కాసేపట్లో పోలింగ్ ప్రారంభం.. న్యూస్ పేపర్ సైజులో భారీ బ్యాలెట్.. ఓటు ఎలా వేయాలంటే..
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఖాళీ అయిన..
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఖాళీ అయిన మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. రెండు నియోజకవర్గాల్లో మొత్తం 1,530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 7,560 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఒక రోజు ముందే పోలింగ్ సామగ్రితో సహా సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు.
న్యూస్‌పేపర్ సైజులో భారీ బ్యాలెట్: రెండు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్ పేపర్‌ను దినపత్రిక సైజులో తయారైంది. దీంతో జంబో బ్యాలెట్ బాక్సులను రూపొందించారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 5,31,268 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 3,36,256, మహిళలు 1,94,944, థర్డ్‌జండర్ 68 మంది ఓటర్లు ఉన్నారు. ఇక వరంగల్-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 5,05,565 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 3,32,634, మహిళలు 1,72,864, థర్డ్‌జండర్ 67 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేసుకున్నారని.. దీంతో పోలింగ్ శాతం కూడా భారీ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శషాంక్ గోయల్ చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో 50 శాతం కేంద్రాలను వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామని చెప్పారు. మిగిలిన కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చినట్టు వివరించారు.
ఇతర పెన్నువాడితే ఓటింగ్ చెల్లదు ఓటింగ్‌లో పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పెన్నుతోనే ఓటరు.. అభ్యర్థులకు సంబంధించిన గడుల్లో ప్రాధాన్యతా నంబర్లు వేయాల్సి ఉంటుందని శషాంక్ గోయల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో కొవి డ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశామని, మాస్క్ ఉన్న ఓటర్లనే కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద శానిటైజర్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు, ఓట ర్లు భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌చేసినట్టు వివరించారు. కొవిడ్ పేషెంట్లు, 80 ఏండ్ల వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించామనిచెప్పారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు రెండు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు. సున్నితమైన ప్రాం తాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు.
ఓటు వేసే పద్దతి తెలుసుకోండి: సాధారణ ఎన్నికల్లో మాదిరిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే చెల్లదు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా స్వస్తిక్ ఓటు ముద్ర వేయడం కానీ, ఈవీఎంలలో బటన్ నొక్కే విధానం ఉండదు. బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేయాలి. ఓటర్ గుర్తింపుకార్డు లేదా.. ఈసీ నిర్ణయించిన ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌లైసెన్స్. సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, ఎంపీ గుర్తింపుకార్డు, పాన్ కార్డు, విద్యాసంస్థలు జారీచేసిన కార్డు, డిగ్రీ లేదా డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు, దివ్యాంగుల గుర్తింపుకార్డు లలో ఏదైనా ఒకటి తీసుకుపోవాలి
ముందుగా ఓటర్‌స్లిప్‌లో సూచించిన నంబర్ గల పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి. గుర్తింపును నిర్ధారించుకొన్న తర్వాత ఎడమచేతి చూపుడువేలుపై ఇంకు గుర్తు పెట్టి, బ్యాలెట్‌పేపర్‌ను చేతికిస్తారు. దాంతోపాటే ఓటేసేందుకు పెన్ను ఇస్తారు. ఈ పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇతర పెన్నులు వాడితే ఓటు చెల్లదు. బ్యాలెట్‌పేపర్‌పై అభ్యర్థికి ఎదురుగా ప్రాధాన్య క్రమంలో నంబర్లు వేసుకొంటూ వెళ్లాలి. టిక్కులు, క్రాస్‌లు పెట్టరాదు. ఒక్క నంబర్ వేసినా ఓటు చెల్లుతుంది. మధ్యలో ఎక్కడైనా నోటా వేస్తే ఆ తర్వాత ప్రాధాన్యత చెల్లదు.
Read More:
తిరుపతి ఉప ఎన్నిక బరిలో విశాఖ ఉద్యమం తరపున అభ్యర్థి… అఖిల పక్షాలతో చర్చించి నిర్ణయిస్తామన్న గంటా