- Telugu News Photo Gallery Devotees Offer Scorpions to Lord Kondala Rayudu in Kurnool District very 3rd Monday of the Sravana month See Pics
కొండల రాయుడికి వింత నైవేద్యం.. శరీరంపై తేళ్లను పాకించుకుంటున్న భక్తులు.. అలా ఎందుకు చేస్తున్నారంటే..?
తేలు.. ఈ పేరు వింటేనే ఎవరికైనా భయమేస్తుంది. కనిపిస్తేనే పక్కకు జరిగిపోతారు ఎవరైనా, ఎక్కడ అది తమను కరుస్తుందో అనే భయంతో. కానీ ఆ స్వామి భక్తులకు తేళ్లు అంటే ఏ మాత్రం భయం లేదు పైగా అభిమానం. అంతే కాదు ఆ తేళ్లని పట్టుకొని నదిలో తమ వీపుపై వేసుకొని సంచరించేలా చేసుకుంటారు. ప్రత్యేక శ్రావణ మాసం మూడవ సోమవారంలో ఈ తేళ్ల పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కొండపై తేలేను వెతికి పట్టుకొని ఒక దండలా చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. చాలా వింతగా అనిపించే ఈ తేళ్ల పండుగను వివరాలను ఓ సారి చూద్దాం..
J Y Nagi Reddy | Edited By: Ram Naramaneni
Updated on: Sep 05, 2023 | 1:21 PM

కర్నూలు జిల్లా: కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడుకి తేళ్లతో నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ ప్రత్యేకత స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

తేళ్లను చేతుల పైన, తలపైన, ముఖం పైన, చివరికి నాలుక పైన పెట్టుకున్నా ఈ ఒక్కరోజు ఏమీ కాదు. తేళ్లు కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు నొప్పి మటుమాయం అవుతుందని స్థానిక భక్తులు చెబుతున్నారు.

ఈ తేళ్ల పండుగ వృత్తాంతం ఏమిటంటే.. 1970వ సంవత్సరం నాటికి కోడుమూరులో సౌరెడ్డి అన్నపూర్ణమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానమే. దీంతో తమకు మగ సంతానం కలిగితే స్వామికి గుడి కట్టించి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తామని కొండల రాయుడుకి మొక్కుకున్నారు.

అనతి కాలంలో సౌరెడ్డి సతీమణి అన్నపూర్ణమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు మనోహర్ రెడ్డి అని నామకరణం చేయడంతో పాటు కోడుమూరు కొండల రాయుడికి కొండ పైన గుడి కట్టించారు.

ఇక అప్పటి నుండి కోడుమూరు నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి తేళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరిన కోరికలు తీరుతున్నాయని భక్తుల నమ్మకం.

ఇదిలా ఉండగా.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ సోమవారం కొండల రాయుడుకి పూజలు నిర్వహించే సమయంలో ముందు రోజు గానీ అదే రోజు గానీ వర్షాలు తప్పకుండా కురుస్తాయి. నెల రోజులు వర్షం లేకున్నా.. స్వామివారిని పూజించిన వెంటనే ఈ రెండు రోజుల్లో వర్షాలు కురవడం విశేషంగా భావిస్తున్నారు భక్తులు..





























