కాంగ్రెస్ ఖేల్ ఖతం ? రాహుల్ కింకర్తవ్యం ?
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గత నెల 25 న సిధ్ద పడిన రాహుల్ గాంధీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటి ? ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా సీనియర్ నాయకులతో సహా అంతా గళమెత్తి కోరారు. కొంతమంది ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మీరే పార్టీ అధినేతగా కొనసాగాలని పలువురు అభ్యర్థించారు. పైగా రాహుల్ […]
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గత నెల 25 న సిధ్ద పడిన రాహుల్ గాంధీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటి ? ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా సీనియర్ నాయకులతో సహా అంతా గళమెత్తి కోరారు. కొంతమంది ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మీరే పార్టీ అధినేతగా కొనసాగాలని పలువురు అభ్యర్థించారు. పైగా రాహుల్ స్థానే ఎవరిని ఈ పదవికి ఎంపిక చేయాలన్నదానిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండు సార్లు భేటీ అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ససేమిరా అన్నారు. అసలిప్పుడు ఆయన పార్టీ అధినేతగా ఉన్నారా అని విశ్లేషకులు సైతం సందేహిస్తున్నారు.అటు- పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసేశారు. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా తెలంగాణాలో నిన్నటికి నిన్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12మంది అధికార టీ ఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. సీఎం కేసీఆర్ పన్నిన రాజకీయ వ్యూహం తెరాసకు లాభించింది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీతో అంటకాగినా.. ఆశించిన ఫలితం దక్కలేదు. ఇదేకాక… తాజా పరిణామాల నేపథ్యంలో రాహుల్ తమ పార్టీ నేతలెవరినీ కలుసుకోవడానికి ఇష్ట పడడంలేదు. దీంతో వీరంతా దిక్కు తోచని స్థితిలో పడ్డారు. కేరళలో తనను ఎన్నికల్లో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు చెప్పడానికే ఆయన వయనాడ్ నియోజకవర్గానికి ప్రయాణం కట్టారు. అటు- మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తన తనయుడితో సహా రాహుల్ ని కలిసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులు ఈ తండ్రీ కొడుకులిద్దరూ ప్రధాని మోదీని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కమల్ నాథ్ తో బాటు అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వంటివారు తమ కొడుకులకు టికెట్లు ఇప్పించుకోవడానికి పడిన పాట్ల వల్లే ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని రాహుల్ నాడే ఆక్రోశాన్ని,ఆవేదనను వెళ్లగక్కారు. తన డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ తో గెహ్లాట్ కు తలనొప్పులు ప్రారంభం కాగా.. పంజాబ్ లోనూ దాదాపు ఇదే సీన్ రిపీటయింది. నవజోత్ సింగ్ సిద్దుతో సిఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ‘ తంటాలు ‘ పడుతున్నారు. గురువారం జరిగిన మంత్రివర్గ భేటీకి కావాలనే సిద్దు గైర్హాజరయ్యారు. రాహుల్ గాంధీని కలిసి తాజా పరిణామాలను ఆయనకు వివరించేందుకు సిద్దు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హర్యానాలో ఘర్షణలకు తలపడిన పార్టీ విధేయులకు, అసమ్మతివాదులకు నచ్చజెప్పేందుకు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జోక్యం చేసుకోవలసివచ్చింది. ఈ ఘర్షణల తాలూకు ఉదంతాన్ని రాహుల్ తేలిగ్గా తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల రాజీనామాలపై స్పందించిన రాహుల్ తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ… మీ రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు ఓటమి చెందిందో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని, దాన్ని బట్టి పార్టీ పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటామని చెప్పాల్సివచ్చింది. అంటే తనయుడి ఉదాసీనం వల్ల ఇన్నేళ్ల ‘ ఘన చరిత్ర ‘ గల కాంగ్రెస్ కు నష్టమే తప్ప, ప్రయోజనం కలగదని, ఈ కారణంగా ఈ తరుణంలో తానే చొరవ తీసుకోవాలని ఆమె భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాహుల్ ‘ వైరాగ్యం ‘ ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.