AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్న వారికి ఇది విషంతో సమానం.. మటన్, చికెన్, చేపల్లో ఏది బెస్ట్ అంటే..

షుగర్ ఉన్నవారు నాన్-వెజ్ ఆహారం తీసుకోవడంపై చాలామందిలో సందేహాలున్నాయి. చికెన్, మటన్, చేపలు తింటే.. షుగర్ పెరుగుతుందేమో.. ఇంకా తింటే ఎలా తినాలి..? ఎంత మోతాదులో తినాలి..? సందేహాలు కలుగుతుంటాయి.. అయితే.. డయాబెటిస్ రోగులు మటన్, ప్రత్యేకించి తలకాయ కూర వంటి రెడ్ మీట్‌ను పూర్తిగా నివారించాలని డైటీషియన్లు చెబుతున్నారు. వీటిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణకు రావడం కష్టం.

షుగర్ ఉన్న వారికి ఇది విషంతో సమానం.. మటన్, చికెన్, చేపల్లో ఏది బెస్ట్ అంటే..
Mutton, Fish, Chicken
Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2026 | 3:18 PM

Share

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) కేసులు పెరుగుతున్నాయి.. అయితే.. డయాబెటిస్ రోగులు రక్తంలో చెక్కర శాతాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఆహారం పై దృష్టిసారించాలి.. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు నాన్-వెజ్ తీసుకోవచ్చా లేదా..? తీసుకుంటే ఎలా తీసుకోవాలి..? అనే సందేహాలు కలుగుతుంటాయి.. అయితే.. కొంతమంది మటన్, చికెన్, చేపలను ఇష్టంగా తింటారు.. ఇంకా మటన్ తలకాయ, లివర్, పాయా కూరలను కూడా ఇష్టంగా కొని తెచ్చుకుని ఆస్వాదిస్తూ తింటారు.. అయితే.. షుగర్ ఉన్న వారు మటన్, చికెన్, చేపలు తినొచ్చా..? లేదా..? ఏది మంచిది అనే విషయాలను తెలుసుకుందాం..

షుగర్ ఉన్నవారు నాన్-వెజ్ ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏవి తినాలి.. ఏవి తినకూడదు అనే విషయాలపై అవగాహనతో ఉండటం చాలా మంచిది. డయాబెటిస్ నియంత్రణలో ఆహారంతో పాటు జీవనశైలి, నిద్ర, నీటి వినియోగం, వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

మటన్, మటన్ తలకాయ, రెడ్ మీట్:

డయాబెటిస్ రోగులకు మటన్, తలకాయ కూర వంటి రెడ్ మీట్ అస్సలు సిఫార్సు చేయబడదు. వైద్యుల ప్రకారం.. షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచాలనుకుంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మటన్ జీర్ణం కావడానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది, ఇది జీర్ణవ్యవస్థపై భారం వేస్తుంది. కైమాతో సహా మటన్ ఉత్పత్తులన్నింటినీ నివారించాలని సూచిస్తున్నారు. ఒకవేళ తినాలనుకుంటే.. తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

మేక తలకాయ కూర ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ B12, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో నిండిన అత్యంత పోషకాహారం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, కండరాల మరమ్మత్తు, మెదడు ఆరోగ్యం, ఎముకల బలం, రక్తహీనత నివారణకు తోడ్పడుతుంది.. అలాగే కొల్లాజెన్ అందించడం ద్వారా చర్మ, కీళ్ల ఆరోగ్యానికి మంచిది. అయితే.. షుగర్ ఉన్నవారు తలకాయ కూర తింటే.. రక్తంలో చక్కెర శాతం మరింత పెరగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చేపలు (ఫిష్): నాన్-వెజ్ లో చేపలు ఉత్తమ ఎంపిక. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు సులువుగా జీర్ణమవుతాయి. అయితే.. “చేపలు ఆరోగ్యకరమైనవి కదా” అని ఎక్కువ మొత్తంలో తినకూడదు.. పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం. నిల్వ ఉంచిన (ఫ్రీజర్‌లో పెట్టిన) చేపలకు బదులుగా, తాజాగా ఉన్నవాటిని తీసుకోవడం మంచిది. చేపలను ప్రతిరోజూ తినాల్సిన అవసరం లేదని.. వారానికి ఒకసారి సరిపోతుందని పేర్కొంటున్నారు..

చికెన్: చికెన్‌ను కూడా డయాబెటిక్ రోగులు పరిమితంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ నియంత్రణలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు ముక్కలు తీసుకోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది.. కాబట్టి, శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం, ఎన్ని బాయిల్డ్ ఎగ్స్ లేదా ఎంత చికెన్ అవసరం అని లెక్కించుకోవడం ముఖ్యం. అధిక ప్రోటీన్ క్యాలరీలను లెక్కించకుండా తీసుకుంటే అది కొవ్వుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

గుడ్లు: గుడ్లలో తెల్లసొన (ఎగ్ వైట్) మాత్రమే డయాబెటిక్ రోగులకు సిఫార్సు చేయబడుతుంది. పచ్చసొనను (ఎగ్ యోక్) పూర్తిగా నివారించాలి. వ్యక్తిగత ఎత్తు, బరువు, BMI, వయసు, జీవనశైలి (ఇండోర్/అవుట్‌డోర్ వర్క్) ఆధారంగా ఎంత తెల్లసొన తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి. క్యాలరీ కౌంట్‌ను పర్యవేక్షించడం చాలా అవసరం.

సీఫుడ్ (రొయ్యలు, పీతలు): చేపలకు మించి రొయ్యలు (ప్రాన్స్), పీతలు (క్రాబ్స్) వంటివి నివారించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వీటిలో అధిక కొలెస్ట్రాల్ – క్యాలరీలు ఉంటాయి.. ఇవి షుగర్ స్థాయిలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.

వంట పద్ధతులు కూడా ముఖ్యమే:

ఆహారాన్ని వండే పద్ధతి కూడా చాలా కీలకం. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. షాలో ఫ్రై, ఎయిర్ ఫ్రై, గ్రిల్డ్ లేదా స్టీమ్డ్ (ఆవిరిపై ఉడకబెట్టిన) పద్ధతులను ఎంచుకోవాలి. నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. తక్కువ మంటపై వండిన ఆహారం సరిగ్గా ఉడికి, జీర్ణక్రియకు సులువుగా ఉంటుంది. అధిక మంటపై వండటం వల్ల ఆహారం సరిగ్గా ఉడకకపోవడమే కాకుండా గ్యాస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.

ఆహార నియంత్రణ, కలయిక:

ఆహారంలో సలాడ్స్ (కీరదోస, ఉల్లిపాయ, క్యారెట్), గట్-ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కీరదోస తొక్క తీయకుండా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది. ఆహార పలకలో కూరగాయలు, సలాడ్లు అధిక భాగం ఉండాలి. కూర కంటే.. అన్నం మరీ తక్కువగా ఉండాలి. డయాబెటిక్ రోగులు తమ ఆరోగ్యం, జీవనశైలి ఆధారంగా తమ ఆహారాన్ని పర్యవేక్షించుకోవాలి.. అవగాహన పెంచుకోవాలి. దీంతో ఆరోగ్యవంతంగా ఉండవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us