- Telugu News Photo Gallery Cinema photos With Pawan Kalyan's election victory, new hopes have sprung up in Tollywood
Film News: పవన్ గెలుపుతో కొత్త ఆశలు.. పాన్ ఇండియన్ సినిమాలకు ఊరట లభించనుందా.?
పవన్ కళ్యాణ్ గెలుపుతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయా..? తెలుగు ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఎంత మంచి జరగబోతుంది..? వందల కోట్లతో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలకు ఊరట లభించనుందా..? జనసేనాని గెలుపు టాలీవుడ్‌కు ఎలాంటి మేలు చేయబోతుంది..? సినిమా ఇండస్ట్రీ కష్టాలు తెలిసిన వాడిగా పవన్ ఏం చేయబోతున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Updated on: Jun 08, 2024 | 8:47 AM

ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగు ఇండస్ట్రీకి మరింత మేలు చేస్తాయంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కష్టాలు తెలిసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు గెలవడంతో.. ఇకపై ఇండస్ట్రీకి ఏ సమస్యలు ఉండబోవని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా కల్కితో పాటు పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర లాంటి సినిమాలకు ఇది ఊరటనిచ్చే విషయం.

ఏ ప్రభుత్వం వచ్చినా.. సినిమా ఇండస్ట్రీతో సన్నిహితంగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా సినిమా వాళ్ల సమస్యల్ని మరింత నిషితంగా పరిశీలిస్తుందని నమ్ముతున్నారంతా.

దానికి ప్రత్యేకంగా కారణాలు కూడా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి అయితే.. అక్కడ కొత్త ప్రభుత్వంలో ఇండస్ట్రీ గురించి అనువణువు తెలిసిన పవన్ కళ్యాణ్ ఉన్నారు.

పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం నుంచి మొదలు పెడితే.. బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్ ఇలా ప్రతీ విషయంలోనూ ప్రభుత్వం నుంచి తమకు మద్దతు లభిస్తుందని కోటి ఆశలతో ఉన్నారు దర్శక నిర్మాతలు. అంతెందుకు.. కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ చివరివారంలో అమరావతిలోనే ప్లాన్ చేస్తున్నారు అశ్వినీదత్.

పవన్ కళ్యాణ్ విజయం సినిమా వాళ్లకు ఎంతో సంతోషాన్నిస్తుందనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో కురుస్తున్న అభినందనల వెల్లువే దీనికి నిదర్శనం. తమలోంచి ఒకడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి ఇకపై మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయని కలలు కంటున్నారు నిర్మాతలు. మరి ఆ మార్పు ఎలా ఉండబోతుందో చూడాలిక.




