రబ్బరు స్టాంపైతే ఓకే… లేదా కేంద్ర, రాష్ట్రాల మధ్య కలహమే.. గవర్నర్ల వ్యవస్థలో మార్పులు అనివార్యమా?
టీడీపీ చీలిక వర్గానికి సారథ్యం వహించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావును, ఇందిర ఆదేశాలకు అనుగుణంగా నాదెండ్లకు సహకరించిన గవర్నర్ రాంలాల్‌ని చరిత్ర ఎన్నటికీ మరిచిపోదు.
గవర్నర్ల వ్యవస్థపై చర్చ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. జాతీయ స్థాయిలో ఈ చర్చ ఎప్పుడు మొదలైందోగానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి కాలంలో 1984 ఆగస్టు రాజకీయ సంక్షోభం గవర్నర్ల వ్యవస్థపై చర్చకు తెరలేపిందని చెప్పాలి. సినీ నటునిగా అనితర సాధ్యం కానీ ప్రేక్షకాభిమానం సంపాదించిన నందమూరి తారక రామారావు, తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనతికాలంలోనే ఏపీ వ్యాప్తంగా సుడిగాలి చైతన్యరథ పర్యటన చేసి, తిరుగులేని మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయితే, ఆయన అమెరికా వెళ్ళిన సందర్భాన్ని వాడుకుని ఆయన్ను పదవీచ్యుతున్ని చేసిన ఆనాటి వ్యవహారం ఎన్నటికీ మరువలేనిది. తిరుగులేని ప్రజాభిమానం వున్న ఓ నాయకున్ని దొడ్డిదారిన పదవి నుంచి తప్పించిన ఆనాటి కాంగ్రెస్ అధినేత్రి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజకీయ కుటిలతను ఎండగట్టేందుకు కాంగ్రేసేతర రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. టీడీపీ చీలిక వర్గానికి సారథ్యం వహించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావును, ఇందిర ఆదేశాలకు అనుగుణంగా నాదెండ్లకు సహకరించిన గవర్నర్ రాంలాల్‌ని చరిత్ర ఎన్నటికీ మరిచిపోదు. అదే సందర్భంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరిట లెఫ్టు, రైటు రాజకీయ పార్టీలు తమ సిద్దాంతాలను పక్కనపెట్టి మరీ ఎన్టీఆర్‌కు తిరిగి పదవి లభించే దాకా పోరాడిన ఆనాటి నాయకులను అభినందించకుండా వుండలేరెవరు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల వెన్నుపోటు తెరమీదికి రాగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే కేంద్రం దిగొచ్చేలా ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా, రాజకీయ పోరాటం ఫలించింది.
సెప్టెంబర్ 15వ తేదీన ఎన్టీఆర్ చేతికే ముఖ్యమంత్రి పగ్గాలు చేరిపోయాయి. కేంద్రంలో అధికారంలో వున్న వ్యక్తులు గవర్నర్ల వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తెలిపేందుకు 1984 ఆగస్టు సంక్షోభమే చక్కని ఉదాహరణ. ఆ తర్వాత నాలుగు దశాబ్ధాల కాలంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల మధ్య విభేదాలను మన దేశం చూస్తూ వచ్చింది. అదేసమయంలో పలు రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా గవర్నర్లతో సఖ్యతతో మెలిగిన ఉదంతాలు లేకపోలేదు. తెలంగాణ రాజకీయ దురంధరుడు డా. మర్రి చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరించినపుడు అక్కడి జయలలిత ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారు. నిజానికి జయలలిత జైలు జీవితం అనుభవించడానికి ఆనాడు చెన్నారెడ్డి తీసుకున్న ఓ నిర్ణయమే కారణమని ఇప్పటికీ అందరు భావిస్తారు. జయలలితకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ హోదాలో చెన్నారెడ్డి స్పందించారు. విచారణకు ఆదేశించారు. ఆనాటి చెన్నారెడ్డి నిర్ణయమనే జయలలితపై కేసుల నమోదుకు, సుదీర్ఘ విచారణకు దారి తీశాయి. చివరికి ఆమెకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే తుది శిక్ష ఖరారయ్యేనాటికి ఆమె మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో గవర్నర్ల వ్యవస్థపై పలు సందర్భాలలో చర్చ జరుగుతూనే వుంది. రాచరిక సంప్రదాయాలను గుర్తుకు తెచ్చే గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని కూడా పలువురు పలు సందర్భాలలో డిమాండ్ చేశారు.
