- Telugu News Photo Gallery Spiritual photos Gold plating of Srivari Nilayam in Dwaraka Tirumala Eluru district
చిన వెంకన్న అంతరాలయం స్వర్ణ కాంతులు మయం.. పరవశించిపోతున్న భక్తులు..ఎంత బంగారమో
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.. స్వర్ణ కాంతులతో దగదగా మంటూ మెరిసిపోతూ అంతరాలయంలో ఉన్న స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదని భక్తులు చెబుతున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించి తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.
Updated on: Dec 19, 2024 | 9:51 PM

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం స్వర్ణ శోభితమై అలరాడుతుంది. బంగారు వాకిలిలోంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. ఇటీవల చిన్న వెంకన్న అంతరాలయ గోడలకు బంగారు తాపడాన్ని చేయించారు.

దాంతో స్వామివారి గర్భాలయం సువర్ణ కాంతులతో దగదగా మెరిసిపోతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన దీపక్ నెక్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1.64 కోట్ల ఖర్చుతో బంగారు తాపడాన్ని చేయించారు. ఆ బంగారు తాపడాన్ని ఇటీవల చిన్న వెంకన్న గర్భాలయంలో గోడలకు అలంకరించారు. దాంతో స్వామివారి గర్భాలయం స్వర్ణ శోభితమయింది.

దీపక్ నెక్స్జెన్ కంపెనీ ఎండి అడుసుమిల్లి వెంకట సుబ్రమణ్యం, కంపెనీకి సంబంధించిన మిగతా భాగస్వామ్యులు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు స్వామివారికి బంగారు తాపడాన్ని విరాళంగా అందించారు.

దీన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఈ ఏడాది అక్టోబర్ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, దాతలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. దాతల సహకారంతో గతంలోనే ఆలయ ప్రధాన ముఖద్వారానికి తలుపులకు సైతం బంగారు తాపడాన్ని చేయించారు.

జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2021లో రూ. 98.31 లక్షల వ్యయంతో 264 గ్రాముల 647 మిల్లి గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం చేయించారు. వాటిని అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే త్వరలో గర్భాలయంలో స్తంభాలకు దాతల సహకారంతో బంగారు పూత చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతరాలయం ముందు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో బంగారు తాపడాన్ని చేయించాలని, త్వరలో ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నట్లు ఆలయ సిబ్బంది అంటున్నారు.

అదేవిధంగా విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తోంది. త్వరలో చిన్న వెంకన్న ఆలయ విమాన గోపురం సైతం స్వర్ణమయం కానుంది. ఆ కార్యక్రమాలు కూడా పూర్తి అయితే వెంకన్న ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవని భక్తులు చెబుతున్నారు.
