AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసేపట్లో ఏపీ మున్సిపల్‌ ఎన్నికల లెక్కింపు.. 10 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం

ఏపీలో ఉత్కంఠను రేపుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో తేలిపోనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుండగా.. 10 గంటల వరకు తొలి ఫలితం..

కాసేపట్లో ఏపీ మున్సిపల్‌ ఎన్నికల లెక్కింపు.. 10 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం
K Sammaiah
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 14, 2021 | 8:19 AM

Share

ఏపీలో ఉత్కంఠను రేపుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో తేలిపోనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుండగా.. 10 గంటల వరకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. సాయంత్రం వరకు అన్ని చోట్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖలో డివిజన్లు ఎక్కువగా ఉండడంతో తుది ఫలితం వెలువడే వరకు ఆలస్యమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక హైకోర్టు ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.

రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థల్లో 28,61,550 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులో కౌంటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేయగా.. 11 చోట్ల 27,29,072 ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనున్నారు. ఇందు కోసం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేసి 12,607 మంది సిబ్బందిని నియమించారు. 4,317 మంది అధికారులు కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు.

ఎన్నికలు జరిగిన 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 580 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన 47 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం చేపట్టడం లేదు. మిగిలిన 533 డివిజన్లలో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వాటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

కౌటింగ్‌లో భాగంగా మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1,345 మంది ఎస్‌ఐలు, 17,292 మంది కానిస్టేబుళ్లు, మరో 1,134 మంది ఇతర భద్రత సిబ్బంది మోహరించారు. ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ఇదిలా ఉండగా.. రాత్రి 8గంటల్లోగా కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు మొత్తాన్ని వీడియో తీయించి ఫుటేజీని భద్రపరచాలని, లెక్కింపును వెబ్‌కాస్టింగ్‌ చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కౌంటింగ్ మార్గదర్శకాలు:

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌  నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలనూ ప్రకటించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు.

కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని.. ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, ఇన్వర్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్, వీడియో లేదా సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని తెలిపారు. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజీని ఎన్నికల రికార్డుగా భద్రపరచాల్సిందిగా ఆదేశించారు. నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చారు. పది కంటే తక్కువ మెజారిటీ సాధించిన సమయంలో మాత్రమే నిబంధనలు, మార్గదర్శకాల మేరకే రీకౌంటింగ్‌కు అనుమతించాలని వెల్లడించారు. రెండంకెల మెజారిటీ వచ్చిన చోట్ల అభ్యర్థి విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాల ప్రకటన సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా వివరాలు అందించేందుకు మీడియా కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు..

Read More:

కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం.. న్యూస్‌ పేపర్‌ సైజులో భారీ బ్యాలెట్‌.. ఓటు ఎలా వేయాలంటే..