Political Row: వీధిపోరాటాలకు కారణమవుతున్న డైలాగ్‌వార్.. తన్నుకున్న రెండు పార్టీల కార్యకర్తలు..
డైలాగ్‌వార్ వీథిపోరాటాలకు దారితీస్తోంది. శివసేన భవనాన్ని కూల్చేస్తామన్న BJP నేతల హెచ్చరికలపై మండిపడ్డారు మహారాష్ట్ర CM ఉద్దవ్‌థాక్రే. తాము తిరిగికొడితే...
మహారాష్ఠ్రలో శివసేన-BJP నేతల మధ్య డైలాగ్‌వార్ వీధిపోరాటాలకు దారితీస్తోంది. శివసేన భవనాన్ని కూల్చేస్తామన్న BJP నేతల హెచ్చరికలపై మండిపడ్డారు మహారాష్ట్ర CM ఉద్దవ్‌థాక్రే. తాము తిరిగికొడితే BJP నేతలు లేచే పరిస్థితి ఉండదని వార్నింగ్ ఇచ్చారు. సాంగ్లీలో ఉద్దవ్‌థాక్రే పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్దవ్ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి BJP కార్యకర్తలు ప్రయత్నించడంతో గొడవ జరిగింది. శివసేన-BJP కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మహారాష్ట్ర ఆస్తులను గుజరాతీలకు కట్టబెట్టేందుకు BJP కుట్ర చేస్తోందని శివసేన ఆరోపించింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌ను అదానీకి అమ్మేశారని నిరసనకు దిగారు శివసేన కార్యకర్తలు.
ఎయిర్‌పోర్ట్‌లో అదానీ బోర్డును శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. BJPకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో శివసేన జెండాలు పాతారు. చత్రపతి శివాజీ మహారాజు ఎయిర్‌పోర్ట్ పేరును అదానీ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేయడంపై శివసేన కార్యకర్తలు మండిపడ్డారు. గత ఏడాది ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.
వరదబాధితులను ఆదుకోవాలని తాము CM ఉద్దవ్‌థాక్రేకు వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే శివసేన కార్యకర్తలు దాడి చేశారని BJP కార్యకర్తలు ఆరోపించారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. పోలీసులు కూడా తమ కార్యకర్తలనే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
BJP కార్యకర్తల ఆందోళనల మధ్యే ఉద్దవ్‌థాక్రే వరదబాధితులను పరామర్శించారు. BJP నేతలు రెచ్చగొట్టేభాష మాట్లాడితే సహించమని, అలాంటి వారికి తగిన సమాధానం చెబుతామంటూ ఘాటుగా స్పందించారు CM ఉద్దవ్.
అవసరమైతే ముంబైలోని శివసేన భవన్‌ను కూల్చివేస్తామని BJP నాయకుడు ప్రసాద్ లాడ్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య చిచ్చురేపాయి. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల తనకు అత్యంత గౌరవమనీ, సేన భవన్‌ను పవిత్ర నివాసంగా భావిస్తానంటూ ప్రసాద్‌లాడ్ తన వ్యాఖ్యలకు సారీ చెప్పారు.
తన వ్యాఖ‍్యలను మీడియా వక్రీకరించిందంటూ విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈ మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. మరోవైపు BJP వ్యాఖ్యలపై స్పందిచిన రాజ్యసభ MP సంజయ్ రౌత్ శివసేన భవన్ పై దాడి గురించి BJP ఎప్పుడూ ఆలోచించదనీ.. BJP వ్యతిరేక శక్తులు మాట్లాడుతున్నాయన్నారు. మహారాష్ట్రలో BJPకి వీరి వల్ల నష్టమన్నారు. ప్రసాద్ క్షమాపణను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీల నేతల మధ్య తాజాగా మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..