AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొడుకు చేసిన పనికి తండ్రి బలి.. వేటకోడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు..

కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలయ్యాడు. వినడానికి ఏదోలా ఉన్నా... జరిగింది మాత్రం అత్యంత దారుణం. ఆ తండ్రిని వేటాడి వెంటాడి వేట కొడవళ్లతో నరికి చంపారు నిందితులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును ఛేదిస్తే కుమారుడిపై పగను తండ్రిని చంపి తీర్చుకునే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు.

Telangana: కొడుకు చేసిన పనికి తండ్రి బలి.. వేటకోడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు..
Man Murdered Over Son Extra Marital Affair
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Dec 25, 2025 | 8:39 PM

Share

చావులేవైన కారణం వివాహేతర సంబంధమే అన్నట్లు తయారైంది సొసైటీ. ఇన్నాళ్లు భర్తలు, భార్యలు వారి ప్రియుళ్లు, ప్రియురాళ్ల మధ్యే ఈ క్రైమ్ నడిచిందనుకుంటే ఇప్పుడు కుటుంబ సభ్యులకు పాకింది. వివాహేతర బంధాలకు రక్త సంబంధీకుల నెత్తురు కళ్ల చూస్తున్నారు ప్రత్యర్థులు. ఇలాంటి ఘటనే పాలమూరు జిల్లా దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామంలో జరిగింది. అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు దేవరకద్ర మార్కెట్ యార్డులో హమాలీ పనిచేస్తున్నాడు. మైబు కుమారుడు అనిల్ అదే గ్రామానికి చెందిన అక్కినోళ్ల రాఘవులు భార్యతో గడిచిన కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇదే అంశం ఇరువురి ఇళ్లలో తెలియడంతో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. అయినప్పటికీ ఇరువురు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ క్రమంలో రాఘవులు మనస్థాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విషయం తెలియగానే మైబు కుమారుడిని గ్రామం నుంచి హైదారాబాద్‌కు పంపించి ఊరికి దూరంగా ఉంచాడు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య అనేక సార్లు గొడవలు జరిగాయి. ఇక తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై రాఘవులు అన్న హనుమన్న కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. దీంతో చిన్నరాజమూరుకు చెందిన చిన్నరాములును సంప్రదించాడు.

తండ్రి లేదా కొడుకు హత్యకు సుపారీ

చిన్నరాములు తనకు పరిచయస్తుడైన మహబూబ్ నగర్ జిల్లా దొడ్డలోనిపల్లికి చెందిన గొల్ల మల్లేశ్, మణికొండ గ్రామానికి చెందిన శరత్‌‌ను కలిపించాడు. తన తమ్ముడి చావుకు కారణమైన అనిల్ లేదా అతడి తండ్రి మైబును హతమార్చాలని చెప్పాడు. ఇందుకోసం వారితో రూ.8లక్షలకు సుపారీ సెట్ చేసుకున్నాడు హనుమన్న. హత్యకు ముందు 3.90లక్షలను అడ్వాన్స్‌గా సుపారీ గ్యాంగ్‌కు చెల్లించాడు. మిగతాది హత్య అనంతరం అప్పచెప్పాడు. అడ్వాన్స్ ముట్టడంతో హత్య కోసం సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. అనిల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండడంతో తండ్రి మైబును హతమార్చాలని ఫిక్స్ అయ్యారు. మైబు కదలికలపై సుమారు వారం పాటు నిఘా ఉంచారు.

అక్టోబర్ 24న ఎప్పటిలాగే దేవరకద్ర మార్కెట్ యార్డులో హమాలి పని ముగించుకొని బైక్ పై మైబు ఒంటరిగా గ్రామానికి వెళ్లడాన్ని గమనించారు. అజిలాపూర్ స్టేజీ వద్ద బైక్‌ను అడ్డగించి వేట కోడవళ్లతో దాడి చేశారు. వారి నుంచి మైబు తప్పించుకొని పారిపోతుండగా వెంటాడి మరి కిరాతకంగా నరికి చంపారు. కొడవళ్లను సమీప ప్రాంతంలోని ఓ నీటి గుంతలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇక కాల్ డేటా ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మైబు కుమారుడు అనిల్ వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా సుపారీ వివరాలను సైతం వెల్లడించారు. దీంతో ప్రధాన నిందితుడు అక్కినొళ్ల హనుమన్న, గొల్ల మహేశ్, చిన్నరాములును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక మరో నిందితుడు ఇటివల జరిగిన ఓ హత్య కేసులో జైలులోని ఉండడంతో పీటీ వారెంట్ జారీ చేసి అరెస్టు చేయనున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కుమారుడు చేసిన తప్పుకు తండ్రిని కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర భయాందోళన రేపుతోంది.వివాహేతర సంబంధాలకు ఏ తప్పు చేయని కుటుంబ సభ్యులు బలవడం ఆవేదన కలిగిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..