Operation Akarsh: బీజేపీలో ఆపరేషన్ ఆకర్ష్ బంద్.. కారణమిదే
కమలదళంలో చేరేందుకు ఏ ఇతర పార్టీ నేత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కారణం ఏంటా అని ఆరా తీసిన బీజేపీ నేతలు అవాక్కయ్యారు..
BJP stopped Operation Akarsh because of a genuine reason: బీజేపీలో చేరికలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా? మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఆ జోష్‌కు బ్రేక్ వేసాయా? బీజేపీలో చేరేందుకు నాయకులెవరూ ఎందుకు ముందుకు రావడం లేదు? గులాబీకి తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ వస్తున్న బీజేపీని ఇతర పార్టీల నేతలు ఎందుకు నమ్మడం లేదు. బీజేపీలో నేతల వలసలకు బ్రేక్‌లు ఎందుకు పడ్డాయి? ఇదిప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వివిధ పార్టీల నుండి బడా నేతలు చేరారు. డీకే అరుణ, పొంగులేటి, జిత్తేందర్ రెడ్డి, వివేక్ , సోమారపు సత్యనారాయణ వంటి నేతలు పార్టీలో చేరిపోయారు. ఇంకా చాలం మంది ముఖ్యనేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఇవి కేవలం ట్రైలర్లే అని ముందు ముందు సినిమా ఉంటుందని చెప్పారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కూడా భారీగా చేరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాస్త అనుకూలంగా రావడంతో రిటైర్డ్ ఐఏఎస్ చంద్ర వదన్ , మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తదితరులు పార్టీలో చేరడంతో బీజేపీ బలపడుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో పార్టీలోకి మరికొంత మంది నేతలు గరిక పాటి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
తీరా మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనక బడింది. మునిసిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో అభ్యర్దులను నిలబెడతామని చెప్పిన ఆ పార్టీ నేతలు అన్ని స్థానాల్లో పోటీ చేయలేక పోయారు. దాదాపు వెయ్యికి పైగా స్థానాల్లో అభ్యర్దులు దొరకని పరిస్థితి ఏర్పడింది. నిలబెట్టిన స్థానాల్లో కూడా చాలా చోట్ల గౌరవ ప్రదమైన ఓట్లను కూడా సాధించలేక పోయింది. మొత్తం స్థానాల్లో కేవలం 299 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ ఏమాత్రం ప్రభావితం చూపిస్తుందో తేలిపోయిందంటున్నారు.
మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో చేరదాం అనుకున్న వారు ఆలోచనల్లో పడ్డారని అంటున్నారు కమలనాథులు. అంతకు ముందు వరకు వలసలతో జోష్ మీద ఉన్న కమలం పార్టీకి మునిసిపల్ ఎన్నికలు బ్రేక్ లు వేసాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పట్లో చేరికలు లేకపోవచ్చనే అభిప్రాయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణే సన్నిహితల వద్ద వ్యక్తం చేస్తుండడంతో పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read: Telangana BJP to have two presidents soon