- Telugu News Photo Gallery Cyclone Dana Weather update: IMD Issues Heavy Rain Alert To Andhra Pradesh
Cyclone Dana: తుపాన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.. వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపటికి (అక్టోబర్ 23) నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Updated on: Oct 22, 2024 | 2:00 PM

మరో వాయుగుండం.. ‘సైక్లోన్ దానా’ దూసుకువస్తోంది.. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇది దాదాపు పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 730 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 770 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 740 కి.మీ. దూరంలో ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి..

వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపటికి (అక్టోబర్ 23) నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, వాయువ్య దిశగా కదులుతూ గురువారం (అక్టోబర్ 24) ద్వారా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడుతుంది. ఆ తరువాత అక్టోబర్ 24వ తేదీ రాత్రి - అక్టోబర్ 25 ఉదయంలోపు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో అక్టోబరు 24 - 25న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని.. అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది..

తుఫాన్ నేపథ్యంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పండమేరు వాగు ఒకసారిగా ఉప్పొంగి కాలనీలను ముంచేసింది. వరదల ధాటికి బైకులు, ఆటోలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు పొంగుతుండటంతో హైదరాబాద్- బెంగళూరు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏమైనా సహాయసహకారాలు కావాలంటే తమకు సమాచారం అందించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలకు సూచించారు. ఈ మేరకు వరద ప్రాంతాల్లో పర్యటించారు.
