Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhakishan Damani: డిగ్రీ మధ్యలోనే వదిలేసిన యువకుడు..ఇప్పుడు వెయ్యికోట్ల ఖరీదైన ఇల్లు కొన్నాడు..డీమార్ట్ అధినేత సక్సెస్ స్టోరీ!

జీవితంలో బ్రతకడానికి చదువు సరిపోతుంది.. కానీ, ఎదగడానికి ఇంకా ఎన్నో కావాలి. అందులోనూ కాలినడకన జీవితాన్ని ప్రారంభించి.. లెక్కలేనన్ని కార్లలో తిరిగే స్థాయికి చేరాలంటే?

Radhakishan Damani: డిగ్రీ మధ్యలోనే వదిలేసిన యువకుడు..ఇప్పుడు వెయ్యికోట్ల ఖరీదైన ఇల్లు కొన్నాడు..డీమార్ట్ అధినేత సక్సెస్ స్టోరీ!
Radhakishan Damani
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 04, 2021 | 10:34 AM

Radhakishan Damani: జీవితంలో బ్రతకడానికి చదువు సరిపోతుంది.. కానీ, ఎదగడానికి ఇంకా ఎన్నో కావాలి. అందులోనూ కాలినడకన జీవితాన్ని ప్రారంభించి.. లెక్కలేనన్ని కార్లలో తిరిగే స్థాయికి చేరాలంటే? ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. మరెన్నో జీవన పాఠాలు నేర్చుకోవాలి. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి వారి ముంగిట అదృష్టం కొలువు తీరుతుంది. విజయం వారి నీడలా నిలుస్తుంది.

ఎవరైనా కోటి రూపాయలు ఇంకా ఎక్కువైతే ఓ వందకోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటారు. వారి వారి తాహతు బట్టి అది ఉంటుంది. మరి వెయ్యికోట్ల రూపాయల ఇల్లు కొన్నారంటే.. అదీ ముంబయిలో.. ఆయన ఏ రేంజి వ్యక్తో ఊహించగలరా? డీ మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ! ఇప్పుడు ఈ పేరు భారతీయ వ్యాపారుల్లోనే కాదు.. సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇంత ఆసక్తి రేపుతున్న రాధాకిషన్ జీవితం ఏమీ వడ్డించిన విస్తరి కాదు. ఒక సింగిల్ రూమ్ అపార్ట్మెంట్ నుంచి వెయ్యికోట్ల భవంతి వరకూ ఎంత దూరం ఉందొ.. అంతకన్నా ఎక్కువ కష్టం ఉంది. డీ మార్ట్ అధినేతగా మనకందరికీ తెలిసిన రాధాకిషన్ దమానీ డిగ్రీ డ్రాపవుట్ అంటే నమ్మగలరా? మరి డిగ్రీ డ్రాపవుట్.. ఇప్పుడు ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యారు? అయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.

అసలు ఎవరీ రాధాకిషన్?

రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో ఒక సాధారణ మార్వాడీ కుటుంబంలో 1954 మార్చి 15న పుట్టారు రాధాకిషన్.  అయన తండ్రి ముంబై దలాల్ స్ట్రీట్ లో చిన్న ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో ఒక చిన్న సింగిల్ రూమ్ అపార్ట్మెంట్ లో ఈయన కుటుంబం నివాసం ఉండేది. యూనివర్సిటీ ఆఫ్ ముంబయి లో కామర్స్ డిగ్రీలో చేరిన రాధాకిషన్ మొదటి సంవత్సరంలోనే తన చదువు వదిలేశారు. వ్యాపారాల మీద ఆసక్తితో ఆయన మొదట బాల్ బేరింగ్ వ్యాపారం ప్రారంభించారు. ఆయన తండ్రి మరణించడంతో ఆ వ్యాపారాన్ని వదిలేసి స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టారు.

స్టాక్ మార్కెట్ తో ముందుకు..

స్టాక్ మార్కెట్ లో రాధాకిషన్ చిన్న షేర్లు కొనడం..అమ్మడం చేస్తూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో (1990 ప్రాంతంలో) స్టాక్ మార్కెట్లను కుదిపేసిన హర్షద్ మెహతా దెబ్బతో చిన్న ఇన్వెస్టర్లు కుదేలు అయిపోయారు. అయినా, రాధాకిషన్ తన తెలివితేటలతో నిలదొక్కుకున్నారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో 1995 ముందువరకూ ఈయన అతి పెద్ద షేర్ హోల్డర్ గా ఉండేవారని చెబుతారు. హర్షద్ మెహతా స్కామ్ గొడవ సర్దుమణిగాకా 1992 లో రాధాకిషన్ స్టాక్ మార్కెట్ వ్యాపారం లాభాల్లో దూసుకు పోయింది.

