- Telugu News Photo Gallery Business photos Diwali 2025: Top 5 Post Office Schemes for Safe Investment and High Returns, Check Details
Post Office: నెలనెలా ఆదాయం.. మీ డబ్బును డబుల్ చేసే 5 పోస్టాఫీస్ పథకాలు ఇవే..
దీపావళి పండుగ సంపద, శ్రేయస్సుకు చిహ్నం. ఈ పండగ సందర్భంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శాశ్వత శ్రేయస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు. ఈ దీపావళికి మీరు కూడా మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి, మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరమైన లాభాలను పొందాలనుకుంటే.. పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకాలు మీకు అద్భుతమైన ఆప్షన్స్. ఈ దీపావళికి మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడానికి సహాయపడే టాప్ 5 పోస్ట్ ఆఫీస్ పథకాలను ఇప్పుడు చూద్దాం:
Updated on: Oct 20, 2025 | 7:05 AM

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్: నెలకు స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం సరైనది. ప్రస్తుతం ఈ పథకం 7.4శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఒకే ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ ప్రతి నెలా నేరుగా అకౌంట్‌లో జమ అవుతుంది. క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను ఆదాకు ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపిక. ప్రస్తుతం ఈ పథకంలో 7.10 శాతం వడ్డీ వస్తుంది. ఏడాదికి కనీసం రూ.500 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. దీన్ని కాలపరిమితి 15ఏళ్లు కాగా.. ఆ తర్వాత మళ్లీ కొంతకాలం పొడిగించుకునే అవకాశం ఉంది.

సుకన్య సమృద్ధి యోజన: కూతురి భవిష్యత్తు అవసరాల కోసం రూపొందించిన అత్యుత్తమ పథకం. అత్యధికంగా 8.20శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. ఏడాదికి రూ.250 నుండి రూ.1.5 లక్షల వరకు కట్టుకోవచ్చు. కూతురి చదువు, వివాహం వంటి ప్రధాన ఖర్చులకు ఈ పథకం అండగా ఉంటుంది. ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే పనిచేస్తుంది. కానీ మరింత నమ్మదగినది. ప్రస్తుతం ఈ పథకంలో 6.9శాతం వార్షిక వడ్డీ వస్తుంది. 5 ఏళ్లకు అయితే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల డిపాజిట్లుకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం: ప్రభుత్వం పూర్తిగా హామీ ఇచ్చే ఈ స్థిర ఆదాయ పథకం పెట్టుబడికి భద్రతను అందిస్తుంది. ప్రస్తుతం 7.7శాతం వార్షిక వడ్డీ రేటు ఇస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు కాగా.. కనీసం రూ.1,000 తో పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది.




