Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యస్వంత్ సిన్హా..?
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్ష నేతలతో మాట్లాడినా.. వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. రాష్ట్రపతి ఎన్నిక జరిగితే ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం ఖాయమని తెలిసినా..
Presidential Elections 2022: మాజీ కేంద్ర మంత్రి యస్వంత్ సిన్హా తృణముల్ కాంగ్రెస్ (TMC)కి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఆయన ఉమ్మడి అభ్యర్థి కావచ్చని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో మంగళవారం ఉదయం విపక్ష నేతలు సమావేశమైన సందర్భంలోనే యస్వంత్ సిన్హ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. జాతీయ విస్తృత ప్రయోజనాలు.. విపక్షాలను మరింత ఏకం చేసేందుకు వీలుగా టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన నిర్ణయాన్ని మమతా బెనర్జీ ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. టీఎంసీలో తనకు కల్పించిన గౌరవం పట్ల మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున యస్వంత్ సిన్హ ఉమ్మడి అభ్యర్థిగా ఉండొచ్చని కథనాలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. శరద్ పవార్ నివాసంలో జరుగుతున్న విపక్ష నేతల సమావేశం తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో నిలుస్తారని తొలత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు వినిపించింది. అయితే తాను మరింత కాలం క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెబుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో నేషనల్ కాన్ఫెరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల రేసులో నుంచి తప్పుకుంటున్నట్లు వారిద్దరూ ప్రకటించారు. దీంతో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా 84 ఏళ్ల యస్వంత్ సిన్హా పేరు తెరమీదకు వచ్చింది. సోమవారంనాడు విపక్ష నేతలు యస్వంత్ సిన్హ పేరుపై చర్చించినట్లు తెలుస్తోంది.
మాజీ కేంద్ర మంత్రి యస్వంత్ సిన్హ గతంలో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మోడీ – షా ద్వయంతో పొసగకు బీజేపీ రెబల్ నేతగా మారారు. ఆ తర్వాత టీఎంసీ తీర్థంపుచ్చుకుని.. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా అవకాశం దొరికినప్పుడల్లా బలంగా గళం వినిపిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్ష నేతలతో మాట్లాడినా.. వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. రాష్ట్రపతి ఎన్నిక జరిగితే ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం ఖాయమని తెలిసినా.. ఎన్నికను ఏకగ్రీవం చేయకూడదని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. జులై 21న ఓట్ల లెక్కింపు చేపడుతారు.