Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు.. ఠాగూర్ అవుట్.. ఠాక్రే ఇన్.. గంటల వ్యవధిలో మారిన ఇంఛార్జీలు

ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ.. రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తుండగా తెలంగాణ కాంగ్రెస్ మాత్రం అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడడం ఎంతమాత్రం కరెక్టు కాదని పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులు...

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు.. ఠాగూర్ అవుట్.. ఠాక్రే ఇన్.. గంటల వ్యవధిలో మారిన ఇంఛార్జీలు
Telangana Map, Gandhibhavan , Revanth Reddy
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 04, 2023 | 9:22 PM

జీ-9గా ఇటీవల తెరమీదికి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మొత్తానికి అనుకున్నది సాధించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి తానా అంటే తందానా అంటున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ని తప్పించాలని కొంతకాలంగా తాము పడుతున్న పట్టును ఎట్టకేలకు నెగ్గించుకున్నారు. గత 20 రోజులుగా మాణిక్కం ఠాగూర్‌ని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 4న ఉన్నట్టుండి మాణిక్కం ఠాగూర్ తెలంగాణ నేతలకు ధన్యవాదాలు చెబుతూ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సప్ గ్రూపుల నుంచి నిష్క్రమించారు. దాంతో ఆయన తెలంగాణ వ్యవహారాల నుంచి తప్పుకున్నట్లుగా పరోక్షంగా వెల్లడించినట్లయింది. అయితే మాణిక్కం ఠాగూర్ స్థానంలో ఎవరిని నియమిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తి రేపింది. కానీ గంటల వ్యవధిలోనే ఏఐసీసీ ఇంఛార్జిని ప్రకటించేసింది. ఇది ఎన్నికల సంవత్సరం. తెలంగాణ అసెంబ్లీకి మరో 9 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి చెప్పి.. అందరు ఒక్కతాటిపైకి వచ్చి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వుంది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ.. రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తుండగా తెలంగాణ కాంగ్రెస్ మాత్రం అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడడం ఎంతమాత్రం కరెక్టు కాదని పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకుంటున్నారు. సమస్యలను చక్కదిద్దేందుకు పక్కా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నారు.

