Congress Party: వీడని ఉత్కంఠ…కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మూడోసారి వాయిదా..కార్యకర్తలకు నిరాశ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడప్పుడే తొలగేలా కన్పించట్లేదు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికను మళ్లీ వాయిదా వేస్తూ సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయింది.

Congress Party: వీడని ఉత్కంఠ...కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మూడోసారి వాయిదా..కార్యకర్తలకు నిరాశ
Congress Party

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడప్పుడే తొలగేలా కన్పించట్లేదు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికను మళ్లీ వాయిదా వేస్తూ సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తరువాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్టీ నాయకులు, సీడబ్ల్యూసీ విజ్ఞప్తి చేసినా ససేమిరా అన్నారు రాహుల్‌. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఐతే పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉండాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జనవరి 22న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ..ఈ సంవత్సరం జూన్‌ లోపు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని నాడు ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలు ముగిసినందున ఇక ఇప్పటికైనా అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూశారు. కానీ నిన్న (10-05-2021) జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిరాశే మిగిలింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. దేశంలోని కోవిడ్ పరిస్థితుల దృష్ట్యాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికను వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికల వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి.

కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవలి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ లో సీనియర్లు, రాహుల్‌ వర్గానికి మధ్య పొసగడం లేదు. యువనాయకత్వాన్ని ముందుకు తేవాలన్న రాహుల్‌ గాంధీ ప్రయత్నాలకు…సీనియర్లు మోకాలడ్డుతున్నారు. ఇప్పటికే పార్టీలో మార్పులు జరగాలని, పార్టీ సంస్థాగత ఎన్నికలు జరపాలనే యువ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో నెలకొన్న సందిగ్ద పరిస్థితి కారణంగా ఇప్పటికే జ్యోతిరాదిత్య సింథియా వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

ఇలానే ఉంటే 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటామన్న గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌ వంటి సీనియర్లు బాహటంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ మేరకు 2020, అగస్టులో పార్టీ అధినేత్రిని ఉద్దేశించి లేఖ రాసిన సీనియర్లు గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ సహా 23 మంది అగ్రనేతలు లేఖ రాశారు. పార్టీలో పైనుంచి కిందవరకూ అనేక మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో సూచించారు. ఆ లేఖపై సంతకం చేసిన నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని గత సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
రాహుల్‌ గాంధీ ఆరోపణలపై ఆజాద్, కపిల్‌ సిబల్‌ అభ్యంత రం వ్యక్తం చేయడంతో విషయం మరింత రచ్చకెక్కింది.
దీనితో కాంగ్రెస్‌ అధిష్టానం డ్యామేజ్‌ కంట్రోల్‌ ప్రయత్నాలు చేయడంతో కొద్ది రోజులుగా సైలెంటయ్యారు సీనియర్ నాయకులు.

మూడు దశాబ్దాల ఒడిదుడుకులు…
నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ గాంధీల హయాంలో తిరుగులేని శక్తిగా వెలిగిన కాంగ్రెస్ పార్టీ..1991లో రాజీవ్‌ గాంధీ దారుణ హత్య తరువాత ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒక ఐదు సంవత్సరాలు పీవీ నరసింహరావు, మరో పదేళ్లు మన్మోహన్‌సింగ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ…పార్టీకి ప్రజాకర్షణ కల నాయకుడు లేని లోటును  2014, 2019 ఎన్నికలు ఎత్తిచూపాయి. రాజీవ్‌ గాంధీ మరణం తరువాత జరిగిన మూడు దశాబ్దాల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని పరిశీలిస్తే…
ఎన్నికల ప్రచారంలోనే రాజీవ్‌ హత్య జరగడంతో చివరి దశ ఎన్నికల్లో సానుభూతి ఓట్లు కురియడంతో 1991లో గట్టెక్కినప్పటికీ…

ఎన్నికల సంవత్సరం – కాంగ్రెస్ గెలిచిన స్థానాలు – కాంగ్రెస్‌ సాధించిన స్థానాలు ఓట్ల శాతం
1991  244  35.66
1996  140  28.80
1998  141  25.82
1999  114  28.30
2004  145  26.70
2009  206  28.55
2014  44  19.52
2019  52  19.01

1951 నుంచీ 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా…
కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు సాధించినది 1984లో – 415 (ఇందిర మరణం, సానుభూతి)
అత్యల్పంగా స్థానాలు సాధించినది 2014లోనే – 44 (ప్రతిపక్ష హోదా కూడా రాలేదు)

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 73 ఏళ్లలో 49 సంత్సరాలు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దేశంలోని మొత్తం 30 రాష్ట్రాలు/రాష్ట్ర హోదా గల ప్రభుత్వాలలో…ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం -5
అవి… 1.పంజాబ్‌, 2.రాజస్థాన్‌, 3.ఝార్ఖండ్‌, 4.ఛత్తీస్‌ఘడ్‌, 5.మహారాష్ట్ర. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీతో కలసి అధికారం పంచుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్‌ పార్టీని స్థాపించింది – 28-12-1885
నాడు తొలి అధ్యక్షుడు – ఉమేష్‌ చంద్ర బెనర్జీ
స్వాతంత్రానంతరం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ అధ్యక్షులుగా పనిచేసినవారి వివరాలు..

సంవత్సరం -అధ్యక్షుడు
1947 జెబి. కృపలానీ
1948-49 పట్టాభి సీతారామయ్య
1950 పురుషోత్తం దాస్‌ టాండంన్‌
1951-54 జవహర్‌లాల్‌ నెహ్రూ
1955-59 యూఎన్‌ ధేబర్‌
1959 ఇందిరాగాంధీ
1960-63 నీలం సంజీవరెడ్డి
1964-67 కామరాజ్‌.కె
1968-69 ఎస్‌. నిజలింగప్ప
1970-71 జగజ్జీవన్‌రామ్‌
1972-74 శంకర్‌దయాళ్‌ శర్మి
1975-77 దేవకాంత్‌ బారువా
1977-78 కాసు బ్రహ్మానందరెడ్డి
1978-84 ఇందిరా గాంధీ
1985-91 రాజీవ్‌ గాంధీ
1991-96 పీవీ నరసింహారావు
1996-98 సీతారాం కేసరి
1998-2017 సోనియా గాంధీ
2017-19 రాహుల్‌ గాంధీ
2019- సోనియా గాంధీ (తాత్కాలిక)

ఇవి కూడా చదవండి..భవిష్యత్ కార్యాచరణపై ఈటల కీలక వ్యూహం.. ముందుకు కేసీఆర్ స్పందన రానీయ్ అంటున్న బీసీ నేత

ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్