డయాబెటిస్
ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.
మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.
మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.