకు సోకిన కోవిడ్..

భాగ్యనగర వాసులను హడలెత్తించిన వీడియో.. బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా..?:Balanagar flyover mishap viral video