CM Arvind Kejriwal: ‘ఒకవేళ బెయిలిస్తే.. సీఎంగా విధులు నిర్వహించడానికి వీల్లేదు’.. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులు
లిక్కర్ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయల్‌పై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఇంకా ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ మంజూరు అంశంపై మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ..
న్యూఢిల్లీ, మే 7: లిక్కర్ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయల్‌పై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఇంకా ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ మంజూరు అంశంపై మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ప్రస్తుతం జరుగుతోన్న లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి పార్టీ అధినేతగా ఆయనకు బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.
‘ఎన్నికలు జరగకపోతే మధ్యంతర బెయిల్ ప్రశ్నే ఉండదు. కానీ ఇది ప్రజాప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్న. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే మీరు ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది క్యాస్కేడింగ్‌కు దారితీస్తుంది. అందుకే బెయిల్ మంజూరు చేస్తే.. సీఎంగా అధికారిక విధులు నిర్వహించొద్దు. ప్రభుత్వ పనితీరులో ఏ విధంగానూ జోక్యం చేసుకోకూడదు. ఏ ఫైల్‌పై సంతాకాలు చేయరాదని’ అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. దీనికి కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సమాధానం ఇస్తూ.. ‘సీఎం ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరు. అయితే ఆ కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ వాటిని తిరస్కరించకుండా చూడాలని కోర్టును కోరారు.
‘అతను ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఫిరాయింపులు ఉండబోవు. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపు ఇస్తున్నామా? ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? అంటూ ED తరపు న్యాయవాది కోర్టులో అభ్యంతరం తెలిపారు. దీనికి న్యాయస్థానం సమాధానం చెబుతూ.. ఖచ్చితంగా నేరాలలో పాలుపంచుకున్న రాజకీయ నాయకులను భిన్నంగా హ్యాండిల్ చేయాలని కోర్టు కోరుకోవడం లేదని అంగీకరించింది. కానీ దీనిని పెద్ద దృష్టితో చూడాలి. వాస్తవానికి 2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు మాత్రమే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సమయాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈడీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసులో కేజ్రీవాల్ సహకరించలేదు. 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ ఎగవేశారు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ఇది సామాన్యుడికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని కోర్టుకు తెలిపారు. ‘మీ అభ్యంతరాలను అర్ధం చేసుకున్నాం. మీ వాదనలను ఫైల్ చేయండి. మేము మీ వాదనలు వింటాం’ అని జస్టిస్ ఖన్నా అన్నారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.