- Telugu News Photo Gallery WHO warns over increasing cases of diabetes and heart disease asks to take action
ప్రాణాలకే ప్రమాదం! ఆ కేసులు వేగంగా పెరుగుతున్నాయ్.. చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు..
ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా, సమతుల్య ఆహారం, శారీరక శ్రమను ప్రోత్సహించడానికి వీలైనంత త్వరగా విధానాలను రూపొందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలను కోరింది.
Updated on: Sep 19, 2024 | 12:48 PM

ఆధునిక ప్రపంచంలో మనిషి జీవనశైలి మారింది.. ఆహార పద్దతులూ మారాయి.. దీంతోపాటు అనేక సమస్యలు కూడా పెరుగుతున్నాయి.. ప్రస్తుత యుగంలో ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా, సమతుల్య ఆహారం, శారీరక శ్రమను ప్రోత్సహించడానికి వీలైనంత త్వరగా విధానాలను రూపొందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలను కోరింది. ఈ అనారోగ్య సమస్యలను హైలైట్ చేస్తూ.. WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పలు సూచనలు చేశారు. మధుమేహం, గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి, తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం అని పేర్కొన్నారు. అత్యంత ప్రాణాంతక వ్యాధులుగా మధుమేహం, గుండె జబ్బులు రూపాంతరం చెందకముందే.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు చర్యలను ప్రారంభించాలంటూ డబ్ల్యూహెచ్ఓ దేశాలను కోరింది. దీంతోపాటు పలు సూచనలు చేసింది..

నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది: గుండె జబ్బులు , మధుమేహం, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల సంభవం పెరుగుతోందని వాజేద్ హెచ్చరించారు. ఈ వ్యాధులు ఇప్పుడు మూడింట రెండు వంతుల మరణాలకు కారణమవుతున్నాయి. గణాంకాల ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సుమారు 50 లక్షల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే 5 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 3 లక్షల 73 వేల మంది పిల్లలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

జీవనశైలిలో మార్పులు అవసరం: ప్రస్తుతం, అనేక ప్రాంతాలు వేగవంతమైన జనాభా మార్పు, పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి, అసమతుల్య ఆహారంతో పోరాడుతోంది. ఇది ప్రజల జీవనశైలిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. కౌమారదశలో ఉన్నవారిలో 74%, యువతలో 50% శారీరకంగా చురుకుగా ఉండరు. ఈ పెంపుదల ఇలాగే కొనసాగితే 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం కష్టసాధ్యంగా మారిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

అనారోగ్యకరమైన ఆహారాలపై నిషేధం: ఇప్పటికే చాలా దేశాలు ఫుడ్ లేబులింగ్ నిబంధనలను అమలు చేశాయని, ట్రాన్స్ ఫ్యాట్‌లను నిషేధించాయని, స్వీట్ డ్రింక్స్‌పై పన్నులు పెంచేందుకు చర్యలు తీసుకున్నాయని వాజెద్ చెప్పారు.

అయితే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు ఇంకా అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. మన ఆహారం, శారీరక కార్యకలాపాలను పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైంది.. తద్వారా మనకు మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమంటూ వాజెద్ పేర్కొన్నారు.




