ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు.. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో నీరు లేకపోవటం అంటే డీహైడ్రేషన్.. దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. శరీరానికి కావలసినంత నీరు అందనప్పుడు, అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.. వాటిలో ముఖ్యమైనది కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీ లోపల ఏర్పడే ఖనిజాలు, లవణాలతో కూడిన గట్టి నిక్షేపాలు. ఉప్పు ఘన పొరలుగా ఇవి మూత్రపిండాలలో పేరుకుపోతాయి. మూత్రంలో అధిక స్థాయిలో కాల్షియం, యూరిక్ యాసిడ్ లేదా ఇతర రసాయనాలు స్ఫటికాలుగా మారినప్పుడు కిడ్నీ స్టోన్ ఏర్పడుతుంది. ఇవి చిన్న ఇసుక రేణువుల మాదిరి నుంచి చిన్న నిమ్మకాయ సైజు పరిమాణం పెరిగే అవకాశం ఉంది.. మూత్రంలో ఖనిజాల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య ప్రారంభమవుతుంది. ఈ స్థితిలో, కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఘన రూపాన్ని తీసుకోవడం ప్రారంభిస్తాయి.. నీటి కొరత కారణంగా అవి మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.