- Telugu News Photo Gallery Science photos AI Chatbot: AI Chatbot never tell these 5 things to bot Know if Tells
AI Chatbot: AI చాట్‌బాట్‌కి ఈ 5 విషయాలను ఎప్పుడూ చెప్పొద్దు.. తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివి..!
చాట్‌బాట్‌లు నెమ్మదిగా మన గోప్యతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ చాట్‌బాట్‌ల నుంచి సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఆస్కారం ఉంది. అందుకే కొన్ని అంశాలను చాట్‌బాట్‌లో పంచుకోకూడదు. మరి అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
Updated on: Jul 05, 2023 | 6:43 AM

AI, యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో తెచ్చుకుంటున్న సరికొత్త టెక్నాలజీ. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కొత్త తరానికి వరం అని భావిస్తే.. మరికొందరు వ్యక్తుల భద్రతకు ముప్పు అని వాదిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ.. ఏఐ, చాట్‌బాట్‌లను ఉపయోగించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. అయితే, టెక్నాలజీని ఉపయోగించుకోవడం మంచిదే అయినా.. పలు అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌బాట్‌లు క్రమంగా వ్యక్తిగత భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ చాట్‌బాట్‌ల ద్వారా అటాక్ చేసే అవకాశం ఉందని, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఆస్కారం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. చాట్‌బాట్‌లతో పంచుకోకూడని 5 విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొంతమంది వ్యక్తులు ఆర్థిక సలహాలు, వ్యక్తిగత ఫైనాన్స్‌ని నిర్వహించడం కోసం AI చాట్‌బాట్‌ల సహాయం తీసుకుంటున్నారు. ఇలాంటి వారు సైబర్ నేరగాళ్ల బాధితులుగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాట్ GPT సహాయంతో నేరస్థులు ఎప్పుడైనా ఖాతాలను హ్యాక్ చేసే అవకాశం ఉంది. అందుకే.. ఆర్థిక పరమైన అంశాలను చాట్‌బాట్‌కు ఇవ్వకూడదు.

కొంతమంది AIని మానసిక చికిత్స కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత వివరాలను, సన్నిహిత ఆలోచనలను సైతం చాట్‌బాట్‌తో పంచుకుంటారు. ఇది వారిని ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మీరు చెప్పిన వివరాలన్నీ సైబర్ నేరగాళ్లు విని, బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. అలాగే, చాట్ జీపీటీ మీ మానసిక సమస్యలకు ప్రిస్క్రిప్షన్‌ను సూచించే అవకాశం ఉంది. అది మిమ్మల్ని మరింత ప్రమాదంలో నెట్టే ఛాన్స్ ఉంది.

ఉద్యోగానికి సంబంధించిన రహస్య విషయాలను చాట్‌బాట్‌తో ఎప్పుడూ షేర్ చేసుకోవద్దు. యాపిల్, శాంసంగ్, జెపి మోర్గాన్, గూగుల్ తమ ఉద్యోగులను కార్యాలయంలో చాట్‌బాట్‌లను ఉపయోగించవద్దని ఇప్పటికే హెచ్చరించాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఒక Samsung ఉద్యోగి కోడింగ్ కోసం Chat GPTని ఉపయోగించారు. దీంతో కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారం లీక్ అయ్యింది. అందుకే దీన్ని ఉపయోగించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

చాట్‌బాట్‌తో పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ షేర్ చేయవద్దు. ఈ చాట్‌బాట్‌లు మీ మొత్తం డేటాను పబ్లిక్ సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తాయి. సర్వర్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, హ్యాకర్లు మీ పాస్‌వర్డ్‌ను కనుగొని మోసానికి పాల్పడే అవకాశం ఉంది. మే 2022లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఈ కారణంగానే యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఇటలీలో చాట్ GPT నిషేధించింది.

చాట్ GTPలో నివాస సమాచారాన్ని, ఇతర వ్యక్తిగత డేటాను ఎప్పుడూ పంచుకోకూడదు. ఇలా చేయడం వలన మీ పూర్తి వివరాలను సైబర్ నేరగాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది. అది మిమ్మల్ని మరింత ప్రమాదంలో పడేస్తాయి. అందుకే.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.





























