- Telugu News Photo Gallery Spiritual photos Dhanteras to Diwali: Three Days Puja Vidhi, Rituals for Wealth and prosperity
ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ప్రసాదించే గోధుమల దీపాన్ని దీపావళి రోజున ఎలా వెలిగించాలంటే..
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. పిల్లలతో పాటు పెద్దలు పిల్లలుగా మారి సరదాగా జరుపుకునే పండగ. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజు రాత్రి లక్షీదేవి, గణపతిని పూజిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని.. ఏడాది మొత్తం డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. అయితే ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంతున్నవారు కొన్ని పరిహారాలు చేయడం వలన ఇబ్బందులు తీరతాయి.
Updated on: Oct 16, 2025 | 11:20 AM

దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని, గణపతిని పూజించే ఆచారం ఉంది. ఈ రోజున ఈ దేవుళ్ళను పూజించడం వలన సలక శుభాలు కలుగుతాయని విశ్వాసం. అయితే దీపావళి పండగను చాలా మంది ఐదురోజుల పాటు జరుపుకుంటారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, నాగుల చవితి, అన్నచెల్లెల పండగగా జరుపుకుంటారు. ఈ రోజున ఏ రోజున ఏ విధంగా లక్ష్మీదేవిని పూజించాలి? పాటించాల్సిన నియమాలను గురించి తెలుసుకుందాం..

దీపావళి పండగ మొదటి రోజుని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు వచ్చింది. ఆ రోజు సంపదల అది దేవత లక్ష్మీదేవిని, సంపదని పంపకం చేసే కుబేరుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో వారి ఇంట్లో డబ్బులకు లోటు ఉండవు. అపమృత్యు దోషం తొలగిపోతుంది. అందుకే యమధర్మ రాజు అనుగ్రహం కోసం ఇంటికి దక్షిణ దిశలో యమ దీపాలను వెలిగిస్తారు. అక్టోబర్ 18 సాయంత్రం ఇంటి దక్షిణ దిశలో యమ దీపాన్ని వెలిగించాలి. బియ్యం పిండితో ఒక ప్రమిదను చేసి ఆవు నూనె వేసి నాలుగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన యమధర్మ రాజు ఆశీస్సులు లభిస్తాయి. మృత్యు భయం తొలగి పోతుంది. అనారోగ్యం సమస్యల నుంచి బయట పడతారని నమ్మకం.

సాయంత్రం పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందురెండు మట్టి ప్రమిదలో నెయ్యి దీపాలు వెలిగిస్తారు. అమ్మవారికి ఇష్టమైన కలుగ పువ్వుని దానిమ్మ వంటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి, కుబేరుడు ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

ఈ సంవత్సరం అక్టోబర్ 19న నరక చతుర్దశి వచ్చింది. ఈ రోజున అభ్యంగ స్నానం చేయాలి. తలకు , ఒంటికి నువ్వుల నూనె రాసుకొని సున్ని పిండితో నలుగు పెట్టుకుని తల స్నానం చేయాలి. కొత్త వస్త్రాలు ధరించాలి.. ఇలా చేయడం వలన నరపీడ దోషాలు తొలగిపోయని నమ్మకం. అంతేకాదు ఈ రోజు లక్శ్మిదేవిని పూజించి సాయంత్రం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి.

దీపావళి రోజున: ఈ పండగ అక్టోబర్ 20 సోమవారం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవి, గణపతిని పూజించాలి. ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. అంతేకాదు బంగారం, వెండి ఆభరణాలను, గులాబీ పువ్వులను పెట్టి అమ్మవారిని పూజించాలి.

ఐశ్వర్యం కోసం: దీపావళి రోజు సాయంత్రం గోధుమ దీపం పెట్టడం వలన అఖండ సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక పళ్ళెంలో గోధుమలు పోసి.. మట్టి ప్రమిదని ఆ గోధుమల మధ్యలో పెట్టి... నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఎంత సేపు వెలిగితే.. అంత మంచిదని.. ఏడాదంతా డబ్బుకు లోటు అన్న మాటే ఉందని విశ్వాసం. ఇలా వెలిగించిన దీపం కొండ ఎక్కిన తర్వాత ఆ గోధుమలను ఆవుకు ఆహారంగా అందించాలి. ఈ పరిహారంతో లక్ష్మి అనుగ్రహం మీ సొంతం.




