YV Subba Reddy: మరోసారి టిటిడి ఛైర్మనా?.. మంత్రి లేక రాజ్యసభ సభ్యత్వమా?
AP CM YS Jagan - YV SUbba Reddy: ఏపీ సీఎం జగన్‌కు దగ్గరి బంధువైన మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యంపై వైసీపీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
YV SUbba Reddy Political Future: వైసీపీ అధికారంలో లేనప్పుడు ఆయన ఎంపిగా ఉన్నారు..2014లో ఒంగోలు పార్లమెంట్ నుంచి గెలుపొంది అటు పార్లమెంట్‌లో, ఇటు జాతీయ రాజకీయాల్లో వైసిపి పార్టీ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. వైయస్ జగన్‌కు కుడిభుజంగా, ఒక విధంగా పెద్దదిక్కుగా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయకు ఎంపి టికెట్ లభించలేదు. ఒక రకంగా తన టికెట్ కోసం ఆయన జగన్‌తో చివరివరకు పోరాటం చేశారు. అలకపాన్పు ఎక్కినంత పనిచేశారు. ఇంత జరిగినా ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఇంట్లోని మనిషేకదా అనుకున్నారో… లేక మరే ఇతర రాజకీయ సమీకరణాల నేపధ్యంలో ఆయనకు పార్టీ బాధ్యతలకే పరిమితం చేశారో? దేవరహస్యంగానే మిగిలిపోయింది. ఆయనే జగన్ బాబాయ్ వై.వి. సుబ్బారెడ్డి… బాబాయ్, అబ్బాయ్‌ల మద్య పదవులకు అతీతంగా పెనవేసుకున్న బంధం కారణంగా ఇన్ని పరిణామాలు జరిగినా ఇద్దరి మధ్య బేధాభిప్రయాలు రాలేదు… టిటిడి ఛైర్మన్ పదవితో రెండేళ్ళు నెట్టుకొచ్చిన వై.వి సుబ్బారెడ్డి ప్రస్తుతం తన పదవీకాలం ముగియడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన వస్తానంటే జగన్ వద్దంటారా… లేక పిలిచి పెద్ద పీట వేస్తారా… అన్న ఆశక్తికర చర్చ వైసిపి నేతల్లో జోరుగా సాగుతోంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై.వి.సుబ్బారెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్‌గా పదవీకాలం ముగియడంతో ప్రత్యక్ష రాజకీయాల వైపు వైవి దృష్టి సారించడంతో ఆయన రీ-ఎంట్రీ వైసిపి శ్రేణుల్లో ఆశక్తికర చర్చకు దారి తీసింది. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వై.వి సుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లోనూ ఎంపీ సీటు ఆశించారు. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనకు వైయస్ జగన్ టిక్కెట్ నిరాకరించారు. అనంతరం రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. చివరికి గోదావరి జిల్లాల పార్టీ బాధ్యతలు అప్పగించారు. తనకు చట్ట సభల్లో కొనసాగాలని ఆసక్తి ఉన్నప్పటికీ.. అనివార్యంగా టిటిడి ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం జూన్ 20తో ముగిసింది. ఆ స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అప్పటి నుంచే సుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో సుబ్బారెడ్డి స్థానం చర్చనీయాంశమైంది. తాజాగా ఆదివారం ఒంగోలు పర్యటనకు వచ్చిన వైవీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు పరిపాలనతో సంబంధం లేని టిటిడి బాధ్యతల్లో తాను ఉన్నానని.. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాననే అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ప్రజలు, కార్యకర్తలకు మరింత న్యాయం చేసే అవకాశం ఉండేదని అన్నారు. తన ఆలోచనలను, అభిప్రాయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టానని.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందనే విషయాన్ని తెలియజేశానన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కట్టుబడి ఉంటానని వైవీ చెప్పారు.
ప్రత్యక్ష రాజకీయాలకు రెండేళ్ళు దూరం…
2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా కనీసం రాజ్యసభ పదవి అన్నా ఇస్తారనుకున్నారు వై.వి. సుబ్బారెడ్డి. అయితే అనూహ్యంగా సియం వైయస్ జగన్, బాబాయ్ సుబ్బారెడ్డికి టిడిడి ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఈ పదవి కూడా తక్కువేం కాదు.. అయితే ఇది రాజకీయాలతో సంబంధం లేని బాధ్యత. దక్షిణ భారత దేశంలోనే మహిమాన్వితమైన తిరుమల పుణ్యక్షేత్రంలోని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువులో సేవ చేసే భాగ్యం కలిగిందనుకుని తృప్తి పడాల్సిన పరిస్థితి…
రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర చర్చ..
