AP Politics: ఏపీలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం.. కొత్త పొత్తులు.. ఎత్తులతో పొలిటికల్ పిక్చర్ అదుర్స్
తాజా పరిణామాలు అదే సంకేతాన్ని కాసింత స్పష్టంగానే ఇస్తున్నాయి. ఇప్పటి వరకు వున్న రాజకీయ సమీకరణలు మరికొన్ని రోజుల్లో మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం మిగిలుంది.
ఏపీలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? తాజా పరిణామాలు అదే సంకేతాన్ని కాసింత స్పష్టంగానే ఇస్తున్నాయి. ఇప్పటి వరకు వున్న రాజకీయ సమీకరణలు మరికొన్ని రోజుల్లో మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం మిగిలుంది. ఈలోగా పొలిటికల్ యాక్టివిటీ బాగా పెరగడం ఖాయం. అధికారంలో వున్న వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికలకు సన్నాహకంగా ఏప్రిల్ 3వ తేదీన కీలకమైన ఎమ్మెల్యేల భేటీ నిర్వహించింది. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మినహా అందరు ఎమ్మెల్యేలు దీనికి హాజరు కాగా.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అందరినీ కాపాడుకుంటానంటూనే సుతిమెత్తగా వార్నింగులిచ్చారు. ప్రజలతో మమేకం కావడమే రాజకీయమంటూ తనదైన శైలిలో ప్రజలకు మరింత దగ్గరవ్వాలని సూచించారు. ఏడాదికాలం మొత్తం ప్రజలకు సన్నిహితంగా వుంటూ ఎన్నికల్లో మళ్ళీ గెలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలన్నారు. ఈరకంగా చూస్తే 2024 అసెంబ్లీ ఎన్నికలకు జగన్ వ్యూహం అమలు మొదలైందనే అనుకోవాలి. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు ఎలాంటి కీలకాస్త్రాలను మిగిల్చవద్దని భావిస్తున్న జగన్.. కేంద్రం నుంచి సాధించాల్సిన వాటిపై ఫోకస్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి కావాల్సిన వాటిపై కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్రంలో కీలక మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయి వచ్చారు. పెండింగు ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ద్వారా ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
విపక్షాలపై సునిశిత విమర్శలు
ఒకవైపు పార్టీ వర్గాలను మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలను ఎన్నికలకు సిద్దం చేస్తూనే ఇంకోవైపు విపక్షాలపై సునిశిత విమర్శలు చేస్తున్నారు వైఎస్ జగన్. 2014-19 మధ్య కాలం నాటి వైఫల్యాలను సందర్భం వచ్చిన ప్రతీసారి ఎండగడుతున్నారు. అమరావతి భూముల పంపిణీకి రంగం సిద్దం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ వాయిదా పడింది కాబట్టి ఆగుతున్నారు కానీ లేకపోతే ఈపాటికి వైజాగ్‌కి రాజధానిని తరలించే కార్యక్రమాన్ని కూడా జగన్ వేగవంతం చేసేవారే. ఆ మేరకు సీఎం ఫిబ్రవరి నెలాఖరులోనే ఫీలర్లు వదిలారు. రాజధాని కేసు విచారణ జూన్‌కి వాయిదా పడేసరికి ప్రస్తుతానికి రాజధాని అంశం ఓ మూడు,నాలుగు నెలలపాటు వాయిదా పడిందనిపిస్తోంది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త ఖంగుతిన్నా.. దానికి పైకి కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు జగన్. వైస్సార్సీపీ వర్గాలు కూడా అదేరకంగా గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు.
ఢిల్లీలో పవన్ పడిగాపులు
ఇక ఏపీలో కీలకమైన విపక్ష కూటమిలో పలు మార్పులు గోచరిస్తున్నాయి. ఏప్రిల్ 2న సాయంత్రం అకస్మాత్తుగా ఢిల్లీ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏప్రిల్ 4 సాయంత్రానికి కూడా బీజేపీ అధినేతలను కల్వలేకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే జనసేన అధినేతకు అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. నిజానికి బీజేపీ అధినాయకత్వం పిలిస్తేనే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్ళారని తొలుత ప్రచారం జరిగింది. కానీ రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్‌తో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కానీ, హోం మంత్రి అమిత్ షా గానీ భేటీ కాకపోవడం, కనీసం అపాయింట్‌మెంటు కూడా ఖరారు కాకపోవడంతో ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మిత్రపక్షమైన జనసేన తమ పార్టీతో సంబంధాలపై చర్చించడానికి వస్తే అపాయింటుమెంటు ఇచ్చేవారని, ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూతగా ఓ రాయబారానికి వచ్చాడన్న సమాచారం మేరకే బీజేపీ అధిష్టానం పవన్ కల్యాణ్‌కు సమయం ఇవ్వడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో జగకట్టిన చంద్రబాబు .. ప్రధాని మోదీపైనా, బీజేపీ నాయకత్వంపైనా ఘాటైన విమర్శలు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ఇపుడు టీడీపీ అధినేత బీజేపీకి దగ్గరవ్వాలని భావిస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవద్దని బలంగా కోరుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా 2024 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటే వైసీపీని గద్దె దింపవచ్చని జనసేన అధినేత భావిస్తున్నారు. అదేసమయంలో ఇలా మూడు పార్టీలు కలిసి వెళ్ళడం వల్ల ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి లాభిస్తుందని పవన్ కల్యాణ్ బీజేపీ అధిష్టానానికి నచ్చజెప్పేందుకే ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుతో కలిసేందుకు బీజేపీ అధినేతలు సిద్దంగా లేనట్లు సమాచారం. ఏపీలో సీట్లు రాకపోయినా ఫరవాలేదు కానీ చంద్రబాబుతో మళ్ళీ జతకట్టవద్దని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త పొత్తులకే ప్రాధాన్యం!
ఇక పవన్ కల్యాణ్ పార్టీ ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మొండిచేయి చూపించిందని ఏపీ బీజేపీ నేతలు తమ అధినేతలకు ఇదివరకే నివేదిక ఇచ్చారు. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికతోపాటు ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ వర్గాలు తెలుగుదేశం పార్టీ విజయానికి పని చేశారని, అందువల్లే బీజేపీ సిట్టింగు సీటైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాన్ని కోల్పోయామని ఏపీ బీజేపీ నేతలు తమ అధినాయకత్వానికి చెప్పుకున్నారు. దాంతో పాటు గత కొన్నాళ్ళుగా టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్న సంకేతాలు చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. ఉత్తరాంధ్ర జనసేన ఓటు బ్యాంకు పూర్తిగా టీడీపీ వైపు మళ్ళింది. ఈ పరిణామాలనన్నింటినీ పరిగణలోకి తీసుకున్నందు వల్లనే పవన్ కల్యాణ్‌ను వదులుకునేందుకు బీజేపీ పెద్దలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 2024 ఎన్నికలు వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన అలియెన్స్ మధ్య జరగడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన, బీజేపీ మధ్య స్నేహం దెబ్బతింటే టీడీపీ-జనసేన కూటమికి దగ్గరయ్యేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాచుకుని వున్నాయి. దాంతో 2024 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.