AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buckingham Canal: శతాబ్ధాల చరిత్ర.. దశాబ్ధాల నిర్లక్ష్యం.. వెరసి జలరవాణాకు బ్రేక్

శతాబ్దాల చరిత్ర గత బకింగ్‌ హాం కాలువను పునరుద్దరిస్తే లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితుల్లో జలరవాణాకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. జలరవాణా మార్గం పూర్తయినట్టయితే లాక్‌డౌన్‌లో రవాణాకు...

Buckingham Canal: శతాబ్ధాల చరిత్ర.. దశాబ్ధాల నిర్లక్ష్యం.. వెరసి జలరవాణాకు బ్రేక్
Cenal
Rajesh Sharma
|

Updated on: Jun 05, 2021 | 3:32 PM

Share

Buckingham Canal decades together negligence: శతాబ్దాల చరిత్ర గత బకింగ్‌ హాం కాలువను పునరుద్దరిస్తే లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితుల్లో జలరవాణాకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. జలరవాణా మార్గం పూర్తయినట్టయితే లాక్‌డౌన్‌లో రవాణాకు ఎంతో వెలుసుబాటు కలిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బకింగ్‌ హాం కెనాల్‌ బ్రిటిష్‌ పాలకుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. బంగాళాఖాతం తీరం వెంట ఉన్న ఈ కాలువలో లాంచీలు, బోట్లు, పడవలు సరకు రవాణాకు ముమ్మరంగా రాకపోకలు సాగించేవి. ఆ వైభవం క్రమేపీ మసకబారింది. ఇప్పుడు కాలువ ఆక్రమణలకు గురవుతూ కొన్నిచోట్ల ఆనవాళ్లే లేకుండా పోయింది. ఒకప్పుడు కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జల రవాణా మార్గంగా ఉపయోగపడిన ఈ కాలువను ఆధునికీకరించి.. పూర్వ వైభవం తీసుకొస్తామని ఏళ్ల తరబడి పాలకులు చెబుతూనే ఉన్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. అదే సమయంలో తీరప్రాంతంలో ఉన్న కాలువను కొందరు ఇష్టారీతిన ఆక్రమించి.. చెరువులు ఏర్పాటుచేసుకుని రొయ్యల పంట సాగు చేసుకుంటున్నారు.

దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ అంతగా లేనప్పుడు జలమార్గం ప్రధాన ఆధారంగా ఉండేది. బ్రిటీష్‌ కాలం నుంచి తీర ప్రాంతంలోని కాకినాడ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్ఛేరి వరకు బకింగ్‌ హాం కాలువ ద్వారా జల రవాణా జరుగుతుండేది. సుమారు 1100 కి.మీ.ల పొడవున ఈ కాలువ ఉండగా అందులో 119 కి. మీ. ప్రకాశంజిల్లా పరిధి నుంచి వెళ్తుంది. వివిధ రకాల నిత్యావసర వస్తువులు, కలప, ఆయిల్స్‌ ఇతరత్రా పలు రకాల వస్తువులు అప్పట్లో ఈ మార్గం నుంచి రవాణా జరుగుతుండేవి. స్వాతంత్రం వచ్చిన అనంతరం రోడ్డు రవాణాకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని పాలకులు జలమార్గానికి ఇవ్వకపోవడంతో క్రమంగా బకింగ్‌హాంలో రవాణా నిలిచిపోయింది. ఇంచుమించు 50 ఏళ్ళుగా ఆ కాలువను పట్టించుకోకపోవడంతో అది ఆక్రమణల చెరలో చిక్కింది. అనేక చోట్ల ఆనవాళ్లు కోల్పోయింది. బకింగ్‌హాం కెనాల్‌ను ఇప్పటికే పునరుద్దరించి ఉంటే గత ఏడాదికాలంగా లాక్‌డౌన్‌ కారణంగా అవాంతరాలు ఎదుర్కొంటున్న రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా ఈ జలరవాణా ఉపయోగపడి ఉండేదని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార వర్గాలకు తద్వారా ప్రభుత్వానికి లాక్‌డౌన్‌లో కూడా లాభాలు ఆర్జించే విధంగా జలరవాణా ఉపయోడపడి ఉండేదని అంటున్నారు. ఇప్పటికైనా బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్దరించి జలరవాణాకు మార్గం సుగమం చేస్తే వేలాది మందికి ఉపాధితో పాటు వ్యాపార వర్గాలకు లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు.

మూడేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం జలరవాణా అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు దేశంలో మూడు జల మార్గాలు ఉండగా నాల్గవదిగా కాకినాడ-పుద్దుచ్చేరిని ప్రకటించింది. ఇందుకోసం 5వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే కేటాయింపులు చేసినప్పటికీ అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లోనే విజయవాడలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ, భారత అంతర్గత జల రవాణా సంస్థలు సంయుక్తంగా బకింగ్ హామ్ కాలువ పరిధిలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్‌ సభ్యులు, నీటి పారుదల శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ మార్గం అభివృద్ధికి సంబంధించి కొన్ని అంశాల్లో స్పష్టత కూడా ఇచ్చారు. ఆ ప్రకారం మూడు నెలల్లో బకింగ్‌హామ్ కాలువ అభివృద్ధికి సంబంధించి సర్వే పూర్తి చేసి ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లా సరిహద్దులోని నల్లమడ లాకుల నుంచి ప్రకాశం జిల్లాలోని పెద్దగంజాం వరకు 40 కి.మీ. కొమ్మమూరు కాలువగాను, పెద్దగంజాం నుంచి నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు 79 కి.మీ. బకింగ్‌ హాం కెనాల్‌గా దీన్ని పిలుస్తుంటారు. ఏటా కృష్ణా పశ్చిమ కాలువ ద్వారా కొమ్మమూరుకు నీటిని సరఫరా చేసి ఆయకట్టుకు నీరిస్తుండటంతో 49 కి.మీ.ల దూరం ఆ కాలువ సాగునీటి అవసరాలకు వీలుగా ఉంది. మిగిలిన చోట్ల ధ్వంసమైంది. అనేక చోట్ల అక్రమణలకు గురైంది. అలాగే కాలువ పొడవునా గండ్లు, చిల్ల చెట్లు, శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలతో రాకపోకలకు వీలు లేకుండా పోయింది. కొన్ని చోట్ల ఆక్రమణదారులు రొయ్యల చెరువుల సాగుకు అనువుగా కాలువను మార్చుకున్నారు. ఎప్పటికప్పుడు బకింగ్‌హాం కాలువ పునరుద్దరణపై తీర ప్రాంత ప్రజల నుంచి డిమాండ్‌ వస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకింగ్‌ హాం కాలువను కొంత మంది ఆక్రమించుకొని రొయ్యలు, చేపల చెరువులు సాగు చేస్తున్న మాట వాస్తవం. కాలువలో జల రవాణా లేకపోవడంతో అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించడం లేదు. లాకుల గేట్ల వద్ద ఉన్న పరిమిత సిబ్బందితో కలపను కాపాడుతున్నారు… ఇప్పటి వరకు రెండు వేల ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై ఉంటుందని అంచనా. ఉన్నతాధికారుల నుంచి సృష్టమైన ఆదేశాలు వస్తే రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఆక్రమణలను తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఈ లాక్‌డౌన్‌ కాలంలో అతిచౌకైన జలరవాణా మార్గానికి బాటలు పడే వీలు కలుగుతుంది.