- Telugu News Photo Gallery Spiritual photos TTD celebrates Sri Venkateswara Vaibhavotsavam at Hyderabad's NTR Stadium, devotees queueing up for darshanam
Hyderabad: ఘనంగా వెంకటేశ్వర ఉత్సవాలు.. నేత్రదర్శనం, తిరుప్పావడసేవతో పులకించిన హైదరాబాద్ వాసులు
తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవెంకటేశ్వర స్వామికి జరిగే నిత్య పూజావిధానాలను భక్తులకు ముందుకు టీటీడీ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. గోవా గవర్నర్ శ్రీ పిఎస్.శ్రీధరన్ పిళ్లై స్వామివారిని దర్శించుకున్నారు.
Updated on: Oct 13, 2022 | 3:31 PM

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సేవగా తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు.

నేత్రదర్శనం విశిష్టత : ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి. అందువల్లే దీనిని నేత్ర దర్శనం అంటారు.

ప్రతి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చనానంతరం జరిగే నివేదననే తిరుప్పావడసేవ అని, అన్నకూటోత్సవమని అంటారు. ఈ ఘట్టాన్ని హైదరాబాద్‌లోని శ్రీవారి నమూనా ఆలయంలో అర్చకులు భక్తుల ఎదుట ఆవిష్కరించారు.

శ్రీస్వామివారికి ఎదురుగా పెద్దపీఠంపై పులిహోర రాశిని ఏర్పాటుచేశారు. పులిహోరతోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రితో అలంకరించారు. వీటిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చెప్పించారు. వేదపండితులు వేద పారాయణంతోపాటు శ్రీనివాస గద్యాన్ని పఠించారు.

అంతకుముందు శ్రీవారి మూలవిరాట్ నొసటన వెడల్పుగా గల నామాన్ని తగ్గించి సన్నగా చేశారు. ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే చేస్తారు. శ్రీవారు నేత్రాలు తెరిచిన తర్వాత తొలి చూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి. వీటిని మానవమాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగానే స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చూస్తారు. దీనివల్ల ఆ ఆహారపదార్థాలు పవిత్రత పొందుతాయి.

దేశ ప్రజలందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బందీ రాకూడదని, సర్వసౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు అభివృద్ధి పొందాలని, ఎటువంటి ఈతి బాధలు కలుగకూడదని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావడ సేవను ఆచరిస్తారు. అనంతరం ఉదయం 10.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ సరస్వతి ప్రసాద్ ఆలపించిన పలు అన్నమయ్య సంకీర్తనలు భక్తిభావాన్ని పంచాయి. గాయకుడితో పాటు భక్తులు గొంతు కలిపి ఈ కీర్తనలు ఆలపించారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
