Kadapa Politics: సీఎం సొంత జిల్లాలో రాజకీయ రణరంగం.. కాక రేపుతున్న విగ్రహ వివాదం..
విగ్రహం మళ్లీ వివాదాన్ని రాజేస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్నాకు సిద్ధమైంది బీజేపీ. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ....
విగ్రహం మళ్లీ వివాదాన్ని రాజేస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్నాకు సిద్ధమైంది బీజేపీ. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సోము వీర్రాజు ప్రొద్దుటూరులో నిరసన చేపట్టబోతున్నారు. ఇదే అక్కడ టెన్షన్ రేపుతోంది. ధర్నాకు అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు. ఎలాగైనా అక్కడ నిరసన చేపట్టి తీరతామని ప్రకటించారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో విగ్రహం పెట్టాలనుకున్న చిన్నారోడ్డు క్రాస్ దగ్గర భద్రతను పెంచారు పోలీసులు. ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
స్థానిక డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో పోలీసులు ధర్నాను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, BJP నేతలు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నాను విరమించుకొని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించిన BJP నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో వివాదం రేపాలని BJP ప్రయత్నిస్తోందని మండిపడ్డారు YCP ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు కేవలం కౌన్సిల్ మాత్రమే తీర్మానం చేసింది.
ప్రభుత్వ అనుమతి ఇంకా రాలేదని చెప్పారు. నిర్ణయం రాకపోయినా విగ్రహాన్ని పెట్టేస్తున్నట్లే ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. BJP నేతలకు ధైర్యం ఉంటే రాజ్యాంగంలోని పేజీ నెంబర్ 144లో ఉన్న టిప్పు సుల్తాన్ ఫొటోను తీసేస్తూ సవరణలు చేయాలని మరోసారి సవాల్ చేశారు రాచమల్లు.