కమిటీల ప్రకటనతోనే చిచ్చు

2022 డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జంబో కార్యవర్గాన్ని, దాంతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని, కొన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులను భర్తీ చేస్తూ ఏఐసీసీ జాబితాలను విడుదల చేసింది. అప్పటిదాకా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై చాప కింద నీరులా పెరుగుతూ వస్తున్న అసంతృప్తి.. ఈ కమిటీల ప్రకటనతో బహిర్గతమయ్యింది. డిసెంబర్ 10వ తేదీన సాయంత్రం కమిటీల ప్రకటన వెలువడిన వెంటనే మాజీ మంత్రి కొండా సురేఖ లాంటి వారు నేరుగా రేవంత్ రెడ్డికి కాల్ చేసి మరీ తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానంతో సురేఖ సంతృప్తి పడినట్లుగా మర్నాటి పత్రికల్లో ప్రచురితమయ్యింది. సురేఖ సంగతి అలా పక్కన పెడితే కమిటీల ప్రకటన వెలువడిన మర్నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడ్డాయి. కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో తమ అన్సతృప్తిని వెళ్ళగక్కితే.. మరికొందరు నేతలు బహిరంగంగానే కామెంట్లు చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేరుగా గాంధీభవన్‌కు వచ్చి తన అసంతృప్తిని మీడియా ముందు బహిర్గత పరిచేందుకు సిద్ధమయ్యారు. అయితే కొందరు నేతలు ఆయనను అనునయించడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. కానీ ఆ తర్వాత రెండు, మూడు రోజులపాటు తన నివాసంలో తన అనుచరులతోనూ, కొందరు పార్టీ నాయకులతోనూ అంతర్గత సమావేశాలను కొనసాగించారు దామోదర రాజనర్సింహ. ఆ తర్వాత నేరుగా మీడియా ముందుకు వచ్చి కమిటీల నియామకంపైనా, డిసిసి అధ్యక్షుల ఎంపికపైనా సునిశిత విమర్శలు చేశారు. చిరకాలంగా పార్టీలో పని చేస్తున్న వారిని కాదని, ఇటీవల పార్టీలో చేరిన వారికి కమిటీలలోను, డిసిసి అధ్యక్షుల ఎంపికలోను పెద్దపీటవేశారు అన్నది రాజనర్సింహ చేసిన కామెంట్. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు పరిస్థితి చక్కబడుతున్నట్లుగానే కనిపించింది. కానీ ఆ వెంటనే జీ-9 పేరిట తొమ్మిది మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు రహస్యంగా భేటీ అయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, గీతారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. పలువురు కీలక నేతలు ఈ భేటీలో పాల్గొనడంతో వ్యవహారం కాస్తా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. అప్పటినుంచి ఈ సీనియర్ నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే తెలంగాణ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతలను మరో సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు అప్పగించారు. బాధ్యతలు అప్పగించిన వెంటనే రంగంలోకి దిగిన దిగ్విజయ సింగ్ ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా సమాలోచనలు జరిపారు. ఈ ముగ్గురి ఆలోచనలను, అభిప్రాయాలను తెలుసుకొని మర్నాడు హైదరాబాద్ వచ్చి రెండు రోజులు గాంధీభవన్లో పలువురు సీనియర్ నాయకుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి వెళుతూ పార్టీలో నెలకొన్న పరిణామాలు టీ కప్పులో తుఫాను లాంటివని, వాటిని పెద్దవిగా చూడవద్దని తేల్చేశారు. అదే సమయంలో పార్టీ నాయకులందరికీ సున్నితంగా హెచ్చరిక కూడా చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ అంతర్గత వేదికలపైనే చర్చించుకోవాలని, నేరుగా మీడియాకు ఎక్కవద్దని డిగ్గీ రాజా వార్నింగ్ ఇచ్చారు.

దిగ్విజయ్ రాక.. తగ్గని జీ-9 సెగ..

