- Telugu News Photo Gallery Spiritual photos Maha Shivaratri festival celebrations at andhra pradesh, telangana
Maha Shivaratri: మొదలైన శివరాత్రి సందడి.. శైవక్షేత్రాల్లో కోలాహలం.. కొత్త శోభను సంతరించుకున్న ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి సందడి మొదలైంది. శైవక్షేత్రాల్లో కోలాహలం కనిపిస్తోంది.. ఆలయాలు విద్యుత్ కాంతుల మధ్య కొత్త శోభను సంతరించుకున్నాయి.
Updated on: Feb 17, 2023 | 11:59 AM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలంలో పుష్పపల్లకిపై దర్శనమిచ్చారు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు. ఆరో రోజు ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ కాంతుల నడుమ పురవీధులలో గ్రామోత్సవానికి తరిలారు మల్లన్నస్వామి. కోలాటాలు, డమరుక నాధాలు, విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవార్లు భక్తులను కనువిందు చేశారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మార్మోగుతోంది..

మహానందిలో ధ్వజారోహణతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం మయూర వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి. శివరాత్రి కోసం రేపు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి సందడి మొదలైంది. నరసరావుపేట మండలం గురవాయిపాలెంలో హరహరో కోటయ్య, చేదుకో కోటయ్య అంటూ కోటప్పకొండకు బయలుదేరాయి విద్యుత్ ప్రభలు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. కోటప్పకొండ తిరునాళ్ళకు భక్తలు పెద్ద సంఖ్యలో రానుందన 2500 మంది పోలీసులు, 20 మంది డీఎస్పీలు, 50 మంది సిఐలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రకటించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా కొన్ని చోట్ల వాహనాలను మళ్లిస్తున్నారు. ప్రభలపై అశ్లీలతకు తావుండకూడదు, రాజకీయంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదంటూ పోలీసులు ప్రకటన జారీ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పుర మండలం కాళేశ్వర క్షేత్రంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దీపారాధన, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహిస్తారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లికార్జునస్వామి ఆలయంలో మూడు రోజులు నిర్వహించనున్న జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాల గ్రామాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పిలిస్తే పలికే దేవుడిగా, భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగొందుతున్నాడు గట్టు మల్లన్నస్వామి. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల సహా మహారాష్ట్ర నుంచి సుమారు 4 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.




