AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anandaiah Medicine: ఆనందయ్య మందుకు బ్రేక్.. పొలిటికల్ వివాదంలో తయారీ ప్రక్రియ.. సోమవారం నుంచి పంపిణీ డౌటే!

సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమవుతుందనుకున్న కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు తయారీకి బ్రేక్‌పడింది. అనుకున్న ప్రకారం మందు పంపిణీ ఉండదంటున్నారు ఆనందయ్య సన్నిహితులు.

Anandaiah Medicine: ఆనందయ్య మందుకు బ్రేక్.. పొలిటికల్ వివాదంలో తయారీ ప్రక్రియ.. సోమవారం నుంచి పంపిణీ డౌటే!
Anandaiah Medicine
Balaraju Goud
|

Updated on: Jun 05, 2021 | 3:19 PM

Share

Anandaiah Medicine: సర్కారు అనుమతించినా, కోర్టు పచ్చజెండా ఊపినా ఆనందయ్య మందుకు అవాంతరాలు ఎదురువుతున్నాయి. సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమవుతుందనుకున్న కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు తయారీకి బ్రేక్‌పడింది. అనుకున్న ప్రకారం మందు పంపిణీ ఉండదంటున్నారు ఆనందయ్య సన్నిహితులు. కేవలం 4వేలమందికే మందు పంపిణీ చేయగలమని చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో మందు పంపిణీ జరుగుతుందని అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు చెబుతుంటే..అసలా ఇన్ఫర్మేషనే తప్పంటున్నారు ఆనందయ్య సన్నిహితులు. ఆన్‌లైన్‌లో మందు పంపిణీకి అవకాశం లేదంటోంది ఆనందయ్య బృందం. ప్రభుత్వ సహకారం ఉంటేనే మందు పంపిణీ చేయగలమంటున్నారు. ఆనందయ్య ప్రకటన చేసేదాకా మందు తయారీ, పంపిణీపై ఎలాంటి నిర్ణయాలు ఉండవని ఆయన సన్నిహితులు చెబుతుండటంతో.. కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

రాజకీయాలు తలదూర్చక ముందు సాఫీగా సాగిన ఆనందయ్య మందు పంపిణీపై ఇప్పుడు ప్రతిష్ఠంభన ఏర్పడింది. కోర్టు.. ప్రభుత్వం.. నోటిద్వారా ఇచ్చే మందు పంపిణీకే అనుమతిచ్చాయి. కంట్లో వేసే మందుకు ఇంకా అనుమతి రాలేదు. ఐ డ్రాప్స్‌తో ఎక్కడా దుష్ప్రభావాలు కనిపించలేదని నిపుణుల కమిటీ తేల్చినా.. స్టేరైల్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక కంటి మందుపై తేలుస్తామని స్పష్టంచేసింది. ఆ ప్రకారమే కంటి మందు వదిలేసి.. సోమవారం నుంచి నోటి మందు పంపిణీ జరుగుతుందని చాలామంది ఎదురుచూస్తుంటే ఆ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది.

ఆనందయ్య మందుపై సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఆనందయ్య కొన్నాళ్లు అందుబాటులో లేకపోవడంపై పెద్ద చర్చే నడిచింది. ఆనందయ్యను ప్రభుత్వం తన నిర్బంధంలో ఉంచిందని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. అయితే చివరికి ప్రభుత్వం మందుకు అనుమతించి… ఆనందయ్య మళ్లీ జనంలోకి రావటంతో ఇక వివాదం సమసినట్లే అనుకున్నారు. ముందు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇంటింటికీ మందు అందాకే..మిగతా ప్రాంతాలకు పంపిణీ చేస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి.

ఆనందయ్య మందు పంపిణీని అధికారపార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. పార్టీల జోక్యంతో సంబంధం లేకుండా మందు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేల జోక్యం ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళతామన్నారు. చేపమందు పంపిణీ తరహాలోనే ఈ మందును ఇవ్వాలని డిమాండ్‌ చేశారు సోమిరెడ్డి.

తాజాగా ఆనంద అనుచరులు సైతం మందు విషయంలో స్పష్ట ఇవ్వలేకపోతున్నారు. మందు తయారీకి కావల్సిన సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించడం లేదంటున్నారు. ముందుగా అనుకున్నట్లు సోమవారం నుంచి మందు పంపిణీ ఉండకపోవచ్చంటున్నారు. అయితే, తామే స్వయంగా తయారు చేస్తే రోజుకీ 4 వేల కంటే ఎక్కువ మందికి అందించలేమంటున్నారు.

మరోవైపు, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య మందు తయారీకి తోటలో షెడ్ల నిర్మాణంకు భూమి పూజా కార్యక్రమం జరిగింది. హంపీ పీఠాధిపతి శ్రీశ్రీ గోవిందానంద సరస్వతీ చేతుల మీదుగా షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ప్రజా క్షేమం కోసం ఆనందయ్య తలపెట్టిన కార్యక్రమం ఎంతో గొప్పదని స్వామీజీ అన్నారు. Read Also… Telangana News: కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే అనంత లోకాల‌కు.. 24 గంట‌లు మృతదేహం అలానే ఉంది