Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: తమిళనాడులో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ.. గవర్నర్‌గా తలైవా..? ప్లాన్ ఇదే..

తమిళనాడులో బీజేపీ పునాదులను మరింత బోలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే.. సంగీత దర్శకుడు ఇళయరాజాకు

Rajinikanth: తమిళనాడులో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ.. గవర్నర్‌గా తలైవా..? ప్లాన్ ఇదే..
Rajinikanth
Shaik Madar Saheb
|

Updated on: Aug 18, 2022 | 2:56 PM

Share

Governor post be given for Rajinikanth?: దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రాల వారీగా కార్యచరణను అమలు చేసి బీజేపీ.. పార్టీని స్థానికంగా పటిష్టం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాన కర్ణాటక మినహా.. బీజేపీ ఎక్కడా అధికారంలో లేదు. దీంతో.. బీజేపీ అగ్రనేతల రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా.. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు రాజ్యసభ సభ్యత్వాలను సైతం ఇచ్చారు. అయితే.. తమిళనాడులో బీజేపీ పునాదులను మరింత బోలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే.. సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను సైతం రంగంలోకి దింపేందుకు బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం.. కషాయదళం రజనీకాంత్‌కు గవర్నర్‌ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు సమచారం. గతంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ముచ్చటపడిన రజనీకాంత్‌.. ఆఖరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలా పలుమార్లు రాజకీయ ఆరంగ్రేటం చేస్తున్నాని ప్రకటించి.. ఆ తర్వాత వెనక్కితగ్గుతూ అభిమానుల్లో నిరుత్సాహం కలిగించారు. అయితే.. తమిళనాడులో బలమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న బీజేపీ రజనీకాంత్ వైపు దృష్టిపెట్టినట్లు సమాచారం. ఒకవేళ రజనీకాంత్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ మరింత బలపడుతుందని, దీంతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన పట్టు సాధించవచ్చని కమలనాధులు అంచనా వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రధాని మోడీతో భేటీ..

ఇవి కూడా చదవండి

కాగా.. ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్.. అనంతరం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్య నేతలతో వరుసగా భేటీ అయ్యారు. పార్టీ లేదా గవర్నర్ బాధ్యతలను అప్పగించేందుకే తలైవా రజనీకాంత్‌తో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి వచ్చిన మరుసటి రోజే.. రజనీకాంత్.. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. గవర్నర్‌తో భేటీ అయి రాజకీయాలపై చర్చించానంటూ బహిరంగ ప్రకటన చేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

విపక్షాల విమర్శలు..

రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్‌తో రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు రజనీపై విరుచుకుపడ్డాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సత్తాచాటేందుకు బీజేపీ రజనీని రంగంలోకి దింపుతోందని అంతటా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే.. రజనీకాంత్‌కు పార్టీ బాధ్యతలు, లేదా గవర్నర్‌ పదవి కట్టబెట్టాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు రజనీకాంత్‌తో ప్రధాని మోడీకి చిరకాల స్నేహం కూడా ఉంది. గతంలో చెన్నై వచ్చినప్పుడు.. ప్రధాని మోడీ.. రజనీకాంత్ నివాసానికి వెళ్లి ముచ్చటించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సాన్నిహిత్యం కూడా రజనీని బీజేపీకి చేరువ చేసినట్లు పేర్కొంటున్నారు. దీంతో రజనీకి గవర్నర్ పదవి వస్తుందన్న ఊహగానాలు సైతం మొదలయ్యాయి.

గవర్నర్‌గా అయితే.. ఓకే..?

అయితే.. బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌పై.. రజనీ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీలో చేరాలన్న బీజేపీ నేతల వినతికి విముఖత చూపిన రజనీకాంత్.. గవర్నర్‌ పదవికి మాత్రం అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నారు. గవర్నర్‌ పదవి చేపడితే.. ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరముండదు కనుక రజనీకాంత్ అంగీకరించినట్లు సమాచారం. ఒకవేళ రజనీ బీజేపీలో చేరకపోయినా గవర్నర్‌ బాధ్యతలు చేపడితే.. ఆయన అభిమానులు భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని కమలనాధులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనప్పటికీ.. అటు తమిళనాడుతోపాటు.. దేశ రాజకీయాల్లో మరోసారి రజనీకాంత్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన గవర్నర్ పదవి తీసుకుంటారా..? లేక పార్టీ బాధ్యతలు చేపడతారా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.