నువ్వు నాకూ కుమారుడివే.. గిరిజన వ్యక్తితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆయన ఎవరంటే..?
ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బసంత్ పాండోను కలిశారు. పాండో, తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దత్తపుత్రుడిగా ప్రసిద్ధి. ద్రౌపది ముర్ముతో తన చారిత్రక బంధాన్ని వివరించి, గిరిజన సంక్షేమం కోసం డిమాండ్లు సమర్పించారు. నీవు నాకూ కుమారుడివే అని రాష్ట్రపతి ఆప్యాయంగా పలకడం ఆసక్తికరం.

ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలోని అంబికాపుర్‌లో ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. ఈ సందర్భంగా దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దత్తపుత్రుడిగా స్థానికంగా ప్రసిద్ధి చెందిన బసంత్ పాండో (81) ముర్మును కలిశారు. బసంత్ పాండోది దేశ చరిత్రలో అరుదైన స్థానం. ఆయన జీవితం దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌తో ముడిపడి ఉంది. 1952లో రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ అంబికాపుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పాండో గిరిజన తెగ ప్రజలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అప్పటికి కేవలం 8 ఏళ్ల వయసులో ఉన్న బసంత్‌ను బాబూ రాజేంద్రప్రసాద్ తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అంతేకాక ఈ బాలుడికి బసంత్ అనే పేరు కూడా ఆయనే పెట్టారు.
నాకూ కుమారిడివే..
ఆనాటి నుండి బసంత్ పాండో అంబికాపుర్ ప్రాంతంలో రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దత్తపుత్రుడిగా ప్రసిద్ధి చెందారు. 72 ఏళ్ల తర్వాత నవంబరు 20న అంబికాపుర్‌కు వచ్చిన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం బసంత్ పాండోకు లభించింది. పాండో తొలి రాష్ట్రపతితో తనకున్న చారిత్రక సంబంధాన్ని రాష్ట్రపతి ముర్ముకు వివరించారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిరునవ్వుతో స్పందిస్తూ.. నువ్వు నాకూ కుమారుడివే అని ఆప్యాయంగా పలకరించారని బసంత్ వెల్లడించారు. ఈ భేటీ ఒక చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసింది. దీనితో పాటు రాష్ట్రపతి ముర్ము ఆప్యాయత బసంత్ పాండోకు మరొక మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది.
గిరిజన సంక్షేమంపై వినతి
ఈ భేటీ సందర్భంగా బసంత్ పాండో తన గిరిజన తెగ, ఇతర గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన 5 కీలక డిమాండ్లతో కూడిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. తొలి గిరిజన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఈ వినతులను సానుకూలంగా పరిశీలిస్తారని స్థానిక గిరిజన సమాజం ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