రాధాకిషన్ తన స్టాక్ ట్రేడింగ్ టెక్నీక్స్ తో విపరీతమైన లాభాలు సాధించారు. మార్కెట్ ఒడిదుడుకులను ఒడిసి పట్టుకుని అందుకు అనుగుణంగా ట్రేడింగ్ చేయడంలో రాధాకిషన్ టాప్ క్లాస్ బిజినెస్ మేన్ అని ఆయనను తెలిసిన వారు చెబుతారు. మిస్టర్ వైట్ అండ్ వైట్ గా ఆయన ముంబై స్టాక్ మార్కెట్ వర్గాల్లో పాప్యులర్.

రాధాకిషన్ ఇన్వెస్ట్ చేసిన వ్యాపారాలు చూస్తే ఆయన ఎంత తెలివైన  మదుపరో తెలిసిపోతుంది. ఆయన వీఎస్టీ, ఇండియా సిమెంట్స్, ఆంధ్రా పేపర్, టీవీ టుడే నెట్వర్క్, బ్లూ డార్ట్, సుందరం ఫైనాన్స్, 3ఎం ఇండియా, జూబిలాంట్ ఫుట్ వర్క్, సెంచరీ టెక్స్టైల్స్ వంటి సంస్థల్లో ఆయన స్టాక్స్ తీసుకున్నారు. ఈయన స్టాక్ మార్కెట్ మెళకువలను తరువాత రాకేష్ ఝున్ ఝున్ వాలాకు నేర్పించారని చెప్పుకుంటారు.

ఈ స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తుండగానే 1999 లో ”అప్నా బజార్” పేరుతొ రిటైల్ ఫ్రాంచైజ్ స్టోర్ ను నేరుల్ ప్రాంతంలో నడిపించారు. అయితే, అది అంత బాగా లేకపోవడంతో దానిని వదిలేశారు.

డీ మార్ట్ తో మరింత పైకి..

అప్నా బజార్ అనుభవం తరువాత 2000 లో రాధాకిషన్ స్టాక్ మార్కెట్ వదిలేశారు. తరువాత ఆయన సొంతంగా డీ మార్ట్ హైపర్ మార్కెట్ చైన్ ను ప్రారంభించారు. ఆయన డీ మార్ట్ మొదటి స్టార్ ను పొవాయ్ ప్రాంతంలో 2002 లో ప్రారంభించారు. అది తరువాత 2010 నాటికి 25 స్టోర్లకు విస్తరించింది. తరువాత మరింత వేగంగా డీ మార్ట్ దూసుకు పోయింది. తరువాత 2017లో డీ మార్ట్ పబ్లిక్ లిస్టింగ్ కు వెళ్ళింది. ప్రస్తుతం డీ మార్ట్ కు దేశవ్యాప్తంగా 214 స్టోర్స్ ఉన్నాయి.

ప్రస్తుతం..

  • రాధాకిషన్ దమనీ ఆస్తుల విలువ 14.3 బిలియన్ డయలర్లుగా ఫోర్బ్స్ లెక్కేసింది
  • ముకేశ్ అంబానీ తరువాత దేశంలో రెండో అతి పెద్ద ధనవంతుడిగా రాధాకిషన్ ఉన్నారని ఫోర్బ్స్ చెబుతోంది.
  • రాధాకిషన్ దమనీని వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా అనీ రిటైల్ కింగ్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటారు.

ఇదీ ఒక్క రూమ్ అపార్ట్మెంట్ నుంచి వెయ్యికోట్ల భవంతి వరకూ ఎదిగిన రాధాకిషన్ దమానీ కథ. ఒక మామూలు వ్యక్తి కేవలం తన తెలివితేటలతో.. నిబద్ధతతో ఎదిగిన వైనం ఇది. యువతకు స్ఫూర్తి దాయకమైన సక్సెస్ స్టోరీ డీ మార్ట్ రాధాకిషన్ జీవితం.

Also Read: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. ‘రూపాయికే ఇడ్లీ’ అందించిన బామ్మ కమలాత్తాళ్‌కు సొంతిల్లు

SBI vs Post Office: పోస్టాఫీస్..ఎస్బీఐ డిపాజిట్ చేయాలంటే ఏది బెస్ట్? తాజా ఇంట్రస్ట్ రేట్స్ ఇవే!