ఇదిలా వుంటే.. ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ముందుగా కేరళ సంగతి తీసుకుందాం. కేరళలోని పద్నాలుగు యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. చాన్స్‌లర్ హోదాలో వైస్ చాన్స్‌లర్లను మార్చాలనుకున్నారాయన. వీరిలో కొందరు చాన్స్‌లర్లు అక్కడి రూలింగ్ కూటమి లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌కు సానుభూతి పరులు. వామపక్ష విద్యార్థి సంస్థల్లో చురుకుగా వ్యవహరించే వారు. ఈక్రమంలో వారిని రక్షించుకునేందుకు సంకల్పించింది కేరళ ప్రభుత్వం. పదిహేనేళ్ళ క్రితం ఓ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు పరుస్తున్నామంటూ గవర్నర్‌కు బదులుగా విద్యారంగంలో అనుభవమున్న వారిని యూనివర్సిటీల ఛాన్స్‌లర్లుగా నియమించనున్నట్లు ప్రకటించింది పినరయి విజయన్ ప్రభుత్వం. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, గవర్నర్ ఒక్కరే రాష్ట్రంలోని పద్నాలుగు యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా వ్యవహరించేవారు. తాజా కేబినెట్ నిర్ణయం మేరకు అన్నింటికీ కలిపి ఓ విద్యారంగ మేధావిని ఛాన్స్‌లర్‌గా నియమిస్తారా లేక పద్నాలుగు విశ్వవిద్యాలయాలకు పద్నాలుగురు ఛాన్స్‌లర్లను నియమిస్తారా అన్నది తేలాల్సి వుంది. ఏది ఏమైనా కేరళలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరింత గ్యాప్ పెరిగినట్లయ్యింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే గత రెండేళ్ళుగా రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్ (తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం) కు మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎప్పుడైతే కేంద్రంలోని బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా సీఎం కేసీఆర్ భావించడం మొదలైందో అప్పట్నించి గవర్నర్ తమిళిసైని కేంద్రం ఏజెంటుగా చూడడం ప్రారంభించారు. ఈక్రమంలోనే సీఎం, గవర్నర్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ దూరం ఏ స్థాయికి వెళ్ళిందంటే… శాసనసభలో గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేంత వరకు.. ఇంకా చెప్పాలంటే గవర్నర్ గౌరవసూచనకంగా నిర్వహించే ఎట్ హోంను సీఎం బహిష్కరించేంత వరకు వెళ్ళింది. ఈ రెండేళ్ళలో సీఎం, గవర్నర్ ముఖాముఖీ పలకరించుకున్న సందర్భం ఏదైనా వుందీ అంటే అది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రమే. ఈక్రమంలోనే తన గవర్నర్ పదవికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని తమిళిసై పలు సందర్భాలలో బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రెండు నెలల క్రితం రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన ఎనిమిది బిల్లులను రాటిఫై చేయడంలో గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. యూనివర్సిటీలలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన బిల్లును ఆమోదించకపోవడంతో దాదాపు 500 పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. అయితే ఈ బిల్లు విషయంలో తనకు క్లారిఫికేషన్లు కావాలని, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్‌భవన్‌కు పంపాలని గవర్నర్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ వెళ్ళింది. ఈక్రమంలో విద్యాశాఖ మంత్రిని గవర్నర్ వద్దకు పంపే విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్సుకతతో ఎదురు చూశారు. కానీ సీఎం ఆదేశాల మేరకు సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ వద్దకు వెళ్ళారు. క్లారిఫికేషన్ ఇచ్చారు.
మొత్తమ్మీద పరిస్థితిని లోతుగా చూస్తే ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్ తమ అధికారాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించడం అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చడం లేదు. తమ పరిధిలోకి గవర్నర్లు చొచ్చుకువస్తున్నారనే అభిప్రాయానికి వస్తున్నారు. గవర్నర్ల ద్వారా కేంద్ర రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకుంటుందని భావిస్తున్నారు. తత్ఫలితంగానే పలు రాష్ట్రాలలో ప్రభుత్వాధినేతలకు, రాజ్యపాల్‌కు మధ్య అగాధం పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితి అలాగే కనిపిస్తోంది. స్వతంత్ర భారత చరిత్రలో స్వతంత్రంగా వ్యవహరించేందుకకు యత్నించిన గవర్నర్లు అరుదుగానే కనిపిస్తారు. వారే రాష్ట్ర ప్రభుత్వాధినేతలతో అంతరం పెంచుకున్న గవర్నర్ల జాబితాలోను వుంటారు. గవర్నర్లు కేవలం రబ్బరు స్టాంపుగా వున్న రాష్ట్రాలలో ప్రభుత్వాధినేతలతో వారికి ఎలాంటి సమరమూ లేదు. సో.. స్వతంత్రంగా వ్యవహరించని విధంగా గవర్నర్ల వ్యవస్థను మార్చడమో లేక ముఖ్యమంత్రి సూచించిన వారికే పదవిని అప్పగించడమో ఈ సమస్యకు పరిష్కారమని చెప్పాల్సి వస్తుంది.