Huzurabad BJP : హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందే బీజేపీకి నిరసన సెగ.. నేలకేసి కొడుతోన్న జనం.!
హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందే బీజేపీకి నిరసన సెగ తగిలింది. ఇప్పటికే ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు చేదు అనుభవం ఎదురవుతోంది...
Huzurabad BJP : హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందే బీజేపీకి నిరసన సెగ తగిలింది. ఇప్పటికే ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు చేదు అనుభవం ఎదురవుతోంది. బీజేపీ నేతల ముందే నిరసన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈటల వర్గం పంపిణీ చేస్తోన్న గోడ గడియారాలను పగులగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ఈటల రాజేందర్ గోడ గడియారాలను పగులగొట్టి స్థానికులు నిరసన తెలిపారు.
ఎలబాకతో పాటు చల్లూరు, కోర్కల్ గ్రామాల్లోని దళిత కాలనీల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురవుతోంది. వీణవంక మండలంలో పది రోజుల క్రితం ఈటల ఫొటో, బీజేపీకి చెందిన కమలం గుర్తు ఉన్న గోడ గడియారాలను పంపిణీ చేశారు బీజేపీ కార్యకర్తలు. హుజురాబాద్‌లోని జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, హుజురాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. అయితే కొన్నిచోట్ల దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
దళితబంధు లాంటి పథకాలతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని, తాము టిఆర్‌ఎస్ వెంటే ఉంటామని పబ్లిక్ గానే చెబుతున్నారు. కేవలం ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఆరోపిస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా ఓ ఓటరు ఈటల రాజేందర్ పంపిణీ చేసిన గోడ గడియారాన్ని కసితీరా నేలకేసి కొట్టాడు. కాలి కిందేసి తొక్కి మరీ అవతల పడేశాడు. అంతేకాదు మంత్రిగా ఉండగానే ఏమీ చేయలేదు.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఈటల ఏం చేస్తాడని అడిగి కడిగేశాడు ఓటర్.
ఇప్పుడు మరోసారి వీణవంక మండలంలో కూడా ఇలాంటి సీన్ రిపీట్ కావడంతో బీజేపీ నేతలకు భయం పట్టుకుంది. ఇంకా ఎన్ని చోట్ల ఓటర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోననే ఈటల శిబిరంలో గుబులు మొదలైంది.