Dasara 2023: దసరా ఉత్సవాలకు మైసూర్ ప్యాలెస్ రెడీ.. రాజభవనంలో గజరాజులకు ఘన స్వాగతం, ఊరేగింపు
దసరా నవరాత్రులకు ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూర్ ప్యాలెస్ కూడా సిద్దమవుతుంది. దసరా మహోత్సవాల కోసం ప్యాలెస్ సిటీ అంగరంగ వైభవంగా రెడీ అవుతుంది. సాంస్కృతిక నగరిలో దసరా శోభ సంతరించుకోగా.. పోలీసు బలగాలు ప్యాలెస్‌కు చేరుకున్నాయి. గజరాజులకు మైసూర్ ప్యాలెస్ కౌన్సిల్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికింది.
Surya Kala | Edited By: Ravi Kiran
Updated on: Sep 06, 2023 | 8:26 PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలకు 400ల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మొట్టమొదటిసారిగా కీ.శ 1610 ప్రాంతంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. ఈ దసరా ఉత్సవాల్లో ఏనుగులు ఊరేగింపు అత్యంత ప్రసిద్ధిగాంచింది.అంతేకాదు వాస్తవంగా మైసూరు దసరా ఉత్సవాలు ఓ చరిత్ర, సాహిత్యం, క్రీడలు, సంసృతి, సంప్రదాయాల కలబోసిన ప్రత్యేక సంగమం. ఈ ఏడాది దసరా ఉత్సవాల ప్రారంభోత్సవాల్లో భాగంగా గజరాజులకు స్వాగతం పలికారు

మంగళవారం మధ్యాహ్నం 12.01 గంటలకు కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలో 9 ఏనుగులు ప్యాలెస్‌కు చేరుకున్నాయి. అనంతరం అభిజిన్ లగ్నంలో రాజభవనంలోని జయమార్తాండ ద్వారం వద్ద ఏనుగులకు సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఐదుకు పైగా జానపద బృందాలు గజరాజులు అపూర్వ ఆదరణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏనుగులను ఊరేగింపుగా కొంత దూరం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏనుగులపై వివిధ వాయిద్యాలు వాయించారు.

ఈసారి మైసూరు దసరా జంబూ సవారీలో 14 ఏనుగులు పాల్గొననున్నాయి. కెప్టెన్ అభిమన్యు ఈసారి కూడా అంబారీ మోయబోతున్నాడు. ఈ అభిమన్యుడికి దసరా ఉత్సవాల్లో జంబూసవారిలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అంబారీ ఊరేగింపులో జంబో ప్రధాన పాత్రను పోషించనున్నారు.

ఈ కార్యక్రమంలో మైసూరు జిల్లా ఇంచార్జి మంత్రి డా. హెచ్‌సీ మహదేవప్ప, జిల్లా కలెక్టర్ డాక్టర్ కేవీ రాజేంద్ర, పోలీస్ కమిషనర్ రమేష్ బానోత్, ఎస్పీ సీమా లట్కర్, డీసీపీ ముత్తురాజ్ జాన్హవి, డీసీఎఫ్ సౌరభ్ కుమార్, ఎంపీ ప్రతాపసింహ, ఎమ్మెల్యే శ్రీవత్స హరీశ్ గౌడ్, ఎమ్మెల్సీ సీఎన్ మంజేగౌడ మేయర్ శివకుమార్, ప్యాలెస్ డిప్యూటీ డైరెక్టర్ టీఎస్ సుబ్రహ్మణ్య పాల్గొన్నారు.

అయితే ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో జంబూసవరిలో పాల్గొనే అవకాశాన్ని చైత్ర, విక్రమ ఏనుగులు మిస్ కానున్నాయి. చైత్ర గర్భవతి కాగా, విక్రమార్కుడు ఏనుగును వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో జంబూసవారీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాయి.





