దిగ్విజయ్ సింగ్ పర్యటన ముగిసిన తర్వాత పార్టీలో పెద్దగా ప్రతిస్పందనలు కనిపించలేదు. కానీ, అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదు అన్న కథనాలు మాత్రం మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జనవరి 4వ తేదీన రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి, దానికి హాజరు కావాల్సిందిగా పార్టీ కీలక నేతలందరినీ కోరారు. జనవరి 26వ తేదీ నుంచి తాను చేయ తలపెట్టిన ‘‘హాత్ సే హాత్ జోడో ’’ పాదయాత్రకు సంబంధించి సమావేశంలో చర్చిద్దామని ఆయన ప్రతిపాదించారు. తన పాదయాత్ర షెడ్యూలును ఖరారు చేయడంతోపాటు పాదయాత్రలో హైలైట్ చేయాల్సిన అంశాలను ఖరారు చేసేందుకే ఈ సమావేశం అని రేవంత్ రెడ్డి వర్గం వెల్లడించింది. ఈ సమావేశానికి హాజరు కావాలని సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నాయకులకు సూచించారు. కానీ తాము కోరిన ఏ పని జరగని కారణంగా సీనియర్ నాయకులు పట్టు సడలించలేదు. రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి జీ-9 సీనియర్ నాయకుల్లో కొందరు గైర్హాజరయ్యారు. దిగ్విజయ సింగ్‌తో జరిగిన సమావేశాల్లో సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కొందరు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌ను మార్చాలని మరికొందరు అధిష్టానాన్ని కోరారు. అయితే దిగ్విజయ్ సింగ్ వచ్చి వెళ్లి 15 రోజులు అవుతున్నా ఈ రెండింటిలో ఏది అమలు కాకపోవడంతో సీనియర్ నాయకులు తమ సత్తా చాటే ఎందుకే నిర్ణయించుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి వారు వెళ్లవద్దని నిర్ణయించుకున్నారు. కానీ సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడు కోరినపుడు వెళ్ళకుంటే బావుండదన్న ఉద్దేశంతో సీఎల్పీ నేతగా వున్న భట్టి విక్రమార్క, గతంలో క్రమశిక్షణా సంఘం ఛైర్మెన్‌గా వ్యవహరించిన కోదండ రెడ్డి వంటి వారు సమావేశానికి హాజరయ్యారు. దీంతో జీ-9 నేతల బృందంలో చీలిక వచ్చిందని, వారిలో కొందరు రేవంత్ నిర్వహిస్తున్న సమావేశాని వచ్చారని గాంధీభవన్‌ వర్గాలు కొన్ని మీడియా సంస్థలకు లీకులిచ్చాయి. ఇది రేవంత్ రెడ్డి వర్గం వ్యూహాత్మకంగా చేసిందని జీ-9 నేతల అనుచరులు ఆరోపణలు చేశారు. మొత్తానికి ఈ తొమ్మిది మందిలో కీలక నేతలు రేవంత్ నిర్వహించిన సమావేశానికి దూరంగానే వున్నారు. తన జిల్లాకు చెందిన భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి తనకు నామమాత్రంగానైనా ఆ విషయం చెప్పలేదని భట్టి విక్రమార్క గుర్రుగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది.  సీనియర్ నాయకులంతా పట్టుదలగా ఉండడంతో ఇక తప్పదు అనుకున్నారో ఏమో కానీ మాణిక్కం ఠాగూర్.. పార్టీ వాట్సప్ గ్రూపుల నుంచి నిష్క్రమించడం ద్వారా తెలంగాణ వ్యవహారాల నుంచి తప్పుకున్నట్లుగా పరోక్షంగా ప్రకటించేశారు.

