అరటిపళ్ల అమ్మకం.. హోటళ్లలో పని, ఇంకొందరు చెరుకు రసం బళ్లు.. ఉపాధిహామీ పనులు, ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు ఆగమాగం

Private teachers facing difficulties with corona : దయలేని కరోనా మహమ్మారి విశృంఖలత్వానికి ప్రయివేటు బడి పంతుళ్ల బతుకు పోరు దయనీయంగా మారింది. టీచింగ్‌ను నమ్ముకున్న ప్రైవేట్ టీచర్లు కోవిడ్‌

అరటిపళ్ల అమ్మకం.. హోటళ్లలో పని, ఇంకొందరు చెరుకు రసం బళ్లు.. ఉపాధిహామీ పనులు,  ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు ఆగమాగం
Sugarcane Stalls
Follow us

|

Updated on: Apr 04, 2021 | 8:53 AM

Private teachers facing difficulties with corona : దయలేని కరోనా మహమ్మారి విశృంఖలత్వానికి ప్రయివేటు బడి పంతుళ్ల బతుకు పోరు దయనీయంగా మారింది. టీచింగ్‌ను నమ్ముకున్న ప్రైవేట్ టీచర్లు కోవిడ్‌ మహమ్మారి పుణ్యమా అని అష్ట కష్టాలు పడుతున్నారు. సెకండ్ వేవ్‌తో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు మళ్లీ మూతపడ్డాయి. యజమాన్యాలు జీతాలివ్వడం లేదు.. ఆదాయం లేక ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. అక్షరాలు దిద్దిన మాస్టార్ల బతుకులు ఆగమాగం అవుతున్నాయి. కొందరు అరటిపళ్లు అమ్ముకుంటుంటే.. ఇంకొందరు హోటళ్లలో పనిచేస్తున్నారు. మరికొందరు చెరుకు రసం బళ్లను నమ్ముకుంటున్నారు.

దేశంలో ప్రభుత్వోద్యోగులు మినహా కరోనా అన్ని రంగాలపైనా, అందరి జీవితాలపైనా ఏదో ఒకరకంగా ప్రభావం చూపించింది. లాక్‌డౌన్ తర్వాత అన్ని వృత్తుల వారు తిరిగి ఏదో రకంగా కుటుంబాలను పోషించుకుంటున్నారు. కానీ ఆ అవకాశం ప్రైవేట్ టీచర్లకు లేకుండాపోయింది. చదువునే నమ్ముకున్న మాస్టర్లు.. బడిమూతతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అంతా సవ్యంగా జరిగినప్పుడే ఎన్ని గంటలు పనిచేశారు.. ఎంతవరకు చేశారు.. ఏం చేశారనే లెక్కలేసి ప్రయివేటు యజమాన్యాలు జీతాలిచ్చాయి. మరిప్పుడు ఫీజుల్లేవ్‌.. జీతాలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నాయి.

నిజామాబాద్‌జిల్లాలో వందలోపు విద్యార్థులన్న ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కోవిడ్ ప్రభావంతో గతేడాది నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఫలితంగా పాఠశాలలు శాశ్వతంగా మూసేసే పరిస్థితి. కొందరైతే ఫర్నీచర్‌ను అమ్మకానికి పెట్టేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చిన్నాచితకా స్కూళ్లు కలిపితే వెయ్యి వరకు ఉంటాయి. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బంది రోడ్డున పడ్డారు.

ప్రైవేట్ యజమాన్యాల పరిస్థితి కూడా దుర్భరంగానే మారింది. పెట్టిన పెట్టుబడికి ఆదాయం లేని పరిస్థితి. అప్పులకి వడ్డీ కట్టడమే గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్ల మూసివేత నిర్ణయంతో నిర్వహణ, భవనాల అద్దె, కరెంట్‌ చార్జీలు, స్కూల్ బస్సుల ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేకుండాపోయిందంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు. ఇప్పటికే చాలామంది టీచర్ ఉద్యోగాలను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్నారు. కొందరు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. కానీ అక్కడా ఉపాధి దొరకడం లేదంటున్నారు. కరోనా కారణంగా టీచర్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం  స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరవాలంటున్నారు ప్రైవేట్ టీచర్లు. ప్రభుత్వం తమ గోసవిని  ఒక్కో ప్రయివేటు టీచర్‌కు కనీసం..  కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.

Read also : Corona : దేశం వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కోవిడ్‌.. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ దే ఫస్ట్ ప్లేస్