ప్రకాశంజిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర నాయకుడు, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ కాబోతున్నారా… లేక మంత్రిగా అవకాశం ఇస్తారా… అదీ కాకుంటే రాజ్యసభకు వెళతారా.. అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది… ఆ మేరకు సీఎం జగన్ ఇంకా వై.వి. సుబ్బారెడ్డి గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుత టర్మ్‌లో చివరి టీటీడీ పాలకమండలి సమావేశానికి వెళ్తున్న వైవీ ముందుగానే తన పరిస్థితి ఏమిటని సీఎంను కోరినట్లు సమాచారం. అందుకనుగుణంగా సీఎం కూడా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నట్టు కనపిస్తోంది. ఇప్పటికే వైవీ కేబినెట్ విస్తరణలో మంత్రి కాబోతున్నారని, అందుకనుగుణంగా ఎమ్మెల్సీ స్థానం కూడా కేటాయిస్తారని ప్రచారం జరిగింది. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత వారంరోజులకు మంత్రులను నియమించిన రోజే రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని ప్రకటించారు. ఆ సమయం ఆసన్నమైంది. అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవీకాలం పూర్తయింది. దీంతో వైవీ రాజకీయ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. చివరికి వైవీ కూడా ఇటు మంత్రిగా అవకాశం వస్తే మంచిదని, కాకుంటే రాజ్యసభ సభ్యుడిగా దేశరాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే టీటీడీ చైర్మన్‌గా మున్ముందు అవకాశం కల్పిస్తానని జగన్ కూడా రాష్ట్రంలో కొందరు నాయకులకు హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. దీంతో వై.వి. సుబ్బారెడ్డికి రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవి కానీ, రాజ్యసభ సీటుకాని లభించే అవకాశాలు ఉన్నాయి… వై.వి కూడా ఇదే కోరుకుంటున్నా… సియం వైయస్ జగన్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తానని చెబుతున్నారు…
సీఎం జగన్ మదిలో ఏముంది?
మరోవైపు రానున్న మంత్రివర్గ విస్తరణలో స్థానం సంపాదించాలని ఆశిస్తున్న నాయకులు వైవీ వచ్చి ఎక్కడ అడ్డం పడతారోనని ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ కుటుంబ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో ఆయన సమీప బంధువైన బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. వైవీకి మంత్రి పదవి ఇస్తే ఒకే జిల్లా నుంచి ఇద్దరు జగన్ ముఖ్య బంధువులకు అవకాశం ఇచ్చినట్టవుతుందని, దీని వల్ల జిల్లాలో రెండు పవర్ సెంటర్లు ఏర్పడి నేతల మధ్య అగాధాలు పెరిగే అవకాశం ఉందన్న భయాలు కూడా పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ అటు ఒకరిద్దరు పార్టీ నేతలతో, ముఖ్యంగా కుటుంబసభ్యులతో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. పదిరోజుల క్రితం మంత్రి బాలినేనితో కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. తదనంతరం ఆయన వైవీని తిరిగి టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగించాలా లేక రాజ్యసభకు నామినేట్ చేయాలా అన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం… ఏది ఏమైనా వై.వి మనోగతం మేరకు తాను ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని కోరుకుంటున్నందున కొద్దిగా ఆలస్యం అయినా వై.వి కి రాజ్యసభ కేటాయించాలని వైయస్ జగన్ భావిస్తున్నట్టు వినిపిస్తోంది.
-ఫైరోజ్ బేగ్, టీవీ9 తెలుగు రిపోర్టర్ (ప్రకాశం జిల్లా)
Also Read..
బీజేపీ-శివసేన మధ్య మళ్ళీ చిగురిస్తున్న స్నేహం..రాజకీయ కాక రేపుతున్న దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలు
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్‌కు ఏపీ సీఎం జగన్ లేఖ.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఫిర్యాదు!