ఠాగూర్ ప్లేసులో ఠాక్రే

మాణిక్కం ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ బాధ్యతల నుంచి తప్పకుండా నేపథ్యంలో ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారు అన్నది కొన్ని గంటలపాటు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యింది. పలువురు జాతీయ నేతల పేర్లు చర్చకొచ్చాయి. మరో 9 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ఎన్నికల దిశగా సమాయత్తం చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్ లో పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చేలా రాష్ట్ర స్థాయి నాయకత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వాన్ని ఒక్క తాటిమీద నడిపించేలా జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాల దృష్ట్యా తెలంగాణ వ్యవహారాల బాధ్యతలను ఎవరికి కట్టబెడతారన్నది ఆసక్తి రేపింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులుగా వ్యవహరించిన వారిలో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ వంటి వారు తమ అనుభవాన్ని రంగరించి మరి పార్టీ శ్రేణులను ఒక్క తాటిపై ఉంచగలిగారు. ఈ ముగ్గురిలో గులాం నబీ ఆజాద్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాశ్మీర్లో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసుకొని అక్కడి అసెంబ్లీకి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ క్రియాశీల రాజకీయాలలో అంతగా కనిపించడం లేదు. 82 ఏళ్ల వయోభారం కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలలో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. అలాంటి వ్యక్తికి తెలంగాణ బాధ్యతలు ఇవ్వకపోవచ్చు అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వినిపిస్తోంది. ఇక మిగిలింది అత్యంత యాక్టివ్ గానూ అదే సమయంలోను తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న నేతగాను కొనసాగుతున్న దిగ్విజయ్ సింగ్‌కే రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగిస్తారని చాలా మంది అనుకున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తేవడంతో పాటు కేసీఆర్ లాంటి అపర చాణక్యున్ని ఎదుర్కొనే వ్యూహాలను రచించే సత్తా దిగ్విజయ సింగ్‌కు ఉందని పలువురు భావించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలోనే దిగ్విజయ్ సింగ్ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. దాంతో సహజంగానే ఆయనకు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తన అనుచర వర్గాన్ని కాపాడుకోవాల్సిన, అవసరం వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అగత్యం ఉంటుంది. అలాంటప్పుడు తెలంగాణ బాధ్యతలను తీసుకునే విషయంలో దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం మరోలా ఉండడం వల్లనే ఆయనకు బాధ్యతలు అప్పగించనట్లు తెలుస్తోంది. దానికి తోడు ప్రస్తుతం ఉత్తరాదిన కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు దిగ్విజయ్ సింగ్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సో పెద్ద బాధ్యత కాబట్టి తెలంగాణ విషయంలో ఆయన ఆసక్తి చూపకపోవచ్చని అనుకుంటున్నారు. ఈ ముగ్గురు కాకుండా ముకుల్ వాస్నిక్, పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, వాయలార్ రవి, చిదంబరం వంటి నేతల పేర్లు కూడా వినిపించాయి. వీరిలో వాయలార్ రవి గతంలో ఉమ్మడి ఏపీ వ్యవహారాల ఇంఛార్జిగా వ్యవహరించారు. కానీ ఇపుడు ఆయన వయస్సు 85 ఏళ్ళు. కాబట్టి ఆయన పేరును పక్కన పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఇక చిదంబరం మంచి వ్యూహకర్త అయినప్పటికి గట్టిగా వ్యవహరించే వ్యక్తి కాదని, కాస్త మెతక అని చెప్పుకుంటున్నారు. కీలక సమయంలో పార్టీ ఇంఛార్జిగా గట్టి వ్యక్తి అవసరమని, మెతక వైఖరి వర్కౌట్ కాదని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఆ తర్వాత చర్చలో నానిన మరో కీలక నేత ముకుల్ వాస్నిక్. చివరికి ముకుల్ వాస్నిక్‌ను కూడా పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్ రావు ఠాక్రేను నియమించింది. మహారాష్ట్రలోని యవత్‌మాల్ జిల్లాకు చెందిన మాణిక్ రావు ఠాక్రే ఏడేళ్ళపాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. 2008 నుంచి 2015 వరకు ఆయన ఎంపీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగాను, రెండు మార్లు ఎమ్మెల్సీగాను ఎన్నికయ్యారు. మహారాష్ట్ర కేబినెట్‌లో పలు మార్లు మంత్రిగాను వ్యవహరించారు. 68 ఏళ్ళ ఠాక్రే.. తెలంగాణకు పొరుగునే వున్న యవత్‌మాల్‌కు చెందిన వారు కావడంతో ఇక్కడి పాలిటిక్స్‌పై అవగాహన వుందని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సమయం ఎక్కువగా లేకపోవడంతో ఒకటి, రెండు గంటల వ్యవధిలోనే తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీని నియమిస్తూ ఎఐసిసి ప్రకటన వెలువరించినట్లు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాలను చక్కదిద్దడంలో ఠాక్రే ముందు పలు సవాళ్ళు కనిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఆసక్తికర దిశగా సాగుతున్నాయని చెప్పాలి.

మీరు తాగుతోన్న పాలు.. కల్తీవా, మంచివా.? ఇలా తెలుసుకోండి..
మీరు తాగుతోన్న పాలు.. కల్తీవా, మంచివా.? ఇలా తెలుసుకోండి..
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..
మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?
మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?
రెండుసార్లు బ్రేకప్.. అలాంటి వ్యక్తులంటే అస్సలు నచ్చదు.. తమన్నా..
రెండుసార్లు బ్రేకప్.. అలాంటి వ్యక్తులంటే అస్సలు నచ్చదు.. తమన్నా..
మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం
మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం
వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!
డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!
ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..
ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..
'వేదం' సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
'వేదం' సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?