Viral News: విచిత్రం.. మగ జన్యువు లేకుండానే పుట్టిన బుల్లి సొరచేప.. నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్న వైనం
కొన్ని విషయాలు చెబితే మనకు చాలా వింతగా అనిపిస్తాయి. అసలు ఇలా ఎలా సాధ్యం అన్న అనుమానం కూడా కలుగుతుంది. తాజాగా...
కొన్ని విషయాలు చెబితే మనకు చాలా వింతగా అనిపిస్తాయి. అసలు ఇలా ఎలా సాధ్యం అన్న అనుమానం కూడా కలుగుతుంది. తాజాగా ఇటలీలో అలాంటి వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి చెబితే నిజంగా మీరు ఆశ్యర్యపోతారు. ఇటలీలోని అక్వేరియో కాలా గోనోన్ అక్వేరియంలో ఓ షార్క్ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చేప తండ్రి లేకుండా ఊపిరి పోసుకుంది. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎక్కడా వెలుగుచూడలేదు. మగ తోడు లేకుండా షార్క్ శిశువుకు జన్మనివ్వడం ప్రపంచంలోనే ఇదే ఫస్ట్ టైమ్ అని చెబుతున్నారు. అక్వేరియం సిబ్బంది ఈ విషయాన్ని ధృవీకరించారు. గత పది సంవత్సరాలుగా రెండు ఆడ సొరచేపలు అక్వేరియంలో నివసిస్తున్నాయని, ఇప్పుడు ఒక షార్క్ మగ తోడు లేకుండానే బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు. ఇది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ ఘటనపై సంబంధిత నిపుణులు స్పందించారు. పార్థినోజెనిసిస్ నరుత్పత్తి కారణంగా ఇలా జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
పార్థినోజెనిసిస్ అంటే ఏమిటి
పార్థినోజెనిసిస్ అనేది అలైంగిక పునరుత్పత్తి. దీనిలో అండం… స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందకుండానే పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ బుల్లి సొరచేప.. తన తల్లికి క్లోన్ అని నిపుణులు భావిస్తున్నారు. ఒక అండం పూర్తిగా ఎదగని మరొక అండం ద్వారా ఫలదీకరణం చేసినప్పుడు ఈ రకమైన పునరుత్పత్తి జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా ఎదగని అండం ఒక విధంగా స్పెర్మ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ వింత కేసును చూసి ఆశ్చర్యపోయిన అక్కడి సిబ్బంది ఆ అక్వేరియంలోని రెండు సొరచేపలు DNA నమూనాలను ల్యాబ్‌కు పంపారు. తద్వారా ఈ బుల్లి షార్క్.. ఏ సొరచేపకి చెందినదో తేలిపోనుంది. కాగా ఈ వార్త ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.