జ్యోతిష శాస్త్రం ప్రకారం, శని, శుక్ర గ్రహాలు పరస్పరం వీక్షించుకున్న పక్షంలో జీవితంలో ఒక విధమైన స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు సింహరాశిలో ఉన్న శుక్రుడితో పరస్పర వీక్షణ కలిగి ఉండడం వల్ల జీవితంలో కొన్ని అంశాలకు సంబంధించి ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, ప్రేమ వ్యవహారాలలో కానీ, వ్యక్తిగతంగా కానీ ముఖ్యమైన సమస్యల ప్రభావం బాగా తగ్గిపోయి కొద్దిగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చు. కానీ, వాటి వల్ల ఏర్పడే ఒత్తిడి తగ్గడం, సమస్యల తీవ్రత తగ్గుముఖం పట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. శని, శుక్ర గ్రహాలు మంచి స్నేహితులు. అందువల్ల ఈ పరస్పర వీక్షణ వల్ల వీలైనంతగా శుభమే జరుగుతుంది. ఈ పరిస్థితి ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతుంది.