- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi 2024: famous ganesha temples in foreign countries like nepal, sri lanka, netherlands, know the details
Vinayaka Temples: విదేశాల్లో ప్రసిద్ది చెందిన వినాయక దేవాలయాలు.. ఆ దేశంలో ఏకంగా వెండితోనే భారీ వినాయకుడి గుడి
పనిలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సు అందించే దేవుడిగా గణపతిని పూజిస్తారు. ప్రతి శుభ కార్యం, కొత్త ప్రారంభం, ప్రయాణం ముందు గణేశుడిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను దేశంలోని అనేక ప్రాంతాలలో చాలా వైభవంగా, ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు, ప్రజలు బొజ్జ గణపయ్య విగ్రహాన్ని తమ ఇంటికి, మండపాలకు తీసుకుని తెచ్చి 10 రోజుల పాటు పూజిస్తారు. నైవేద్యానికి వివిధ రకాల వంటకాలు, స్వీట్లను సిద్ధం చేస్తారు.
Updated on: Sep 04, 2024 | 5:49 PM

ఈ 10 రోజులలో బొజ్జ గణపయ్య విగ్రహ ప్రతిష్టాపన కోసం గొప్ప మండపాలను ఏర్పాటు చేసి అలంకరిస్తారు. వివిధ మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10వ రోజున వినాయక విగ్రహాన్ని నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. ముంబయిలోని సిద్ధివినాయక దేవాలయం, మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయం, కేరళలోని మధుర్ మహాగణపతి దేవాలయం, త్రినేత్ర గణేష్ రణతంబోర్, గణేష్ టోక్ టెంపుల్ గాంగ్‌టక్, ఉచి పిళ్లయార్ టెంపుల్ ,కాణిపాకం గణపయ్య వంటి అనేక దేవాలయాలతో సహా భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన అనేక గణేశ దేవాలయాలున్నాయి. అయితే భారతదేశంలో కాదు కొన్ని విదేశాలలో కూడా గణేశ దేవాలయాలుకూడా ఉన్నాయి. ఈ రోజు విదేశాల్లో ప్రసిద్ధి చెందిన వినాయకుని ఆలయాల గురించి తెలుసుకుందాం..

సూర్యవినాయక దేవాలయం, నేపాల్: సూర్యవినాయక దేవాలయం నేపాల్‌లోని భక్తపూర్ జిల్లాలో ఉన్న హిందూ దేవాలయం. ఈ ఆలయం హిందూ దేవుడైన గణేశుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఖాట్మండు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంది. దీనిని నడక మార్గం ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. సుదూరప్రాంతాల నుంచి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఖాట్మండు లోయలో ఉన్న నాలుగు ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని సూర్య దేవాలయం అని కూడా అంటారు. జలవినాయక గణేష దేవాలయం నేపాల్‌లో ప్రసిద్ధి చెందిన ఆలయం.

శ్రీ సితి వినాయగర్ ఆలయం: శ్రీ సితి వినాయగర్ ఆలయం మలేషియాలోని సెలంగోర్‌లోని పెటాలింగ్ జయలో జలాన్ సెలంగోర్ సమీపంలో ఉంది. దీనిని PJ పిళ్లైయార్ దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న దేవుడు శ్రీ సితి వినాయగర్ రూపంలో ఉన్న గణేశుడు పూజలను అందుకుంటాడు. ఈ ఆలయం మలేషియాలో గణేశుడికి అంకితం చేయబడిన అతిపెద్ద, ప్రసిద్ధ చెందిన ఆలయం అని చెబుతారు.

శ్రీలంకలోని ప్రసిద్ధ గణేష్ దేవాలయం: శ్రీలంకలో గణేశుడిని పిళ్లయార్ అని పూజిస్తారు. ఇక్కడ అనేక ప్రసిద్ధ గణేశుడి ఆలయాలు అక్కడ ఉన్నాయి. అరియాలై సిద్ధివినాయకర్ దేవాలయం, కటరగామ దేవాలయం గణేశ దేవాలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవి.

థాయిలాండ్: థాయ్‌లాండ్‌లోని గణేశ దేవాలయాలలో హువాయ్ క్వాంగ్ స్క్వేర్ ఒకటి. ఆలయంలో రోజూ పూజలు చేస్తారు. థాయ్‌లాండ్‌లో వినాయకుని ఆలయాలు చాలా ఉన్నాయి. అంతేకాదు థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయిలో సిల్వర్ టెంపుల్ అని పిలువబడే ఆలయం వెలుపల వినాయకుడి వెండి విగ్రహం ఉంది.

శ్రీ వరతరాజ సెల్వవినాయక దేవాలయం, నెదర్లాండ్స్: డెన్ హెల్డర్‌లోని శ్రీ వరతరాజ సెల్వవినాయక దేవాలయం నెదర్లాండ్స్‌లోని అతి పురాతన గణేశ దేవాలయం. ఈ ఆలయాన్ని 1991లో శ్రీలంక నుంచి వెళ్ళిన తమిళులు నిర్మించారు. ఈ ఆలయం నెదర్లాండ్స్‌లోని డెన్ హెల్డర్‌లో స్థాపించబడింది.




