- Telugu News Photo Gallery President Murmu releases NTR Commemorative Coin, know where to buy it, how it is made and from which material it is made
NTR Commemorative Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం ఎక్కడ దొరుకుతుంది..? దాని విలువ, ప్రత్యేకతలు ఏంటో తెలుసా..
NTR commemorative coin: భారతీయ సినిమా, రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ స్మారక నాణేన్ని విడుదల చేసింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారి స్మారకార్థం ఈ తరహాలో స్మారక నాణేలను విడుదల చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే ఎన్టీఆర్ స్మారక నాణెం విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu | Edited By: Shaik Madar Saheb
Updated on: Aug 28, 2023 | 2:54 PM

NTR commemorative coin: భారతీయ సినిమా, రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ స్మారక నాణేన్ని విడుదల చేసింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారి స్మారకార్థం ఈ తరహాలో స్మారక నాణేలను విడుదల చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే ఎన్టీఆర్ స్మారక నాణెం విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. సాధారణంగా స్మారక నాణేలను విడుదల చేయాలన్న ప్రతిపాదన కేంద్ర సాంస్కృతిక శాఖ చేస్తుంది. లలిత కళలు, రాజకీయాలు, సినిమా, శాస్త్ర పరిశోధనలు.. ఇలా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహానుభావుల గుర్తుగా ఈ స్మారక నాణేలను రూపొందించి విడుదల చేయడం జరుగుతుంది.

కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే కేంద్ర ప్రభుత్వ నాణేల ముద్రణ సంస్థ వాటిని ముద్రిస్తుంది. అయితే, నందమూరి తారక రామారావు స్మారక నాణెం విషయంలో నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ నుంచే ఫైల్ కదిలింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఉన్న ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఈ నాణెం కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అంగీకరిస్తూ మింట్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది హైదరాబాద్ మింట్‌లో ఒక వ్యక్తి స్మారకార్థం తయారైన మొట్టమొదటి నాణెం. ఇప్పటి వరకు దేశంలో పలువురు మహానుభావుల పేరిట స్మారక నాణేలు తయారై, విడుదలైనప్పటికీ.. వాటిలో ఏ ఒక్కటీ హైదరాబాద్ మింట్‌లో తయారుకాలేదు. అవన్నీ ముంబై మింట్ సహా ఇతర ప్రాంతాల్లోనే తయారయ్యాయి. టైగర్ ప్రాజెక్టు సందర్భంగా పులి బొమ్మతో స్మారక నాణేన్ని హైదరాబాద్ మింట్‌లో రూపొందించినప్పటికీ.. వ్యక్తుల పేరిట మాత్రం ఇదే తొలిసారి.

ఈ విషయాన్ని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు స్వయంగా చెప్పారు. తెలుగు ఖ్యాతిని సినీ జగత్తుతో పాటు రాజకీయ రంగంలో నలుదిశలా చాటిన ఎన్టీ రామారావు స్మారక నాణేన్ని తయారు చేసే అవకాశం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. తమ బృందంలో సభ్యులందరూ కష్టపడి ఈ నాణేన్ని తయారు చేసినట్టు వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు.

ఈ నాణెం తయారీలో నాలుగు ధాతువుల మిశ్రమాన్ని ఉపయోగించినట్టు మింట్ అధికారులు తెలిపారు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఈ ప్రత్యేక నాణేన్ని తయారు చేశారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని రూ. 100 నాణెంగా దీన్ని రూపొందించినప్పటికీ.. నాణెం అసలు ధర రూ. 3,500 నుంచి రూ.4,850 వరకు ధర ఉంటుందని వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ధర ఏదైనా సరే అందులో ఉండే నాణెం నాణ్యత ఒకటేనని, కాకపోతే ప్యాకింగ్ మెటీరియల్‌ను బట్టి ధర మారుతుందని అన్నారు. బాక్స్ ప్యాకింగ్‌లో ఎక్కువ ధర ఉంటుందని తెలిపారు. ఈ నాణెం తయారీకి కూడా దాదాపు అంతే ఖర్చవుతుందని, ఇందులో మింట్‌కి ఎలాంటి లాభం ఉందని కూడా వెల్లడించారు. స్మారక నాణెం కాబట్టి మార్కెట్లో చలామణిలో ఉండదు. కేవలం ఆయన గుర్తుగా దాచుకోడానికి మాత్రమే.

అయితే కాలం గడిచేకొద్దీ పురాతత్వ విలువ జోడిస్తే.. భవిష్యత్తులో ఈ నాణెం విలువ మరింత పెరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు తొలి విడతలో 12,000 నాణేలు తయారు చేశారు. కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందని మింట్ అధికారులు చెబుతున్నారు. తమ అంచనాల ప్రకారం 50 వేల నాణేల వరకు డిమాండ్ ఉందని అన్నారు. ప్రస్తుతం డిమాండ్ కి తగినంత తయారీ లేదని, కానీ ఈ నాణేన్ని కోరుకున్న అందరికీ అందేలా తయారు చేసి అందజేస్తామని అన్నారు.

ఈ నాణెం కోరుకునేవారు ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్‌తో పాటు చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియం వద్ద వీటిని అమ్మకానికి పెట్టినట్టు మింట్ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 ఉదయం గం. 10.00 నుంచి ఈ నాణేల అమ్మకం మొదలవుతుందని వెల్లడించారు.





























